breaking news
Ngugi wa Thiongo
-
ఆ అక్షరం అమ్మ గోరుముద్ద
స్త్రీ హృదయం, ఉద్యమం తెలిసిన మహా రచయిత గూగీ వా థియాంగో. గూగీని అక్షర ప్రపంచంలోకి తీసుకువచ్చింది... మహిళ. అతడి అక్షర బలానికి ఇంధనం... మహిళా చైతన్యం...అమ్మ లేక పోతే ‘గూగీ’ ప్రపంచ సాహిత్యానికి పరిచయం కాక పోయేవారేమో! ‘నాయనా... నాకు అక్షరం ముక్క రాదు. ఏంచేస్తావో, ఎలా చేస్తావో... నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి’ అని ఎప్పుడూ అంటూ ఉండేది. ‘అమ్మ కోరుకున్నట్లే బాగా చదువుకున్నాను. మంచి స్థితిలో ఉన్నాను’ అని సంతృప్తి పడి ఆకాశం వైపు మాత్రమే చూస్తూ కూర్చోలేదు గూగీ. వెనక్కి తిరిగి చూశారు.‘నాయనా... నువ్వు ఇంకా చదువుకోవాలి’ అని అమ్మ అడిగినట్లు అనిపించింది. ఈసారి విశ్వవిద్యాలయం చదువులు కాదు తన కెన్యా జాతిజనుల జీవితాలను లోతుగా, మరింత లోతుగా చదివారు. కలానికి పదును పెట్టారు. మూలాలు మరవని గూగీ ప్రపంచ ప్రసిద్ధ రచయిత అయ్యారు.అమ్మ నా హీరో‘నా హీరోలు ఇద్దరు. ఒకరు జోమో కెన్యట్ట. రెండో వ్యక్తి వాన్జీకూ’ అనేవారు గూగీ. కెన్యన్ ప్రజల కోసం పోరాడిన యోధుడు జోమో కెన్యట్ట. రెండో వ్యక్తి గూగీ అమ్మ. వాన్జీకూ ప్రసిద్ధ ఉద్యమ నాయకురాలు కాక పోవచ్చు. అయితే ఉద్యమ చైతన్యం ఆమె వ్యక్తిత్వంలో మెరిసి పోయేది. ఆమె విద్యాధికురాలు కాక పోవచ్చు. అయితే ఆమె మాటల్లో, విశ్లేషణల్లో మేధస్సు కనిపించేది. ఆమెకు అక్షరం ముక్క కూడా తెలియదు. అయితే అక్షరం విలువ తెలుసు.‘మా అమ్మకు చదవడం, రాయడం రాదు. అయితే నేను బాగా చదువుకోవాలని కోరుకునేది. బాగా చదువుకోవాలనే తన కలను నా ద్వారా నిజం చేసుకోవాలనుకునేది’ అంటారు గూగీ. గూగీ నాన్నకు నలుగురు భార్యలు. 28 మంది పిల్లలు. వాన్జీకూ (గూగీ అమ్మ) మూడో భార్య. తనది రాజ్యహింస బాధిత కుటుంబం అనవచ్చు. ‘కెన్యా ల్యాండ్ అండ్ ఫ్రీడమ్ ఆర్మీ’లో పనిచేస్తున్న ఒక సోదరుడు, స్టేట్ ఎమర్జెన్సీ సమయంలో మరో సోదరుడు హత్యకు గురయ్యారు. హోమ్ గార్డ్లు(కికుయూ హోంగార్డ్) చేతిలో తల్లి చిత్రహింసలకు గురైంది. గూగీ తొలి నవల ‘వీప్, నాట్ చైల్డ్’లో అమ్మ కనిపిస్తుంది. ఇందులో కథానాయకుడి కల... ఎలాంటి పరిస్థితుల్లో అయిన బాగా చదువుకోవాలని. ఎందుకంటే అది తన తల్లి కల.చిన్న వాళ్లు అయినా... పెద్ద మనసుతో...‘నేను ప్రసిద్ధ రచయితను’ అనే అహం గూగీలో కనిపించేది కాదు. తనకంటే వయసులో చాలా చిన్న వాళ్ల నుంచి అయినా నేర్చుకునే, ఆలోచన తీరును మార్చుకునే, అభినందించే మంచి పద్ధతి గూగీలో ఉంది. దీనికి ఉదాహరణ నైజీరియన్ రచయిత్రి చిమమాండా అదిచే. 1977లో పుట్టింది. నాలుగు నవలలు, రెండు చిన్న కథా సంకలనాలు, వ్యాసాల పుస్తకాలు తీసుకువచ్చింది.