breaking news
Seed varieties
-
సొంత విత్తనం రైతుకు బలం
వేలాది సంవత్సరాల క్రితం నుంచి రైతులు తమకు నచ్చిన విత్తనాలను సాగు చేస్తూ పరిరక్షించుకుంటున్నారు. పండించిన పంటలో నుంచి మెరుగైన గింజలను విత్తనాలుగా భద్రపరచుకొని తర్వాత సీజన్లో విత్తుకుంటున్నారు. ఇతర రైతులతో పంచుకుంటున్నారు. ఇదొక అవిచ్ఛిన్న సంప్రదాయ విత్తన పరంపర. 1960వ దశకంలో వ్యవసాయం ఆధునికతను సంతరించుకునే వరకు విత్తనంతో వ్యాపారం అనేది పెద్దగా లేదు. వ్యాపారులు తమ సొంత యాజమాన్య హక్కుతో కూడిన విత్తనాలు రైతులకు అమ్మటం అంతకుముందు లేదు. రైతులు తరతరాలుగా తమ వద్ద వున్న ఎన్నెన్నో రకాల పంటల విత్తనాలను బహుళ పంటల పద్ధతిలో సాగుచేస్తూ ఆ విత్తన సుసంపన్నతను, వైవిధ్యతను కాపాడుకున్నారు. హరిత విప్లవ కాలం ప్రారంభమైన తర్వాత అధిక దిగుబడినిచ్చే విత్తనాలొచ్చాయి. విత్తనాలు విత్తన సంస్థలు, వ్యాపారుల చేతుల్లోకి చేరాయి. ఏక పంటల రసాయనిక వ్యవసాయం విస్తరించింది. ఇది మన దేశంలోనే కాదు. చాలా దేశాల్లో జరిగింది ఇదే. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో కేవలం 30 ఏళ్లలో దేశీ విత్తన జాతుల్లో 90% మరుగునపడిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ విత్తనోత్పత్తి సంస్థలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రైవేటు కంపెనీల వాణిజ్య విత్తనాలే రైతులకు చాలావరకు దిక్కయ్యాయి. ఈ పూర్వరంగంలో, దేశీ విత్తనాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తేవటానికి కమ్యూనిటీ విత్తన బ్యాంకులు కృషి చేస్తున్నాయి. అదేవిధంగా, అనేకానేక సహకార సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్.పి.ఒ.)ల సమాఖ్యలు విత్తన చట్టానికి అనుగుణంగా దేశీ విత్తనోత్పత్తికి కృషి చేస్తున్నాయి. ఈ కోవకు చెందినవే ముల్కనూరు సొసైటీ, సహజాహారం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ వంటి సహకార సంస్థలు. అంతర్జాతీయ సహకార సంవత్సరం (2025) సందర్భంగా దేశీ విత్తన పరిరక్షణ రంగంలో వెల్లివిరుస్తున్న సహకార స్ఫూర్తిపై కథనం. ఏ భూములకు యే విత్తనం?దేశీ విత్తనంతో పాటు సుసంపన్నమైన వ్యవసాయక సంప్రదాయ విజ్ఞానం కూడా మరుగునపడిపోతోంది. ఈ కొరత తీరుస్తూ సహజాహారం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ‘సహజ విత్తన సంపుటి’ (దేశీ సీడ్ కాటలాగ్)ని వెలువరించింది. ఏపీ, తెలంగాణలోని సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ.) ఏపీ, తెలంగాణలో నెలకొల్పిన 67 ఎఫ్పీఓలు ఈ కంపెనీలో భాగస్వాములు. ఈ ఎఫ్పీఓలో రైతులే ఈ దేశీ, ఇంప్రూవ్డ్ విత్తనాలను పండించి, శుద్ధి చేసి, ప్యాక్‌చేసి చట్టబద్ధమైన పద్ధతిలో రైతులకు అందిస్తున్నారు. వరి, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు చెందిన 55 రకాల మేలైన దేశీ విత్తనాలు, కొన్ని ఇంప్రూవ్డ్ వంగడా లను సహజ బీజ్ పేరుతో రైతులకు అందుబాటులోకి వచ్చాయి. దేశీ విత్తనాలను అందుబాటులోకి తేవటంతో పాటు అవి ఏయే నేలలకు అనువైనవి? వాటి ఔషధ గుణాలేమిటి? ఏయే విధంగా ఆహారంలో ఆయా దేశీ ఆహారోత్పత్తులు ఎలా ఉపయోగపడతాయి? వంటి విలువైన సమాచారాన్ని ‘సహజ విత్తన సంపుటి’ (దేశీ సీడ్ కాటలాగ్)లో జోడించటం బాగుంది.55 మేలైన దేశీ రకాలు సహజాహారం ఎఫ్పీఓల ఫెడరేషన్ అందుబాటులోకి తెచ్చిన వివిధ పంటల్లో 55 మేలైన దేశీ, ఇంప్రూవ్డ్ విత్తనాలు ఇవీ.. దేశీ వరి రకాలు: రత్నచూడి, చిట్టిముత్యాలు, రక్తశాలి, నవార, బర్మాబ్లాక్, డీఆర్కే (ఖోబ్రఖడే ఎంపిక చేసిన రకం), మెట్ట బుడమ లు, పరిమల సన్నాలు, బహురూపి, బరిగె, పెద్ద కేసరి వడ్లు. ఇంప్రూవ్డ్ వరి రకాలు: బీపీటీ (5204) (సాంబ/సోనా మసూరి), ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), ఎంటీయూ 1010. దేశీ నవధాన్యాల కిట్: 16 రకాలు. 25 కిలోలు/ఎకరం (ధర రూ. 