నొప్పి ఉపశమనానికి ఐస్‌ ప్యాక్‌, వేడికాపడం

Ice Pack And Hot Pack For Pain Relief - Sakshi

చిన్నప్పుడు మీకు కంట్లో ఏదైనా నలక పడితే దాన్ని ఊదేస్తారు. నలక తొలగిపోయాక కూడా అప్పటికీ కన్ను మంటగా ఉంటే... నోటి వేడి గాలిని టవల్‌ మీదకు ఊది అద్దడం గుర్తుందా? అవును... మనం భరించగలిగేంత వేడితో కాపడం పెడితే నొప్పి తగ్గుతుందనేది మన పూర్వికుల పరిశీలన. ఇందులోంచే వేడి కాపడం పెట్టడం అనే ప్రక్రియ ఉద్భవించి ఉంటుంది. అలాగే ఇంట్లోకి ఫ్రిజులు వచ్చాక చల్లటి ఐస్‌ ఆనించి స్పర్శ తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగించడమూ మనం నిత్యం చేసేదే. ఇలా నొప్పిని బట్టి దాని ఉపశమనం కోసం ఒక్కోసారి వేడి కాపడం (హాట్‌ ప్యాక్‌) పెట్టడం, మరికొన్ని సార్లు ఐస్‌ కాపడం (ఐస్‌ ప్యాక్‌) పెట్టడం మనందరికీ ఓ ప్రథమ చికిత్స. సాధారణంగా మనలో చాలామంది వేడి కాపడం పెట్టడమే చేస్తున్నప్పటికీ  అటు వేడికాపడం గానీ, ఇటు ఐస్‌ ప్యాక్‌ గానీ ఏయే సందర్భాల్లో పనికి వస్తుందో చూద్దాం. 

ఐస్‌ప్యాక్‌... 
కొన్నిసార్లు గాయం తగిలిన చోట ఐస్‌తో అద్దడం వల్ల ఉపశమనం కలగడం మనం చూస్తుంటాం. అయితే ఐస్‌ అద్దడం ద్వారా గాయం తాలూకు నొప్పి నుంచి ఉపశమనం పొందడం అన్నది తాజాగాయాల విషయంలోనే ఎక్కువగా జరుగుతుంది. వాటిపైనే ఐస్‌ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దెబ్బతగిలినప్పుడు ఓపెన్‌ ఊండ్‌ కాకుండా (అంటే దెబ్బ లోపల మాత్రమే తగిలి... గాయమైన చోట చిట్లడం గానీ, తెలగడం గాని లేకుండా) ఉన్నప్పుడు సాధారణంగా ఆ ప్రాంతంలో వాపు రావడం, ఎరుపెక్కడం జరుగుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశంలో కాస్త వేడిగా అనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఐస్‌ పెట్టడం వల్ల లోకలగా చల్లబడినట్లుగా అనిపిస్తుంది. ఐస్‌ పెట్టడం వల్ల అక్కడి రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి.

ఇలా రక్తనాళాల సంకోచ–వ్యాకోచాలను ‘లూయీస్‌–హంటింగ్‌ చర్య’ అంటారు. దీని వల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచబారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఆ ప్రాంతంలో వాపు, దెబ్బ త్వరగా తగ్గడానికి... రక్తనాళాల వ్యాకోచం, రక్తప్రసరణ ఎక్కువగా తోడ్పడతాయి. అంతేకాదు... ఐస్‌ పెట్టడం వల్ల కోల్డ్‌ రిసెప్టార్స్‌ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్‌కెఫలిన్స్‌ అనే స్టిమ్యులెంట్స్‌ (ఉత్ప్రేరకాలు) విడుదలవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్‌ పెట్టగానే నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్‌ కండక్షన్‌ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. 

ఎలా పెట్టాలి :
ఐస్‌ ప్యాక్‌ కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. ఐస్‌ క్యూబ్స్‌ను టవల్‌లోగాని, లేదా ఏదైనా కవర్‌లోగాని పెట్టి ఐస్‌ప్యాక్‌ పెట్టవచ్చు. అలాగే జెల్‌ప్యాక్స్‌ రూపంలోనూ వాడవచ్చు. 

వేడికాపడం ... 
సాధారణంగా నొప్పి చాలాకాలం పాటు వస్తూ ఉన్న సందర్భాల్లో (దీర్ఘకాలిక నొప్పుల్లో) వేడికాపడం బాగా పనికివస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడూ ఈ వేడికాపడం ఉపశమనం కలిగిస్తుంది. మహిళల నెలసరి సమయాల్లో నడుము వద్ద నొప్పి వస్తున్నప్పుడు వేడికాపడంతో ఒకింత ఉపశమనం కలుగుతుంది. వేడికాపడం తాలూకు ప్రభావం  చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ఉంటుంది. గాయమైన చోట వేడికాపడం పెట్టగానే ఆ పరిసరాల్లో రక్తప్రసరణ ఎక్కువవుతుంది. దాంతో అక్కడ జీవక్రియల వేగం (మెటబాలిక్‌ రేట్‌) కూడా పెరుగుతుంది. నరాలూ  ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆ ప్రాంతంలో పట్టే చెమటలో మలినాలు విసర్జితమవుతాయి. దీనివల్ల కండరాలు రిలాక్స్‌ అవుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. కొద్దికొద్దిగా వేడి కాపడం పెడుతూ ఆ ప్రక్రియను కనీసం 10–15 నిమిషాలు కొనసాగించాలి. మృదువైన బట్టను వేడినీళ్లలో ఉంచి, పిండి అద్దడం ద్వారా వేడికాపడం పెట్టవచ్చు. అయితే ఇటీవల మెడికల్‌ షాపుల్లో హాట్‌ వాటర్‌ బ్యాగ్స్‌ కూడా లభ్యమవుతున్నాయి. ఆ బ్యాగులలో వేడి చేసిన నీటిని నింపి వేడికాపడం పెట్టవచ్చు. ఇవేగాక ఇప్పుడు ఎలక్ట్రిక్‌ హీట్‌ ప్యాక్‌గాని, వ్యాక్స్‌తో గాని వేడికాపడం పెట్టే సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయి.  

ఐస్‌ కాపడం
ఏయే సందర్భాల్లో... : ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు / వాపు, మంట వచ్చిన చోట (టెండర్‌పాయింట్స్‌లో) / తాజా గాయాలు (ఫ్రెష్‌ ఇంజరీస్‌) అయినప్పుడు. ఓపెన్‌ ఇంజ్యురీ కానప్పుడు.  
సందర్భాల్లో : నడుమునొప్పి / ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి (మెకానికల్‌ బ్యాక్‌పెయిన్‌) / డిస్క్‌ పొలాప్స్‌ / సయాటికా / బహిష్టు నొప్పి వంటి వాటికి వేడికాపడం నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.    

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top