ఆమె నవలల్లో ఒకటైన ‘హాఫ్ ఆప్ ఏ యెల్లో సన్’ గూగీకి ఇష్టమైన నవల. నైజీరియన్ అంతర్యుద్ధానికి సంబంధించి తండ్రి చెప్పిన విషయాల ఆధారంగా ఈ నవల రాసింది. ‘ఆమె నవలలోని పాత్రల గురించి ఆలోచించకుండా బియాఫ్రాన్ యుద్ధం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు’ అంటారు గూగీ. అమెరికన్ న్యూస్ టెలివిజన్ప్రోగ్రాం....రేచల్ మాదో షో(టీఆర్‌ఎంఎస్). రేచల్ మాదో నిర్వహించే ఈ పోగ్రాం అంటే గూగీకి చాలా ఇష్టం. ‘డ్రిఫ్ట్: ది అన్ మోర్నింగ్ ఆఫ్ అమెరికన్ మిలిటరీ పవర్’ ‘బ్లోఅవుట్: కరప్టెడ్ డెమోక్రసీ’ ‘బ్యాగ్‌మ్యాన్: ది వైల్డ్క్రైమ్స్’ ‘ప్రీక్వెల్: యాన్ అమెరికన్ ఫైట్ అగేనెస్ట్ ఫాసిజం’ పుస్తకాలు రాసింది రేచల్.‘ఎంతటి జటిలమైన విషయాలను అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పడంలో రేచల్ దిట్ట. ఆమె అద్భుతమైన కథకురాలు. రేచల్ప్రోగ్రామ్లో కనిపించాలనేది నా కల’ అన్నారు గూగీ.ఆమె సలహా ఎప్పుడూ గుర్తుపెట్టుకునేవారుగ్రామీణుల మాటల్లో విలువైన జీవిత సత్యాలు, అనుసరించదగిన మాటలు ఉంటాయి. అందుకే వారి మాటలు వినడం అంటే గూగీకి ఇష్టం. కెన్యాలో మహిళా రైతు అయిన నెరి వాచాంగ ఇలా అన్నది... ‘మరో అయిదు పనులు నీ మీద పడకముందే నీ ముందు ఉన్న అయిదు పనులు పూర్తి చెయ్యి. అలా కాకుండా ఒకేసారి పది పనులు చేయడం ఎంత భారం!’ ‘వాచాంగ ఇచ్చిన సలహాను పాటిస్తుంటాను. పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాటించక పోతేనే ఇబ్బంది’ అంటుండేవారు గూగీ.ఉద్యమ మహిళల గొంతుకఅద్భుత చైతన్యం ఉన్న ఎన్నో తరాల మహిళలను ప్రత్యక్ష్యంగా చూశారు గూగీ. అందుకే ఆయన రచనల్లో పోరాట పటిమ ఉన్న మహిళలు, సామాజిక, రాజకీయ మార్పు కోసం చేసే ఉద్యమాలలో క్రియాశీల పాత్ర పోషించే మహిళలు, పురుషాధిపత్యాన్ని కాలదన్ని తమదైన మార్గంలో నడిచి స్ఫూర్తినిచ్చే మహిళలు ఉంటారు. స్త్రీలపై సాగే దోపిడి, అణచితవేతను అక్షరబద్దం చేశారు గూగీ. కష్టాలు, కన్నీళ్లు మహిళలను ఉద్యమపథంలోకి వెళ్లకుండా అడ్డుపడలేవని తన నవలల ద్వారా చె΄్పారు గూగీ. -
అస్తమించిన సాహిత్యశిఖరం
నైరోబీ: ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యంపై చెరగని ముద్రవేసిన కెన్యా దిగ్గజ నవలా రచయిత, ఆరు దశాబ్దాలపాటు ఎన్నో రచనలు చేసిన ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ గూగీ వా థియాంగో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 87 సంవత్సరాలు. వలసరాజ్యం నుంచి తన కెన్యా దేశం ప్రజాస్వామ్య దేశంగా ఎదిగే క్రమంలో జరిగిన పరిణామాలను ఆయన తన రచనల్లో అక్షరబద్ధంచేశారు. జైలు జీవితం, ప్రవాస జీవితం, తీవ్ర అనారోగ్యం ఇవేవీ ఆయన రచనను