1,020). దేశీ మిరప: బుడమ, చారు, బ్యాడిగ, పసుపు, భూత్ జోలోకియా. దేశీ రాగులు: ఎర్ర, కళ్యాణి, ముత్యాల. దేశీ కొర్ర: నార్వి, ఎర్ర కొర్ర. ఇంప్రూవ్డ్ కొర్ర: కృష్ణదేవరాయ, 3085. దేశీ జొన్న: జ్వాలాముఖి, సీతమ్మ, పచ్చ, తెల్లజొన్న. దేశీ కంది: కొలంబో కంది, బురక. ఇంప్రూవ్డ్ కంది: బహువార్షిక ఐసీపీఎల్ 7035, ఎల్.ఆర్.జి. దేశీ పెసర: పిల్లపెసర, డబ్ల్యూజిజి 37 (ఇంప్రూవ్డ్). దేశీ టమాటా: రామ్ములక్కాయ, చెర్రీ టమాటా. టమాటా: పీకేఎం1 (ఇంప్రూవ్డ్). దేశీ చిక్కుడు: ఆదిలాబాద్, గెనుపు. గోటి 8038 (ఇంప్రూవ్డ్). ఇంప్రూవ్డ్ వేరుశనగ: అనంతజ్యోతి, టీఎంవీ2, కే6. దేశీ కొత్తిమీర: ధనియం (కొత్తిమీర). దేశీ బీర: గుత్తి బీర, నేతిబీర. దేశీ అలసంద: తెల్ల అలసంద. దేశీ ఉలవ: తెల్లవి, నల్లవి. దేశీ కాకర: చిట్టి. దేశీ సొర: దిందిగల్.‘చిట్టి ముత్యాల’కు ఏ నేల అనుకూలం? మన హెరిటేజ్ రైస్ వెరైటీ ‘చిట్టిముత్యాలు’. సుగంధభరితమైన ఈ బియ్యం ప్రసాదం, పులిహోర, పాయసంలోకి బాగుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కేన్సర్ నిరోధకంగా ఉపయోపడుతుంది. 120–125 రోజుల పంట. సాగుకు గరుసు నేలలు, మజ్జరం నేలలు అనుకూలం. సుడిదోమ ఎక్కువగా ఆశిస్తుంది. 2.5 అడుగులు పెరుగుతుంది. 15 పిలకలు వస్తాయి. ఎకరానికి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎవర్ని సంప్రదించాలి?సహజ విత్తన సంపుటిలో వివరాలు పొందుపరిచిన 55 రకాల దేశీ/ఇంప్రూవ్డ్ రకాల విత్తనాలను కొనాలనుకునే రైతులు ఫోన్లో బుక్ చేసుకుంటే పార్శిల్లో తెప్పించుకోవచ్చు. బుక్ చేసుకున్న 15 రోజుల్లో పంపుతారు. సంప్రదించాల్సిన నంబరు: కిసాన్ మిత్ర: 85009 83300 (ఉ.10 – సా.5) seed@sahajaaharam.com -
నూతన వంగడాలను ఆవిష్కరించిన మోదీ
న్యూఢిల్లీ: కరువు కాటకాలను, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటూనే అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వీటిలో 61 పంటలకు సంబంధించిన 109 రకాల విత్తనాలున్నాయి. వీటిలో 34 ఆహార, వాణిజ్య పంటల వంగడాలు కాగా 27 ఉద్యాన పంటలకు చెందినవి. పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, చెరకు, పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్లు, కూరగాయలు, దినుసులు, ఔషధ గుణాల మొక్కల విత్తనాలు ఇలా పలురకాల నూతన వంగడాలను ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ప్రధాని వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మోదీ ముచ్చటించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) ఈ నూతన వంగడాలను అభివృద్ధిచేసింది. ఏటా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయానికి అదనపు విలువ జోడింపు ప్రస్తుతం తక్షణ అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్త వంగడాల విశిష్టతపై అక్కడి రైతులతో కలిసి చర్చించారు. తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా నూతన వంగడాలతో తమకు మరింత లబ్ధి చేకూరనుందని అక్కడి రైతులు చెప్పారు. ‘‘ తృణధాన్యాల గొప్పదనం, వాటిలోని పోషకవిలువ గురించి తెలిశాక ప్రజలు వాటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు. ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. సేంద్రీయ ఆహారం కావాలని జనం అడిగి మరీ కొనుగోలుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన వంగడాలపై దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతులకు అవగాహన పెంచాలి. కొత్త రకాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పట్ల తమలో సానుకూలత పెరిగిందని, కృషి విజ్ఞాన్ కేంద్రాల పాత్ర ఇందులో కీలకమని రైతులు చెప్పారని ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వంగడాల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయని తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. -
