
స్త్రీ హృదయం, ఉద్యమం తెలిసిన మహా రచయిత గూగీ వా థియాంగో. గూగీని అక్షర ప్రపంచంలోకి తీసుకువచ్చింది... మహిళ. అతడి అక్షర బలానికి ఇంధనం... మహిళా చైతన్యం...
అమ్మ లేక పోతే ‘గూగీ’ ప్రపంచ సాహిత్యానికి పరిచయం కాక పోయేవారేమో! ‘నాయనా... నాకు అక్షరం ముక్క రాదు. ఏంచేస్తావో, ఎలా చేస్తావో... నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి’ అని ఎప్పుడూ అంటూ ఉండేది. ‘అమ్మ కోరుకున్నట్లే బాగా చదువుకున్నాను. మంచి స్థితిలో ఉన్నాను’ అని సంతృప్తి పడి ఆకాశం వైపు మాత్రమే చూస్తూ కూర్చోలేదు గూగీ. వెనక్కి తిరిగి చూశారు.
‘నాయనా... నువ్వు ఇంకా చదువుకోవాలి’ అని అమ్మ అడిగినట్లు అనిపించింది. ఈసారి విశ్వవిద్యాలయం చదువులు కాదు తన కెన్యా జాతిజనుల జీవితాలను లోతుగా, మరింత లోతుగా చదివారు. కలానికి పదును పెట్టారు. మూలాలు మరవని గూగీ ప్రపంచ ప్రసిద్ధ రచయిత అయ్యారు.
అమ్మ నా హీరో
‘నా హీరోలు ఇద్దరు. ఒకరు జోమో కెన్‌యట్ట. రెండో వ్యక్తి వాన్‌జీకూ’ అనేవారు గూగీ. కెన్యన్ ప్రజల కోసం పోరాడిన యోధుడు జోమో కెన్‌యట్ట. రెండో వ్యక్తి గూగీ అమ్మ. వాన్‌జీకూ ప్రసిద్ధ ఉద్యమ నాయకురాలు కాక పోవచ్చు. అయితే ఉద్యమ చైతన్యం ఆమె వ్యక్తిత్వంలో మెరిసి పోయేది. ఆమె విద్యాధికురాలు కాక పోవచ్చు. అయితే ఆమె మాటల్లో, విశ్లేషణల్లో మేధస్సు కనిపించేది. ఆమెకు అక్షరం ముక్క కూడా తెలియదు. అయితే అక్షరం విలువ తెలుసు.
‘మా అమ్మకు చదవడం, రాయడం రాదు. అయితే నేను బాగా చదువుకోవాలని కోరుకునేది. బాగా చదువుకోవాలనే తన కలను నా ద్వారా నిజం చేసుకోవాలనుకునేది’ అంటారు గూగీ. గూగీ నాన్నకు నలుగురు భార్యలు. 28 మంది పిల్లలు. వాన్‌జీకూ (గూగీ అమ్మ) మూడో భార్య. తనది రాజ్యహింస బాధిత కుటుంబం అనవచ్చు.
‘కెన్యా ల్యాండ్ అండ్ ఫ్రీడమ్ ఆర్మీ’లో పనిచేస్తున్న ఒక సోదరుడు, స్టేట్ ఎమర్జెన్సీ సమయంలో మరో సోదరుడు హత్యకు గురయ్యారు. హోమ్ గార్డ్‌లు(కికుయూ హోంగార్డ్) చేతిలో తల్లి చిత్రహింసలకు గురైంది. గూగీ తొలి నవల ‘వీప్, నాట్ చైల్డ్’లో అమ్మ కనిపిస్తుంది. ఇందులో కథానాయకుడి కల... ఎలాంటి పరిస్థితుల్లో అయిన బాగా చదువుకోవాలని. ఎందుకంటే అది తన తల్లి కల.
చిన్న వాళ్లు అయినా... పెద్ద మనసుతో...
