
ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ జీఎం హనుమా నాయక్
దేశ ఆర్థికాభివృద్ధిలో
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలే కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే కీలకమని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హనుమా నాయక్ పేర్కొన్నారు. శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ మహోత్సవ్‌ను శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హనుమా నాయక్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, ఐసీఏఐ సంయుక్తంగా నూతన పరిశ్రమలను నెలకొల్పడంలో సహాయ, సహకారాలను అందిస్తాయని తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలను మెరుగుపరచడంలో సహాయపడతారని వివరించారు. 2018–19 ప్రభుత్వ వార్షిక నివేదిక ప్రకారం భారతదేశంలో ఆరు మిలియన్లకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు పని చేస్తున్నాయని ఆయన వివరించారు. ఎంఎస్‌ఎంఈలో రకాలు, పెట్టుబడి పరిమితి, నమోదు కోసం ప్రమాణాలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఐసీఏఏ బ్రాంచ్ చైర్మన్ చింతా వీఎన్‌ఎస్ రఘునందన్ వివరించారు. సర్టిఫికెట్ పొందే విధానం, చిన్న వ్యాపారాలకు ప్రయోజనాలు, చెల్లింపులు వంటి అంశాలను తెలియజేశారు. కార్యక్రమంలో సీఏ తిరుమలేశ్వరరావు, ఐసీఏఐ వైస్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ్, కార్యదర్శి వనిమిరెడ్డి వెంకట నరేష్, కోశాధికారి కన్నెగంటి మృత్యుంజయరావు, సికాస చైర్మన్ నాగబీరు రాజశేఖర్, సభ్యులు షైక్ బాజీ, దేసు సంపత్, సీఏలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అధిపతులు పాల్గొన్నారు.