అడ్డుకోలేపోయాయి. ఎన్నోసార్లు సాహిత్య నోబెల్ ఆయనను వరించబోయి కొద్దిలో తప్పిపోయిందనేది ప్రపంచవ్యాప్తంగా సాహితీవేత్తల అభిప్రాయం. ఎంతో సరళంగా, మనసుకు హత్తుకునేలా నవలలు, నాటకాలు, చిన్న కథలు, వ్యాసాలు రాశారు. సాహిత్యం మొదలు సామాజిక విమర్శ, చిన్నారుల రచనల దాకా అన్ని రకాల సాహిత్య ప్రయోగాల్లో ఆయనకు అద్భుతమైన ప్రవేశం ఉంది. స్వదేశం కెన్యాలో ఏ గ్రంథాలయంలో చూసినా ఆయన రచనల పుస్తకాల కోసం ప్రత్యేకంగా అరలు ఉంటాయి. ‘‘ కెన్యా రాజధాని నైరోబీలో 30 సంవత్సరాలకుపైగా బుక్‌స్టోర్ నిర్వహిస్తున్నా. గూగీ రచనలు అలా ఆపకుండా చదవాలనిపిస్తుంది’’ అని నూరియా బుక్‌స్టోర్ ప్రొప్రైటర్ బెన్నెట్ ఎంబాటా చెప్పారు. ‘‘కెన్యా అక్షరమాలలో సమున్నత శిఖరం గూగీ. కెన్యాలో సామాజిక న్యాయం, అధికార దుర్వినియోగంపై గూగీ ధైర్యంగా పదునైన రచనాస్త్రాలు సంధించారు. ఆఫ్రికా సాహిత్య దీపస్తంభం ఆరిపోయింది’’ అని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం గూగీకి ఘన నివాళులర్పించారు. బ్రిటిష్ వలసరాజ్యంగా ఉన్నప్పుడు కెన్యాలోని కమిరిథులో 1938 జనవరి ఐదున జేమ్స్ గూగీ జన్మించారు. తొలుత అందరూ ఆఫ్రికన్లలాగే ఇంగ్లిష్‌పై మక్కువతో ఆంగ్లంలో తొలి నవల ‘వీప్ నాట్, చైల్డ్’ రాశారు. ఇది 1964 మేలో ప్రచురితమైంది. తూర్పు ఆఫ్రికా రచయిత రాసిన పుస్తకం ప్రచురితంకావడం అదే తొలిసారి. తర్వాత ఆయన స్థానిక ‘గికుయూ’ భాషలో మాత్రమే రాయడం మొదలెట్టారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టినందుకు కొంతకాలం జైలుజీవితం అనుభవించారు. అప్పుడు కూడా ఆయన రచనను వదిలిపెట్టలేదు. తొలి ఆధునిక గికుయూ నవల ‘ డెవిల్ ఆన్ ది క్రాస్’ను జైళ్లో ఖైదీలకు ఇచ్చే టాయిలెట్ పేపర్లతో రాశారు. జైలు నుంచి విడుదలయ్యాక సైతం కుటుంబాన్ని నియంత ప్రభుత్వం హింసించడంతో వేధింపులు తట్టుకోలేక ప్రవాసజీవితం గడిపారు. జర్మనీలో బేరూత్ వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. బ్రిటన్‌లో కొన్నాళ్లు ఉండి చివరకు కాలిఫోర్నియా వర్సిటీలో బోధిస్తూ అక్కడే స్థిరపడ్డారు. 22 ఏళ్ల తర్వాత 2004లో సొంత దేశానికి వస్తే కెన్యన్లు అపూర్వస్వాగతం పలికారు. కానీ మాజీ అధికారపార్టీ పెద్దలకు ఇది ఇష్టంలేదని కొందరి అభిప్రాయం. ఈ మాటలను నిజంచేస్తూ గూగీ ఉంటున్న అపార్ట్మెంట్లోకి నలుగురు చొరబడి ఆయనను దారుణంగా కొట్టారు. భార్యను రేప్ చేశారు. తర్వాత ఆయన దాదాపు కెన్యాకు రాలేదు. ఈయనకు 1995లోనే ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినా ఎలాగోలా కోలుకున్నారు. 2019లో మూడుసార్లు గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. తర్వాత మూత్రపిండ వైఫల్యం బాధించడం మొదలెట్టింది. అనారోగ్యంతో అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని బెడ్ఫోర్డ్ సిటీలో కన్నుమూశారు. -
మా సంతోషాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
ఏడవకు నా కన్నా నీ కన్నీళ్లను ఈ ముద్దులతో తుడిచెయ్యనీ గర్జించే మేఘాల విజయం ఎంతో సేపు నిలవదులే అవి ఆకాశాన్ని ఎంతో సేపు ఆక్రమించుకొని ఉండలేవులే! – వాల్ట్ విట్మన్ పై కవితనుంచే కెన్యా రచయిత గూగీ వా థియాంగో స్ఫూర్తి పొంది తన మొదటి నవలకి ‘వీప్ నాట్ చైల్డ్’ అని పేరు పెట్టాడు. 1964లో ప్రచురితమైన ఈ నవల రాసే సమయానికి ఆయన 22 యేళ్ళ యువకుడు. 1938లో పుట్టిన గూగీ తన బాల్యాన్నీ, యవ్వనాన్నీ యుద్ధనీడలలో గడిపాడు. రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయ్యే నాటికి పాఠశాల చదువు కొనసాగిస్తూ చదువు తమ అందరికీ ఒక మంచి భవిష్యత్తును తెచ్చిపెడుతుందనే ఆశతో కన్నీటిని తుడుచుకొంటున్నాడు. అటువంటి అనుభవాన్ని మించిన గొప్ప కథా వస్తువు మరింకేముంటుంది? సాధారణంగా మొదటి రచన ఆత్మకథాత్మకం కావడం సహజం. ఇటువంటి సంక్లిష్టమైన జీవితానుభవం ఉన్నపుడు మరీనూ. గూగీ కూడా అందుకు మినహాయింపు కాదు. తెల్లవాళ్ళ దాష్టీకాన్ని గురించీ వలసపాలనలోని హింస, దౌర్జన్యం, దోపిడీ గురించీ ఇందులో చిత్రిస్తాడు. చదువుకోవాలనే బలమైన కాంక్ష ఉన్న పేద పసివాడు జొరొగో. చెప్పకుండానే అతని ఆకాంక్ష తెలుసుకున్న తల్లి యోకబి. జొరొగో కుటుంబానికి అది చిన్న కోరికేమీ కాదు. చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు స్కూలుకు వెళ్ళేందుకు ఒక జత బట్టలు కూడా కావాలి. అందుకే పిల్లలందరిలోకి ఒక్కరికే చదివే అవకాశం ఉంది. అది అందరికన్నా చిన్నవాడైన జొరొగోకి దక్కింది. ఆ ‘అదృష్టాన్ని’ నిలబెట్టుకోవడానికి జొరొగో ఏ పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ప్రధానంగా కథ. జొరొగో తండ్రి నుగొతో తన సొంత భూమిలోనే వెట్టిచేయాల్సిన పరిస్థితి. భూమిని తన ప్రాణం కన్నా మిన్నగా ఎంచుకొనే నుగొతో తన భూముల్ని ఆక్రమించుకొన్న తెల్ల భూస్వామి హావ్‌లాండ్స్ దగ్గరే పనిచేస్తుంటాడు. ఇద్దరు భార్యలు, వాళ్ళ పిల్లలు అంతా కలిపి పెద్ద కుటుంబాన్నే పోషించాల్సి వచ్చినా అతని ఇద్దరు భార్యలూ సొంత అక్కచెల్లెళ్లలా కలిసిపోయి సఖ్యంగా ఉంటారు. కానీ ఆ కుటుంబం సంతోషం కేవలం ఆ కుటుంబంలోని వ్యక్తుల మీద ఆధారపడినది కాదు. నుగొతో యజమాని హావ్‌లాండ్స్; నల్లవాడైనప్పటికీ హావ్‌లాండ్స్ తొత్తుగా పనిచేస్తూ తోటి ప్రజలని చిత్రహింసలు పెట్టే నల్ల భూస్వామి జాకబో; నుగొతో కొడుకులు పనిచేసే యజమానులు, ఇంతమంది మీద వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. హావ్లాండ్స్తో