‘నేను ప్రసిద్ధ రచయితను’ అనే అహం గూగీలో కనిపించేది కాదు. తనకంటే వయసులో చాలా చిన్న వాళ్ల నుంచి అయినా నేర్చుకునే, ఆలోచన తీరును మార్చుకునే, అభినందించే మంచి పద్ధతి గూగీలో ఉంది. దీనికి ఉదాహరణ నైజీరియన్ రచయిత్రి చిమమాండా అదిచే. 1977లో పుట్టింది. నాలుగు నవలలు, రెండు చిన్న కథా సంకలనాలు, వ్యాసాల పుస్తకాలు తీసుకువచ్చింది.
ఆమె నవలల్లో ఒకటైన ‘హాఫ్ ఆప్ ఏ యెల్లో సన్’ గూగీకి ఇష్టమైన నవల. నైజీరియన్ అంతర్యుద్ధానికి సంబంధించి తండ్రి చెప్పిన విషయాల ఆధారంగా ఈ నవల రాసింది. ‘ఆమె నవలలోని పాత్రల గురించి ఆలోచించకుండా బియాఫ్రాన్ యుద్ధం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు’ అంటారు గూగీ. అమెరికన్ న్యూస్ టెలివిజన్‌ప్రోగ్రాం....రేచల్ మాదో షో(టీఆర్‌ఎంఎస్). రేచల్ మాదో నిర్వహించే ఈ పోగ్రాం అంటే గూగీకి చాలా ఇష్టం. ‘డ్రిఫ్ట్: ది అన్ మోర్నింగ్ ఆఫ్ అమెరికన్ మిలిటరీ పవర్’ ‘బ్లోఅవుట్: కరప్టెడ్ డెమోక్రసీ’ ‘బ్యాగ్‌మ్యాన్: ది వైల్డ్‌క్రైమ్స్’ ‘ప్రీక్వెల్: యాన్ అమెరికన్ ఫైట్ అగేనెస్ట్ ఫాసిజం’ పుస్తకాలు రాసింది రేచల్.
‘ఎంతటి జటిలమైన విషయాలను అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పడంలో రేచల్ దిట్ట. ఆమె అద్భుతమైన కథకురాలు. రేచల్‌ప్రోగ్రామ్‌లో కనిపించాలనేది నా కల’ అన్నారు గూగీ.
ఆమె సలహా ఎప్పుడూ గుర్తుపెట్టుకునేవారు
గ్రామీణుల మాటల్లో విలువైన జీవిత సత్యాలు, అనుసరించదగిన మాటలు ఉంటాయి. అందుకే వారి మాటలు వినడం అంటే గూగీకి ఇష్టం. కెన్యాలో మహిళా రైతు అయిన నెరి వాచాంగ ఇలా అన్నది... ‘మరో అయిదు పనులు నీ మీద పడకముందే నీ ముందు ఉన్న అయిదు పనులు పూర్తి చెయ్యి. అలా కాకుండా ఒకేసారి పది పనులు చేయడం ఎంత భారం!’ ‘వాచాంగ ఇచ్చిన సలహాను పాటిస్తుంటాను. పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాటించక పోతేనే ఇబ్బంది’ అంటుండేవారు గూగీ.
ఉద్యమ మహిళల గొంతుక
అద్భుత చైతన్యం ఉన్న ఎన్నో తరాల మహిళలను ప్రత్యక్ష్యంగా చూశారు గూగీ. అందుకే ఆయన రచనల్లో పోరాట పటిమ ఉన్న మహిళలు, సామాజిక, రాజకీయ మార్పు కోసం చేసే ఉద్యమాలలో క్రియాశీల పాత్ర పోషించే మహిళలు, పురుషాధిపత్యాన్ని కాలదన్ని తమదైన మార్గంలో నడిచి స్ఫూర్తినిచ్చే మహిళలు ఉంటారు. స్త్రీలపై సాగే దోపిడి, అణచితవేతను అక్షరబద్దం చేశారు గూగీ. కష్టాలు, కన్నీళ్లు మహిళలను ఉద్యమపథంలోకి వెళ్లకుండా అడ్డుపడలేవని తన నవలల ద్వారా చె΄్పారు గూగీ.