
దేశీ విత్తనాల పరిరక్షణకు కృషి చేస్తున్న సహకార సంస్థలు
55 దేశీ రకాల విత్తనాలను అందుబాటులోకి తెస్తున్న 67 ఎఫ్‌పీఓల ఫెడరేషన్
అంతర్జాతీయ సహకార సంవత్సరంలో విత్తన సహకార స్ఫూర్తి
వేలాది సంవత్సరాల క్రితం నుంచి రైతులు తమకు నచ్చిన విత్తనాలను సాగు చేస్తూ పరిరక్షించుకుంటున్నారు. పండించిన పంటలో నుంచి మెరుగైన గింజలను విత్తనాలుగా భద్రపరచుకొని తర్వాత సీజన్‌లో విత్తుకుంటున్నారు. ఇతర రైతులతో పంచుకుంటున్నారు. ఇదొక అవిచ్ఛిన్న సంప్రదాయ విత్తన పరంపర.
1960వ దశకంలో వ్యవసాయం ఆధునికతను సంతరించుకునే వరకు విత్తనంతో వ్యాపారం అనేది పెద్దగా లేదు. వ్యాపారులు తమ సొంత యాజమాన్య హక్కుతో కూడిన విత్తనాలు రైతులకు అమ్మటం అంతకుముందు లేదు. రైతులు తరతరాలుగా తమ వద్ద వున్న ఎన్నెన్నో రకాల పంటల విత్తనాలను బహుళ పంటల పద్ధతిలో సాగుచేస్తూ ఆ విత్తన సుసంపన్నతను, వైవిధ్యతను కాపాడుకున్నారు. హరిత విప్లవ కాలం ప్రారంభమైన తర్వాత అధిక దిగుబడినిచ్చే విత్తనాలొచ్చాయి. విత్తనాలు విత్తన సంస్థలు, వ్యాపారుల చేతుల్లోకి చేరాయి. ఏక పంటల రసాయనిక వ్యవసాయం విస్తరించింది.
ఇది మన దేశంలోనే కాదు. చాలా దేశాల్లో జరిగింది ఇదే. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో కేవలం 30 ఏళ్లలో దేశీ విత్తన జాతుల్లో 90% మరుగునపడిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ విత్తనోత్పత్తి సంస్థలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రైవేటు కంపెనీల వాణిజ్య విత్తనాలే రైతులకు చాలావరకు దిక్కయ్యాయి.
ఈ పూర్వరంగంలో, దేశీ విత్తనాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తేవటానికి కమ్యూనిటీ విత్తన బ్యాంకులు కృషి చేస్తున్నాయి. అదేవిధంగా, అనేకానేక సహకార సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్.పి.ఒ.)ల సమాఖ్యలు విత్తన చట్టానికి అనుగుణంగా దేశీ విత్తనోత్పత్తికి కృషి చేస్తున్నాయి. ఈ కోవకు చెందినవే ముల్కనూరు సొసైటీ, సహజాహారం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ వంటి సహకార సంస్థలు. అంతర్జాతీయ సహకార సంవత్సరం (2025) సందర్భంగా దేశీ విత్తన పరిరక్షణ రంగంలో వెల్లివిరుస్తున్న సహకార స్ఫూర్తిపై కథనం.
ఏ భూములకు యే విత్తనం?
దేశీ విత్తనంతో పాటు సుసంపన్నమైన వ్యవసాయక సంప్రదాయ విజ్ఞానం కూడా మరుగునపడిపోతోంది.
ఈ కొరత తీరుస్తూ సహజాహారం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ‘సహజ విత్తన సంపుటి’ (దేశీ సీడ్ కాటలాగ్)ని వెలువరించింది. ఏపీ, తెలంగాణలోని సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ.) ఏపీ, తెలంగాణలో నెలకొల్పిన 67 ఎఫ్‌పీఓలు ఈ కంపెనీలో భాగస్వాములు. ఈ ఎఫ్‌పీఓలో రైతులే ఈ దేశీ, ఇంప్రూవ్డ్ విత్తనాలను పండించి, శుద్ధి చేసి, ప్యాక్‌చేసి చట్టబద్ధమైన పద్ధతిలో రైతులకు అందిస్తున్నారు.
వరి, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు చెందిన 55 రకాల మేలైన దేశీ విత్తనాలు, కొన్ని ఇంప్రూవ్డ్ వంగడా లను సహజ బీజ్ పేరుతో రైతులకు అందుబాటులోకి వచ్చాయి. దేశీ విత్తనాలను అందుబాటులోకి తేవటంతో పాటు అవి ఏయే నేలలకు అనువైనవి? వాటి ఔషధ గుణాలేమిటి? ఏయే విధంగా ఆహారంలో ఆయా దేశీ ఆహారోత్పత్తులు ఎలా ఉపయోగపడతాయి? వంటి విలువైన సమాచారాన్ని ‘సహజ విత్తన సంపుటి’ (దేశీ సీడ్ కాటలాగ్)లో జోడించటం బాగుంది.
55 మేలైన దేశీ రకాలు
సహజాహారం ఎఫ్‌పీఓల ఫెడరేషన్ అందుబాటులోకి తెచ్చిన వివిధ పంటల్లో 55 మేలైన దేశీ, ఇంప్రూవ్డ్ విత్తనాలు ఇవీ..
దేశీ వరి రకాలు: రత్నచూడి, చిట్టిముత్యాలు, రక్తశాలి, నవార, బర్మాబ్లాక్, డీఆర్‌కే (ఖోబ్రఖడే ఎంపిక చేసిన రకం), మెట్ట బుడమ లు, పరిమల సన్నాలు, బహురూపి, బరిగె, పెద్ద కేసరి వడ్లు.
ఇంప్రూవ్డ్ వరి రకాలు: బీపీటీ (5204) (సాంబ/సోనా మసూరి), ఆర్‌ఎన్‌ఆర్ 15048 (తెలంగాణ సోనా), ఎంటీయూ 1010.
దేశీ నవధాన్యాల కిట్: 16 రకాలు. 25 కిలోలు/ఎకరం (ధర రూ. 1,020).
దేశీ మిరప: బుడమ, చారు, బ్యాడిగ, పసుపు, భూత్ జోలోకియా.
దేశీ రాగులు: ఎర్ర, కళ్యాణి, ముత్యాల.
దేశీ కొర్ర: నార్వి, ఎర్ర కొర్ర.
ఇంప్రూవ్డ్ కొర్ర: కృష్ణదేవరాయ, 3085.
దేశీ జొన్న: జ్వాలాముఖి, సీతమ్మ, పచ్చ, తెల్లజొన్న.
దేశీ కంది: కొలంబో కంది, బురక.
ఇంప్రూవ్డ్ కంది: బహువార్షిక ఐసీపీఎల్ 7035, ఎల్.ఆర్.జి.
దేశీ పెసర: పిల్లపెసర, డబ్ల్యూజిజి 37 (ఇంప్రూవ్డ్).
దేశీ టమాటా: రామ్ములక్కాయ, చెర్రీ టమాటా. టమాటా: పీకేఎం1 (ఇంప్రూవ్డ్).
దేశీ చిక్కుడు: ఆదిలాబాద్, గెనుపు. గోటి 8038 (ఇంప్రూవ్డ్).
ఇంప్రూవ్డ్ వేరుశనగ: అనంతజ్యోతి, టీఎంవీ2, కే6.
దేశీ కొత్తిమీర: ధనియం (కొత్తిమీర).
దేశీ బీర: గుత్తి బీర, నేతిబీర.
దేశీ అలసంద: తెల్ల అలసంద.
దేశీ ఉలవ: తెల్లవి, నల్లవి.
దేశీ కాకర: చిట్టి.
దేశీ సొర: దిందిగల్.
‘చిట్టి ముత్యాల’కు ఏ నేల అనుకూలం?
మన హెరిటేజ్ రైస్ వెరైటీ ‘చిట్టిముత్యాలు’. సుగంధభరితమైన ఈ బియ్యం ప్రసాదం, పులిహోర, పాయసంలోకి బాగుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కేన్సర్ నిరోధకంగా ఉపయోపడుతుంది. 120–125 రోజుల పంట. సాగుకు గరుసు నేలలు, మజ్జరం నేలలు అనుకూలం. సుడిదోమ ఎక్కువగా ఆశిస్తుంది. 2.5 అడుగులు పెరుగుతుంది. 15 పిలకలు వస్తాయి. ఎకరానికి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఎవర్ని సంప్రదించాలి?
సహజ విత్తన సంపుటిలో వివరాలు పొందుపరిచిన 55 రకాల దేశీ/ఇంప్రూవ్డ్ రకాల విత్తనాలను కొనాలనుకునే రైతులు ఫోన్‌లో బుక్ చేసుకుంటే పార్శిల్‌లో తెప్పించుకోవచ్చు. బుక్ చేసుకున్న 15 రోజుల్లో పంపుతారు.
సంప్రదించాల్సిన నంబరు: కిసాన్ మిత్ర: 85009 83300 (ఉ.10 – సా.5)
seed@sahajaaharam.com