సహా ఈ అందరి పరిస్థితినీ నిర్ణయించేది అప్పటి బ్రిటిష్ వలస ప్రభుత్వం. ఈ అందరికీ అప్పటికి ఇంకా పూర్తిగా అర్థం కాకపోయినా ఎక్కడో నేపథ్యంలో జరుగుతూ పీడిత ప్రజలకు ఒక సన్నని వెలుగురేఖలా ఆశని కల్పిస్తున్న ‘మౌ మౌ’ సాయుధ పోరాటం. ఈ మొత్తం నవలలోని పరిస్థితులు ఇక్కడి పరిస్థితులతో దగ్గరగా కనిపిస్తూ ఆ పాత్రలని మనకి చేరువ చేస్తాయి. తూర్పు ఆఫ్రికాలో ఇంగ్లీషులో వెలువడిన తొలి తరం గొప్ప నవలలో ఒకటిగా ఇది పేరు పొందింది. ఈ నవలను ఎ.ఎం. అయోధ్యా రెడ్డి ‘ఏడవకు బిడ్డా’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రచురణ ‘మలుపు’. బి.అనూరాధ -
యుద్ధకాలంలో స్వప్నాలు పుస్తక ఆవిష్కరణ
-
వలసవాద విముక్తి గీతం గూగీ
సందర్భం నేను ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్ పేపర్ మీద రాశాను. నా మరో పుస్తకం ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ను జి.ఎన్. సాయిబాబా నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా ఉండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి! సీగుల్ పబ్లిషర్స్ ఆహ్వానంపై ఇండియాకు వస్తున్న సుప్రసిద్ధ కెన్యా రచయిత గూగీ వాథియాంగో ‘మలుపు’ ప్రచురణల ఆహ్వానానికి స్పందిస్తూ ‘ఇండియాకు రావాలని ఉత్సుకతతో ఉన్నాను. ఇంక హైదరాబాదుకు రావడమంటే నాకెంతో ఇష్టం. ప్రత్యేకించి ప్రొ.జి.ఎన్. సాయిబాబా అనువదిం చిన నా బాల్యజ్ఞాపకాలు ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ (Dreams in a Time of War : A Childhood Memoir) పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడమంటే అంతకన్నా ఏంకావాలి. ప్రొఫెసర్ సాయిబాబాను కలిసే అవకాశం ఉంటే ఇంకెంతో బాగుండేది’ అని రాశారు. గూగీ నవలల్లో ఆఫ్రికా ప్రజలు ద్వేషించే యూరపు వలసవాదుల తర్వాత మనకు కనిపించేది గుజరాతీ వ్యాపారులే. కాని ఆయనకు భారతప్రజల పట్ల వాళ్ల పోరాటాల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. గూగీ మొదటిసారి 1996 ఫిబ్రవరిలో ఎఐపిఆర్ఎఫ్ (ఆల్ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్) ఆహ్వానంపై ఢిల్లీలో జరిగిన జాతుల సమస్యపై అంతర్జాతీయ సదస్సుకు వచ్చాడు. అక్కడ ఆయన ప్రపంచీకరణ జాతుల సమస్య గురించి చేసిన ప్రసంగానికి సాయిబాబా అధ్యక్షత వహించాడు. అక్కడినుంచి గూగీ హైదరాబాదు, కాకతీయ వర్సిటీ, 1990 వరకు కరీంనగర్ విప్లవోద్యమ అమరుల స్మృతిలో నిర్మించిన హుస్నాబాద్ స్థూపం చూశారు. తన ఇండియా పర్యటన ప్రభావంతోనే ‘విజార్డ్ క్రౌ’ అనే బృహత్తర నవల రాశాడు. నాటినుంచీ తెలంగాణ ప్రాంతంలోని విప్లవోద్యమం, ఇక్కడి జీవితానికి, పోరాటానికి తాను