పొద్దుతిరుగుడు మేలు
అనువైన నేలలు, విత్తన రకాలు డీఆర్ ఎస్‌హెచ్-1, ఏపీఎస్‌హెచ్-66తో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల సంకరాలను ఎంచుకోవచ్చు.ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది. నీరు నిల్వ ఉండని తటస్థ భూ ములు, ఎర్ర, ఇసుక, రేగడి, నల్ల ఒండ్రుమట్టి నేలలు పొద్దుతిరుగుడు సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తనశుద్ధి మొలకశాతం పెంపొందించేందుకుగాను విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. విత్తుకునే ముందు ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రొడియాన్+కార్బండిజం అనే మందు 2 గ్రాములను కిలో విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి. విత్తేదూరం తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 20-25 సెం.మీ ఉంచాలి. బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ, మొక్కల మధ్య 30 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. కుదురుకు 2-3 విత్తనాలు వేయాలి. విత్తనం మొలకెత్తిన 15 రోజుల తర్వాత కుదురుకు ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తొలగించాలి. ఎరువులు ఎకరాకు 3-4 టన్నుల చివికిన పశువుల ఎరువు వేయాలి. నత్రజని ఎరువును విత్తనాలు వేసేటప్పుడు 26 కిలోలు, మొగ్గ తొడిగే దశలో 13 కిలోలు, 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో 13 కిలోలు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు, మొత్తం భాస్వరం 150 కిలోలు వేసుకోవాలి. పూత దశలో 2.0 గ్రాముల బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే విత్తనాలు అధికంగా ఏర్పడతాయి. నీటి యాజమాన్యం తేలిక నేలల్లో పది రోజులకు ఒకసారి, బరువు నేలల్లో 15 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. మొగ్గ దశ, పూత దశ, గింజ కట్టే దశ, గింజ నిండే దశలో నీటి తడులు ఇవ్వాలి. చీడపీడల నివారణ ఇలా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు 30-40 రోజుల పంటగా ఉంది. ఈ దశలో పంటలను ఆశించే చీడపీడలు, వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద గోధుమ రంగు లేదా నల్లటి వలయకారపు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశల్లో మచ్చలన్నీ కలిసిపోయి, ఆకులు ఎండి పెరుగుదల ఆగిపోతుంది. ఈ తెగులు లక్షణాలు కనిపించి న వెంటనే కార్బండిజం+మాంకోజబ్ మందు 2.0 గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ 1.9 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పువ్వు కుళ్లు లేదా తల కుళ్లు ఈ తెగులు పూత దశలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆశిస్తుంది. ప్రథమ దశలో మొక్క చివరి భాగం, పువ్వు కింద ఉన్న ఆకులు ఎండిపోతాయి. తర్వాత దశల్లో పువ్వు తొడిమ దగ్గర కుళ్లిపోయి ఎండిపోతుంది. నివారణకు ఫెన్థియాన్ ఒక మిల్లీలీటరు+నీటిలో కరిగే గంధకం 3.0 గ్రాములను లీటరు నీటికి కలిపి పూత దశలో 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు పచ్చదీపపు పురుగులు, తెల్లదోమలు, తామర పురుగులు, ఆకుల్లో రసం పీల్చి నష్టం కలుగజేస్తాయి. దీనివల్ల ఆకులన్నీ పసుపు పచ్చగా మారిపోయి, ఆ తర్వాత ఎర్రబడి ఎండిపోతాయి. వీటి నివారణకు థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లేదా ట్రైకోఫాస్ 2.0 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు పొద్దు తిరుగుడు పండించే ప్రాంతాల్లో ఈ పురుగు కనిపిస్తుంది. ఈ పురుగు లార్వాలు.. పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఒక గ్రాము థయోడికార్బ్+నోవాల్యురాన్ ఒక మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
బెండంత అండ!
అనువైన నేలలు సారవంతమైన నీరు నిలిచే తేలికపాటి నేలలు, మురుగు నీరు నిల్వని నల్లరేగడి నేలలు అనుకూలం. సాగు భూమిని 2 నుంచి 4 సాళ్లు మెత్తగా దున్నుకోవాలి. ఎకరాకు రబీ సీజన్లో 7 నుంచి 8 కిలోలు, ఖరీఫ్‌లో అయితే ఐదు కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన రకాలు పర్బనీ క్రాంతి అనే రకం మొక్కలు కొమ్మలు వేయకుండా ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. అర్క అనామిక రకం విత్తిన 55 రోజుల్లో కాపుకొస్తుంది. అర్క అభయ రకం విత్తనాలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. సంకర జాతికి చెందిన వర్ష, విజయ్, మహికో హైబ్రిడ్ నంబరు 10, 64, ప్రియ, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, సింజెంటా ఓహెచ్ 597, తులసి తదితర రకాల విత్తనాలు వేసుకోవచ్చు. ఈ రకాల విత్తనాలు ఎకరాకు 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. విత్తనశుద్ధి, నాటే విధానం కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌తో తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి. నేలను 4 నుంచి ఐదు సార్లు దున్నిన తర్వాత బోజెలు వేసుకోవాలి. వీటి మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ఒక్కో మొక్క మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండాలి. విత్తనం విత్తిన వెంటనే నీటి తడి పెట్టాలి. అనంతరం నాలుగు రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఎరువుల యాజమాన్యం రబీలో సాగు కోసం ఆఖరి దుక్కిలో ఎకరాకు ఆరు టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. అలాగే భాస్వరం వేసుకుంటే పంట బాగా ఎదుగుతుంది. ఎకరాకు 48 కిలోల నత్రజనిని రెండు విడతలుగా 30 నుంచి 45 రోజుల మధ్యలో వేయాలి. విత్తనం వేసిన నెల రోజుల వ్యవధిలో నత్రజని ఎరువును వేసుకోవాలి. పంట పూత దశలో లీటరు నీటిలో 10 గ్రాముల యూ రియా కలిపి పిచికారీ చేయాలి. తద్వారా 25 శాతం వరకు నత్రజని ఆదాతోపాటు అధిక దిగుబడి పెరుగుతుంది. మొవ్వ, కాయ తొలుచు పురుగు విత్తిన 30 రోజుల నుంచి ఈ పురుగు మొక్కలను ఆశిస్తుంది. మొవ్వు, పూత, కాయలను తొలిచి వేయడం ద్వారా నష్టం కలిగిస్తుంది. ఈ పురుగులు మొవ్వు, పూత కాయలకు రంధ్రాలు చేసి లోనికి వెళతాయి. అక్కడి పదార్థాన్ని తినేయడం వల్ల కొమ్మలు వాలిపోవడం, కాయలు పుచ్చులుగా మారడం, పూత రాలిపోవడం వంటివి జరుగుతాయి. నివారణ చర్యలు... మొవ్వు పురుగుల నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కార్బరిల్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్, ప్రొఫెనోఫాస్ మందును కలిపి 10 రోజల వ్యవధిలో రెండు సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. శంకు లేదా పల్లాకు తెగులు బెండ పంటపై ఆశించే తెగుళ్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. దీనిని వైరస్ తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన మొక్కలు ఆకులు పసుపు రంగులోకి మారి కాయలు గిడసిబారి తెల్లగా మారిపోతాయి. ఆకులు చిన్నవిగా ముడతపడి దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నివారణ చర్యలు... తెగుళ్లను తట్టుకునే అర్కఅనామిక, అర్కఅభయ్ రకాల విత్తనాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తెగులును వ్యాప్తి చేసే తెల్ల దోమను అరికట్టవచ్చు. మచ్చతెగులు ఇది సోకితే ఆకుల అడుగు భాగాన నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. దీనినే మచ్చతెగులు అంటారు. ఈ తెగులు పెరినోస్లిరోపారా అనే శిలీంద్రం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఎరిసావిటిల్లా అనే రెక్కల పురుగు ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. ఈ పురుగు ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకులపై మచ్చలు వచ్చినట్లు గుర్తిస్తే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి వారంలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తెల్లదోమ, బూడిద తెగులు తెల్లదోమ ఆశిస్తే బెండ రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఇవి ఆకులు అడుగు భాగాన చేరి రసం పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు 5 మిల్లీలీటర్ల వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు సోకితే ఆకుల పైభాగంలో, కింది భాగంలోను బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి. దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్, 2 మి.లీ. హెక్సాకోనజోల్ స్ప్రే చేయాలి.