స్వర్ణ దేవాలయం విశేషాలు తెలుసా?

Know About Amritsar Golden Temple - Sakshi

పంజాబ్‌ రాష్ట్రం, అమృత్‌సర్‌ నగరం. ప్రఖ్యాత స్వర్ణదేవాలయం, బయట రాష్ట్రాల వాళ్లకు ‘అమృత్‌సర్‌ బంగారు దేవాలయం’గానే గుర్తింపు. ఆ బంగారు ఆలయం పేరు హర్‌మందిర్‌ సాహిబ్‌. నిజానికి హరిమందిర్‌. వాడుకలో హర్‌మందిర్‌ అయింది. దర్బార్‌ సాహిబ్‌ అని కూడా అంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అనే అర్థాలు కావు. ‘హరి’ అంటే దేవుడు అనే అర్థంలో పెట్టిన పేరు. ఈ ఆలయం సరస్సు మధ్య ఉంటుంది. ఆ సరస్సు పేరు ‘అమృత సర’. అమృతంతో నిండిన సరస్సు అని అర్థం. ఆ ప్రదేశానికి ఆ పేరు కూడా ఈ సరస్సు పేరుతోనే వచ్చింది. ఇది ఆలయం కోసం తవ్విన సరస్సు. 

బంగారంటి పేరు
మనకు అమృతసర్‌ గోల్డెన్‌ టెంపుల్‌ అనగానే గుర్తు వచ్చే సంఘటన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌. ఆ తర్వాత ఇందిరా గాంధీ దారుణ హత్య. ఆ తర్వాత అల్లర్లు, ఖలిస్థాన్‌ ఉద్యమం. ఈ ప్రభావం మన దగ్గర ఒక తరాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకా ముందుకు వెళ్తే... ఈ ఆలయ నిర్మాణం, దాడులకు గురవడం అనేది చర్విత చరణంగా సాగింది. ఎన్ని దాడులు జరిగినా మొక్కవోని దీక్షతో పునర్నిర్మించుకోవడంలో సిక్కుల సంకల్పబలం అర్థమవుతోంది. మొదట బంగారు తాపడం ఉండేది కాదు. మహారాజా రంజిత్‌ సింగ్‌ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తరవాత ఈ మందిరాన్ని మరోసారి పునర్నిర్మించాడు. అప్పుడు బంగారు తాపడం చేయించాడు. అప్పటి నుంచి ఆలయం స్వర్ణదేవాలయంగా గుర్తింపులోకి వచ్చింది. అప్పటి వరకు వాడుకలో ఉన్న పేర్లన్నీ మరుగున పడిపోయాయి. ఈ ఆలయం యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ జాబితాలో నామినేట్‌ అయి ఉంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

గుడి ముందు... ఊరు తర్వాత
సాధారణంగా ఊరు విస్తరించిన తర్వాత గుడి వెలుస్తుంది. ఊరందరి కలయిక కోసం, సామూహిక కార్యక్రమాల నిర్వహణ కోసం విశాలమైన గుడి ప్రాంగణం ఉపకరిస్తుంటుంది. ఇక్కడ మాత్రం ముందు మందిరాన్ని కట్టారు. మందిరం నిర్వహణకు అవసరమైన ఇతర నిర్మాణాలను కొనసాగించారు. అందుకవసరమైన పని వాళ్లు నెలల పాటు నివసించాల్సి వచ్చింది. వాళ్ల కోసం ఇళ్లు కట్టారు. మనుషుల జీవికకు అవసరమైన వస్తువులన్నీ ఉన్న చోట దొరకాలి. అందుకోసం వ్యాపారులను ఆహ్వానించారు. అలా ఊరయింది. సిక్కుల ఆరాధ్యమందిరం. ఈ ఒక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల 68 ఆలయాలను దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు. ఇక్కడ సిక్కులు నిర్వహించే భోజనశాలలో సర్వమానవాళికీ అనుమతి ఉంటుంది. శాకాహార భోజనం వండి పెడతారు. రోజుకు లక్షమంది వరకు ఇక్కడ భోజనం చేస్తారు.

వందేళ్ల వంటశాల
ధాబా పేరు కేసర్‌ దా ధాబా. గోల్డెన్‌ టెంపుల్‌కి కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇది వందేళ్లు దాటిన వంటశాల. జాతీయ నాయకులు లాలా లజపతి రాయ్, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆ తర్వాత ఇందిరా గాంధీ కూడా ఈ ధాబాలో నోరూరించే లాచ్చా పరాఠా, దాల్‌ మఖానీ కోసం లొట్టలు వేసేవాళ్లు. అయితే ఈ ధాబా వందేళ్ల నుంచి ఇక్కడ లేదు. లాలా కేసర్‌ మాల్, అతడి భార్య పార్వతి 1916లో పాకిస్తాన్‌లోని షేక్‌పురాలో మొదలుపెట్టారు. దేశవిభజన సమయంలో ఆ దంపతులు ధాబాను అమృతసర్‌కు మార్చారు. అప్పట్లో లాచ్చా రోటీ– దాల్‌ మఖానీ మాత్రమే వండేవాళ్లు. ఇప్పుడు వేడిగా కరకరలాడే హాట్‌ క్రిస్ప్‌ పరాఠా, మీగడ లస్సీ, పంజాబీ థాలీ, ఫిర్నీ కూడా వండుతున్నారు. ఇప్పుడు కాని మీరు కాని స్వర్ణదేవాలయాన్ని కాని చూడడానికి వెళ్లినట్లయితే... అప్పుడు ఈ ధాబాలో పంజాబీ వంటకాలను రుచి చూడడం మర్చిపోవద్దు.

రోజంతా వండుతూనే ఉంటారు
పంజాబీ వంటకాలను రాగి పాత్రలో ఎనిమిది నుంచి పన్నెండు గంటల సేపు ఉడికిస్తారు. రాజ్మా గింజలు, తాజా మీగడ, పెరుగుతో దాల్‌ మఖానీ ఉడుకుతున్న పెద్ద గుండిగ ఒక పక్క. మరో పక్క ఒక పాత్రలో  ఫిర్నీ, పెద్ద పెద్ద రాగి, ఇత్తడి పాత్రలు కళ్ల ఎదురుగానే ఉంటాయి. రోజంతా తక్కువ మంట మీద వంటలు తాజాదనం కోల్పోకుండా వేడి మీద ఉంటాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top