
రుచి అమోఘం... పీచు అధికం
వేసవి అంటే మామిడిపళ్ళ సీజన్.. నూజివీడు రసాలు.. బంగినపల్లి.. చిత్తూరు మామిడి.. కొబ్బరంటు.... చేరుకురసాలు.. సువర్ణ రేఖ.. ఇలా ఎన్నో రకాలు మననోరూరిస్తుంటాయి. ఒక్కో రకానికి ఒక్కో ఫ్లేవర్.. ఒక్కో రుచి ఒక్కో ప్రాంతానికి ఒక్కో మామిడి రకాలతో అనుబంధం.. వాటి పేరుతోనే ఆ ప్రాంతానికి సైతం ఒక గుర్తింపు.. ప్రాచుర్యం కూడా వస్తుంది.. అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాజుల సంస్థానానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మామిడి రకం ఉంది.. అది ఆ సంస్థానం వారి సొంత బ్రాండ్. వారి పెరట్లోనే కాస్తాయి.. వారి తోటల్లోనే కాస్తాయి.. వారు ఇస్తేనే తినాలి.. బయట ఎక్కడా దొరకదు.
వాస్తవానికి ఈ బొబ్బిలి .. మెట్టవలస అనేది బొబ్బిలి సంస్థానం పాలకుల సొంత బ్రాండ్. అది ఆ వీరబొబ్బిలి కోట పరిసరాల్లో తప్ప ఇంకెక్కడా పండేది కాదు, ఆ మొక్కలు ఇంకెక్కడా లేవు కూడా. దీంతో ఆ మామిడి పళ్ళను బొబ్బిలి రాజులు తమ ఆంతరంగికులు, ఆత్మీయులు, అభిమానులకు కానుకగా ఆ పళ్ళను పంపేవారు. ఏటా రాజుల చేతులమీదుగా పళ్ళను శ్వీకరించడాన్ని ఆనందంగాను, గౌరవంగాను భావించేవారు. అందుకే ఆ పళ్ళ ప్రాశస్త్యాన్ని, బ్రాండ్ వాల్యూను గుర్తించడంతోబాటు రాజుల పట్ల అమితమైన ప్రేమ, గౌరవం కలిగిన వారంతా ఆ పళ్ళను తినేసి మళ్ళీ ఆ టెంకలను కోట పరిసరాల్లో పడేసేవారట. దీంతో ఆ పళ్ళు వేరే ఎక్కడ ఆభ్యమయ్యేవికాదన్నమాట.
మొత్తానికి కొన్ని దశాబ్దాల తరువాత బొబ్బిలి సంస్థనాధీశులు తమకు ఆత్మీయులైన కొందరు రైతులకు ఆ మొక్కలు ఇవ్వడంతోబాటు మొక్కలకు అంట్లు కట్టడం నేర్పించి ఆ మామిడి పలుచోట్ల కాసేలా, పళ్లు అందరికి లభ్యమయ్యేలా ప్రోత్సహించారు. దీంతో ఆ బ్రాండ్ కాస్తా బయటి సమాజంలోకి వచ్చింది. ఇప్పుడు పలుచోట్ల ఆ పీచుమామిడి చెట్లు మధురఫలాలను ఇస్తున్నాయి. ఏదేమైనప్పటికి ఇప్పటికి మెట్టవలస పీచు రసాలు అంటే బొబ్బిలి రాజుల బ్రాండ్ అనేది ఫిక్స్ అయిపోయింది.
నన్ను గుర్తుంచుకుని నాకోసం బుట్టెడు పళ్ళను కానుకగా పంపిన మా అన్నగారు బేబీ నాయిన గారికి ధన్యవాదాలు. రుచిలోను, మధుర్యంలోను దేశంలోని వేరే ఏ గొప్ప మామిడి బ్రాండ్ కు తీసిపోనివి ఈ బొబ్బిలి మెట్టవలస రసాలు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. బంగినపల్లి, సువర్ణ రేఖ మాదిరిగా కాకుండా ఈ పీచుమామిడి టెంకకు పీచు అధికంగా ఉంటుంది. రసాన్ని పీల్చేకొద్దీ ఊరుతూనే ఉంటుంది. అందుకే ఎన్ని తిన్నా ఇంకోటి..ఇంకోటి అనేలా ఉంటాయి..