Swallowing Difficulty: మింగుడుపడని సమస్యా..? కారణాలు, పరిష్కారాలు ఇవిగో..!

Swallowing Difficulty Reasons, Solutions - Sakshi

మింగే సమయంలో నొప్పి రావడం, మింగడం ఇబ్బందిగా 
మారడం అనే సమస్యను  ఈ ప్రపంచంలోని 
ఎదుర్కోని వారంటూ ఉండరు. కనీసం జలుబు వల్లనైనా 
గొంతునొప్పి వంటి సమస్య వచ్చి... ఏదో ఒక సమయంలో 
మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి ఒకటీ అరా 
సందర్భాల్లో, సంఘటనల్లో తప్ప... మింగలేకపోవడం 
అనేది ఎప్పుడూ ఓ సమస్యగా దాదాపుగా ఎవరికీ ఉండబోదు. 
కానీ చాలామందిలో అనేక కారణాలతో మింగడం 
ఓ కష్టసాధ్యమైన పని అవుతుంది. అలాంటి ఇబ్బందులు 
ఎవరెవరిలో, ఏయే కారణాలతో వస్తాయి, 
పరిష్కారాలేమిటి వంటి అంశాలను తెలుసుకుందాం. 

మింగడానికి వచ్చే అవరోధాలకు కారణాలు అనేకం. ఉదాహరణకు కొన్ని సమస్యలను చూద్దాం. 

వైరల్‌ సమస్యల వల్ల : ∙వైరల్‌ సమస్య కారణంగా వచ్చే జలుబు లేదా ఫ్లూ ∙ఇన్ఫెక్షియస్‌ మోనోన్యూక్లియోసిస్‌ (దీన్నే గ్లాండులార్‌ ఫీవర్‌ అంటారు. ఈ సమస్య కొందరిలో దాదాపు పదిరోజుల పాటు బాధిస్తుంటుంది) ∙మీజిల్స్‌ ∙చికెన్‌పాక్స్‌. 

ఉపశమనం కోసం ఏం చేయాలి? 
∙మసాలాలు చాలా ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. సమస్య తగ్గేవరకు చప్పిడి భోజనం (బ్లాండ్‌డైట్‌) తీసుకోవాలి. 
∙బాగా విశ్రాంతి తీసుకోవాలి, కంటినిండా నిద్రపోవడం అన్నది త్వరగా తగ్గడానికి చాలా బాగా తోడ్పడుతుంది. 
∙గొంతుకు పూర్తి విశ్రాంతినివ్వాలి. గొంతుతో పనిచేసేవారు అంటే ఉదాహరణకు టీచర్లు, లెక్చరర్లు, గాయకులు, ఉపన్యాసకులు వంటి వారు సమస్య తగ్గేవరకు గొంతును వీలైనంతగా ఉపయోగించకపోవడమే మంచిది. 
∙తగినన్ని నీళ్లు/ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. 
∙వీలైనంతవరకు గోరువెచ్చటి లేదా వేడి చేసి, చల్లార్చిన ద్రవాలు తాగాలి. 
∙రోజుకు కనీసం మూడు సార్లు ఉప్పు వేసిన గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. 
∙పొగతాగడం, ఆల్కహాల్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. 
పై సూచనలు పాటించినప్పటికీ సమస్య తగ్గకపోతే ఓసారి ఈఎన్‌టీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అదెప్పుడంటే... 
∙గొంతునొప్పి (సోర్‌ థ్రోట్‌)తో బాధపడుతూ వారం రోజులకు పైగా గడిచాక కూడా సమస్య తగ్గకపోతే 
∙బొంగురుగొంతు సమస్య రెండు వారాలు గడిచాక కూడా తగ్గకపోతే ∙101 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు తగ్గకుండా అదేపనిగా జ్వరం వస్తుంటే... జ్వరం తగ్గకుండా ఉంటే. 
∙మింగడంతో పాటు శ్వాస తీసుకోవడమూ కష్టమవుతుంటే. ∙నోరు తెరవడానికే ఇబ్బందిగా ఉంటే, గొంతు పెగలడమూ కష్టమవుతుంటే ∙గొంతునొప్పితో పాటు కీళ్లనొప్పులు, చెవినొప్పి కూడా ఉంటే ∙వికారం, వాంతులు ఉంటే, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఉంటే ∙గొంతసమస్యతో పాటు చర్మంపై ర్యాష్‌ వస్తుంటే ∙మెడ దగ్గర లింఫ్‌గ్రంథులు వాచి, చేతికి/స్పర్శకు తెలుస్తుంటే 
∙టాన్సిల్స్‌ను పరిశీలనగా చూసినప్పుడు వాటిపై తెల్లటి మచ్చలు (వైట్‌ ప్యాచెస్‌) కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.  
గొంతునొప్పిగా ఉండి మింగలేకపోవడం అన్నది తాత్కాలిక సమస్యే. కానీ పైన పేర్కొన్న కండిషన్లు చాలాకాలం కొనసాగుతుంటే మాత్రం ఈఎన్‌టీ వైద్యుని తప్పక సంప్రదించాల్సిందే. 

బ్యాక్టీరియల్‌తో పాటు ఇతర సమస్యల వల్ల
∙బ్యాక్టీరియా కారణంగా గొంతుభాగంలో ఇన్ఫెక్షన్లు
∙కోరింత దగ్గు  
∙అలర్జీలు
∙వాతావరణం పూర్తిగా పొడిబారి ఉన్నప్పుడు కొందరిలో మింగడం సమస్య అవుతుంది
∙చాలాకాలంగా పొగతాగడం లేదా పొగాకు నమిలేవారిలో
∙కాలుష్యం ∙గొంతులోని కండరాలపై భారం పడటం
∙గొంతు/నోటిలో గడ్డలు
∙టాన్సిల్స్‌లో ఆహారాలు ఇరుక్కుపోయినప్పుడు
∙గొంతుపైన ఏదైనా దెబ్బతగిలినప్పుడు (ఎక్స్‌టర్నల్‌ నెక్‌ ట్రామా)
∙విటమిన్‌ లోపాలు ∙సర్వైకల్‌ స్పాండిలోసిస్‌
∙హెర్పిస్‌ 
ఇవేగాక... గొంతులోని ఫ్యారింగ్స్‌ అనే భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్‌ ‘ఫ్యారంజైటిస్‌’ సైతం దాదాపు మూడు నుంచి ఏడు రోజుల వరకు తీవ్రంగానే బాధించి, మింగడానికి అడ్డంకిగా మారుతుంది.

-డాక్టర్‌ ఇ.సి. వినయ కుమార్‌, సీనియర్‌ ఈఎన్‌టి సర్జన్‌  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top