ఎంచుకున్న ఒక సంభాషణ వంటి సాయిబాబాతో తనకు గాఢానుబంధం ఏర్పడింది. గూగీని ఢిల్లీ జాతీయ సదస్సుకు పిలిచిన నవీన్‌బాబు, ఆ తర్వాత కాలంలో విప్లవోద్యమంలో ఎన్కౌంటర్లో అమరుడయినాడని రాసినపుడైనా, పీపుల్స్‌వార్ కేంద్రకమిటీ సభ్యుల ఎన్కౌంటర్ తర్వాత 1999 డిసెం బర్ ఆఖరులో రాజ్యం హుస్నాబాదు స్థూపాన్ని కూల్చేసిందని రాసినా ఆయన ఈ చీకటిమబ్బు అంచున ఎప్పుడూ మీ వర్తమానంలో ఒక మెరుపుతీగ వంటి ఆకాంక్ష, ఆశ మిగిలే ఉంటాయి అని రాసేవాడు. మీకు పోరా టం ఉంటుంది, అమరుల జ్ఞాపక చిహ్నాలను తుడిచేసినా వాళ్ల ఆకాంక్షలను జెండాలుగా పూని నడిచే పోరాటం ఉంటుందని రాశారు. మనసును వలసవాదం నుంచి విముక్తం చేయాలని, భాషను ఒక పదునైన అస్త్రంగా, సాహిత్యాన్ని అత్యంత ఆధునిక, సాంకేతిక నైపుణ్యంతో మెత్తటి మట్టిలాగ మార్చగలగాలంటే భాషా సాహిత్యాలు కూడ మానవశ్రమ నుంచి ఉత్పత్తి అయినవేననే ఎరుక కలగాలని ఆయన ఢిల్లీ సదస్సులోనూ, నిజాం కాలేజి సభలోను, చలసాని ప్రసాద్ అధ్యక్షతన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విరసం సభలోనూ మాట్లాడాడు. తెలుగు భాషలో వస్తున్న ప్రజా విప్లవ సాహిత్యాన్ని నేరుగా గికియు భాషలోకి తీసుకుపోగలిగితే ఎంత బాగుండునని ఆశించాడు. ఈ అవగాహనే గూగీని ప్రజాస్వామిక పోరాటయోధుడైన సాయిబాబాతో నిరంతర అనుబంధంలో కొనసాగించింది. గూగీ తన నవలలు, నాటకాలు, ప్రజారంగస్థల నిర్మాణం వలన కెన్యాలోని నియంతలకు కన్నెర్ర అయి 1978–79 కెన్యా ఆత్యయికస్థితి కాలంలో జైలుపాలయినట్లుగానే సాయిబాబా తన గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాటం వలన జైలుపాలయ్యాడు. బెయిలుపై విడుదల కావడానికన్నా ముందే నాగపూర్ హై సెక్యూరిటీ జైల్లోని అండా సెల్లోనే గూగీ ఆత్మకథను తెలుగు చేశాడు. ‘‘అది అక్షరాలా ఒక యుద్ధకాలంలో పుట్టిన శిశువు స్వప్నాలకు ఒక యుద్ధఖైదీ చేసిన అనుసృజన. ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా దీన్ని అనువదించడం నాకు చాలా సంతోషం కలిగింది. 1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో కలిసినపుడు ఆయనతో నా కలయిక జ్ఞాపకాలను నేనెన్నటికీ మరచిపోలేను. హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో అనుకో కుండా దొరికిన నా పుస్తకం ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ తన జీవితం మీద ఎంత ప్రభావం వేసిందో తాను చెప్పడం నాకింకా గుర్తుంది. నేను ఆ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్ పేపర్ మీద రాశాను. నా పుస్తకాల్లో మరొకదాన్ని (యుద్ధకాలంలో స్వప్నాలు) అదే సాయిబాబా మహారాష్ట్రలోని నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా ఉండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి! దుర్భరమైన పరిస్థితులో అనువాదం చేయడం! ఆయన తన జీవిత, సాంస్కృతిక కార్యాచరణ కోసం జైలుజీవితం గడుపుతున్నాడంటే నాకు ఆయనతో ఇప్పుడు, మరొకసారి, ఒక ప్రత్యేకమైన బంధం ఉందనిపిస్తుంది’’. ఆ బంధం వల్లనే, ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా అతని సహచర ఖైదీలు, ఇతర రాజకీయ ఖైదీల విడుదల కోసం, నిర్బంధాలు లేని, వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘీభావ పోరాటంలో తన వంతు కర్తవ్యంగా గూగీ వా థియాంగో ఈ ఫిబ్రవరి 18న జి.ఎన్. సాయిబాబా అనువదించిన తన పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడానికి హైదరాబాదుకు వస్తున్నాడు. కానీ మన మధ్యన మన భాషలో గూగీ యుద్ధకాలపు బాల్య జ్ఞాపకాలు వివరించిన సాయిబాబా ఉండకపోవచ్చు. తానాశించినట్లుగా నాగపూర్‌కు వెళ్లి గూగీ సాయిబాబాను కలు సుకోలేక పోవచ్చు. ఇప్పటికీ ఇరువురి భావజాలంతో పెనవేసుకొని సుదృఢమవుతున్న మన స్వేచ్ఛాకాంక్షల్ని పంచుకోవడానికి ఒక సాహిత్య, సాంస్కృతిక పోరాట సాయంత్రం కలుసుకుందాం. ముఖ్యంగా ఈ బాధ్యత మనపై ఎందుకుందో తాను జైలులో బందీ అయిన రోజుల్లోనే 1978లో, కార్ల్‌మార్క్స్ మాటల్లో చెప్పాడు. అవి కార్ల్ల్ మార్క్స్‌కు ఒక కార్మిక ప్రతినిధి రాసినవి. కార్ల్‌మార్క్స్ 25 ఆగస్టు 1852 న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు చేసిన రచనలో ఉల్లేఖించాడు. ‘‘నేను నీ హక్కుల్ని విస్తృతపరచడానికి ప్రయత్నించాను. కాబట్టే నా హక్కుల్ని హరించారు. మీ అందరికోసం స్వేచ్ఛామందిరాన్ని నిర్మిం చాలని ప్రయత్నించాను. కాబట్టే నన్ను హంతకుణ్ణి చేసి జైల్లోకి తోసేశారు, నేను సత్యానికి స్వరాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాను. కాబట్టి నన్ను నిశ్శబ్దంలోకి తోసివేశారు. జైల్లో ఒంటరి నిర్బంధంలో నిశ్శబ్ద వ్యవస్థలో ఉంచారు. నువ్వు ఇది ప్రజా సంబంధమైన సమస్య కాదనవచ్చు. కానీ ఇది అయితీరుతుంది. ఎందుకంటే ఖైదీ భార్య గురించి పట్టించుకోని మనిషి కార్మికుని భార్య గురించి కూడ పట్టించుకోడు. బంధితుని పిల్లల గురించి వ్యగ్రత చూపనివాడు శ్రామిక సేవకుని పిల్లల గురించి కూడ వ్యగ్రత చూపడు. అందువల్ల ఇది ప్రజాసమస్య. (గూగీ వా థియాంగో జైలు డైరీ ‘బందీ’ జైలు నోట్స్ నుంచి) (ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా అనువదించిన గూగీ వా థియాంగో ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ పుస్తకాన్ని హైదరాబాదు, తెలుగు విశ్వవిద్యాలయంలో రేపు సాయంత్రం 5.30 గంటలకు ఆవిష్కరిస్తారు) వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు