
కమిటీ సభ్యుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ(అత్యాచార నిరోధక)చట్టం, పారిశుద్ధ్య పనివారల నిషేధం, పునరావాస చట్టం కింద జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ(అనధికార)లో సభ్యుల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ డీడీ యు. చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై సామాజిక సృహ, అవగాహన కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటలో ఉన్నాయని, సంబంధిత ధ్రువపత్రాలతో (రెండు సెట్ల ఫొటోస్టాట్ కాపీలు) జూలై 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని ఆయన సూచించారు.
పవర్ లిఫ్టింగ్ ఓవరాల్
చాంపియన్ లక్ష్మి
చీరాల రూరల్: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సమరోతు లక్ష్మి, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన లక్ష్మి, గుంటూరు జిల్లా తాడికొండలో డిగ్రీ చదువుతోంది. రాష్ట్ర జట్టు తరఫున కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 69 కేజీల జూనియర్ బాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. స్క్వాడ్‌లో 177 కేజీలు ఎత్తి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంచ్‌ప్రెస్‌లో 77.5 కేజీలు, డెడ్‌లిఫ్ట్‌లో 155 కేజీలు కలిపి మొత్తం 410 బరువులు అలవోకగా ఎత్తి ఓవరాల్‌గా మూడో స్థానంలో చాంపియన్‌గా నిలిచి పతకాలతో పాటు సర్టిఫికెట్లను అందుకుంది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ అన్నదాత ప్రసాద్, సంఘ అధ్యక్షులతో పాటు సహచరులు ఆమెను అభినందించారు.