శేషేంద్ర మేనిఫెస్టో | Nanumasa Swamy Article On Poet Gunturu Seshendra Sharma | Sakshi
Sakshi News home page

శేషేంద్ర మేనిఫెస్టో

Oct 19 2020 1:02 AM | Updated on Oct 19 2020 1:02 AM

Nanumasa Swamy Article On Poet Gunturu Seshendra Sharma - Sakshi

‘ప్యూర్‌ పొయెట్రీ కాన్సెప్ట్‌’ ప్రవేశపెట్టి కవిత్వం ఆస్వాదించేదే గాదు, దానికో లక్ష్యముందని చెప్పారు శేషేంద్ర శర్మ. సామాజిక చైతన్యాన్ని సాహిత్య ప్రగతిగా మార్చే శక్తి కవిది కావాలన్నదే ఆయన అభిమతం. 1977లో ఆయన రచించిన  కవిసేన మేనిఫెస్టో ఒక  వైజ్ఞానిక ఉద్యమ సిద్ధాంత గ్రంథం. కవిత్వంలో శబ్దం నిర్వహించే పాత్రను విస్మరించరాదన్నారు. సమతా భావాలు, సమాజ శ్రేయస్సు కావ్యసృష్టికి రెండు కళ్లలా ఉండాలన్నారు. విప్లవ కవిత్వం పేర పెడ ధోరణులు పట్టడం, అనుభూతి కవిత్వం పేర సాహిత్య విలువల్ని దిగజార్చడం లాంటి అనారోగ్యం పొడసూపిన తరుణంలో కవులకు నూతనోత్తేజాన్ని నింపారు. విదేశీ కవుల కవితాత్మను అర్థం చేసుకోకుండా అనుకరణలు సృష్టించి కావ్యాత్మను దెబ్బతీయవద్దన్నారు. 

కవిత్వం ఛందో బంధమైన కళ కాదని, సాహిత్య కళ ప్రజల కోసమని నిర్వచించిన ఉత్తమ విమర్శకుడాయన. ఆయనకింత నిశిత దృష్టిని ప్రసాదించింది మార్క్సిజమే. కావ్యసూత్ర వివేచన చేస్తూ పాతదైందని తోసేయడం, కొత్తదని అనుసరించడం భావ్యం కాదన్నారు. కవిసేన మేనిఫెస్టో రూపొందించడానికి దేశీయ సాహిత్యస్ఫూర్తితో 26 అలంకార గ్రంథాలు, మార్క్సిజం స్ఫూర్తితో 30 సాహిత్య గ్రంథాలను అధ్యయనం చేశారు. అందుకే ఆ గ్రంథం సాహిత్య విమర్శనా దృక్పథాన్ని పదునెక్కించింది. వర్తమాన ప్రపంచానికి ఉపలభ్యమైన ప్రాచీన ప్రాక్పశ్చిమ కావ్యతత్వాన్ని ఇందులో ప్రతిపాదించడం కూడా నవ్యంగా కనిపించే అంశం. తెలుగు సాహిత్య విలువల స్థాపన జరిగినందువల్ల ఉస్మానియా తెలుగు పి.జి.విద్యార్థులకు అది పాఠ్యాంశమైంది. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అని చెప్పిన జగన్నాథుని సిద్ధాంతాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విప్లవ  రసస్ఫోరకం చేసిన వారాయన. 

తండ్రి వారసత్వంగా వచ్చిన సంస్కృత పాండిత్యం, ఆంగ్లభాష పటుత్వం ఆయన్ని మహాకవిగా మల్చాయి. 1947 నుండి 2007 వరకు 11 కావ్యాలు, 12 విమర్శనా గ్రంథాలు రచించడమేగాదు నూతనంగా కావ్యేతిహాస (మహా భారతం) ప్రక్రియను ప్రవేశ పెట్టిన మార్గదర్శి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న ‘కాలరేఖ’తో తెలుగు విమర్శకు కీర్తి తెచ్చిపెట్టారు. సంప్రదాయ కవిగా రచనా జీవితాన్ని ప్రారంభించి, అభ్యుదయ కవిగా ఎదిగి, విప్లవ కవిగా తన స్థానాన్ని సుస్థిర పర్చుకొన్నారు.
-ప్రొఫెసర్‌ ననుమాస స్వామి   

(శేషేంద్ర జయంతి సభ: శేషేంద్ర 94వ జయంతి సభ అక్టోబర్‌ 20న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరగనుంది. ననుమాస స్వామి, ఎస్వీ సత్యనారాయణ, కళా జనార్దన మూర్తి, లక్ష్మణ చక్రవర్తి, టి.గౌరీశంకర్, బైస దేవదాస్‌ పాల్గొంటారు. నిర్వహణ: గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement