హుర్రే... మన గొంతుకి గ్రామీ

Grammys 2022: Indian-American Singer Falguni Shah, Winner Of Best Children Music Album - Sakshi

‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ అని మన తల్లులు పాడుతారు పిల్లలతో. ‘చిట్టి కన్నయ్యా... లోకం చూస్తావా’ అని పాడింది ఫాల్గుణి షా తన కొడుకుతో. పిల్లలు ఒక్కోసారి ప్రశ్నలను సంధిస్తారు. వాటికి సమాధారాలు ఇదిగో ఇలా అవార్డులను కూడా తెచ్చి పెడతాయి. ‘అమ్మా.. నా క్లాస్‌లో అందరూ ఒకేలా ఎందుకు లేరు’ అని ఫాల్గుణి షా చిన్నారి కొడుకు అడిగాడు. దానికి జవాబుగా ఆమె ఒక మ్యూజిక్‌ ఆల్బమే చేసింది. గ్రామీ గెలుచుకుంది. ఇది ఒక కొడుకు తల్లికి గెలిచి ఇచ్చిన అవార్డు. ఒక తల్లి తన కొడుకు కోసం గెలుచుకున్న అవార్డు.

అమెరికాలో చదువుకుంటున్న తొమ్మిదేళ్ల నిషాద్‌  ఒకరోజు స్కూల్‌ నుంచి వచ్చి వాళ్ల అమ్మను ‘అమ్మా... స్కూల్లో ఎందుకు అందరూ ఒకేలా ఎందుకు లేరు? రంగూ రూపం, అలవాట్లు వేరే వేరేగా ఎందుకున్నాయి?’ అని అడిగాడు.

ఆ ప్రశ్నకు  తల్లి...‘వేరే వేరేగా ఉండి కలిసి ఉండటమే ప్రపంచమంటే. ఇప్పుడు నీ దగ్గర చాలా రకాల పెన్సిల్స్‌ ఉన్నాయి. కాని అవన్నీ ఒక పెన్సిల్‌ బాక్స్‌లో ఇముడుతాయి కదా. అలాగే మనుషులు కూడా కలిసి కట్టుగా ఉంటారు’ అని జవాబు చెప్పింది.

కాని సంతృప్తి కలగలేదు. ఇలాంటి ప్రశ్నను ఎందరో పసివాళ్లు తమ తల్లులను అడుగుతూ ఉండొచ్చు. వారికి అందరు తల్లులూ జవాబు చెప్పకపోవచ్చు. వారిని తాను చేరాలి. పాట రూపంలో చేరాలి అనుకుంది. వెంటనే ‘ఏ కలర్‌ఫుల్‌ వరల్డ్‌’ పేరుతో ఆల్బమ్‌ చేసి విడుదల చేసింది. ఇది గ్రామీ మెచ్చడంతో ఏకంగా గ్రామీ అవార్డు వరించింది ఆ తల్లిని. ఆ తల్లి మరెవరో కాదు.. భారత సంతతికి చెందిన ఫాల్గుణి షా.

ముంబై గాయని
ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోన్న ఫాల్గుణి షా... ముంబైలోని జుహులో ఓ సంగీత కుటుంబంలో పుట్టింది. ఇంట్లో సంగీత వాతావరణం ఉండడం, ఫాల్గుణి తల్లి ఆల్‌ ఇండియా రేడియోలో సంగీత విద్వాంసురాలిగా పనిచేస్తుండంతో చిన్న వయసు నుంచే ఫాల్గుణికి సంగీతం మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.  రేడియోలో వస్తోన్న పాటలను ఎంతో ఇష్టంగా వినేది. ఈ ఇష్టమే సంగీతం నేర్చుకునేలా చేసింది. ప్రముఖ గుజరాతీ గాయకులు కౌముది మున్షి, ఉదయ్‌ మజుందార్‌ల దగ్గర గుజరాతీ జానపద సంగీతం, గజల్స్‌తోపాటు టుమ్రి కూడా నేర్చుకుంది ఫాల్గుణి. తరువాత సారంగీ మ్యాస్ట్రో సుల్తాన్  ఖాన్  వద్ద హిందుస్థాని  సంగీతాన్ని నేర్చుకుంది. సంప్రదాయ గాయకుడు కిశోరి అమేన్ కర్‌ వద్ద జైపూర్‌ సంప్రదాయ సంగీతం నేర్చుకుంది.

రెండుసార్లు గ్రామీకెళ్లిన ఫాలు
సంగీతం నేర్చుకుంటూ పెరిగిన ఫాల్గుణి కరిష్మా బ్యాండ్‌ నడుపుతోన్న గౌరవ్‌ షాను పెళ్లి చేసుకుంది. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లింది. అక్కడ కరిష్మా బ్యాండ్‌లో గాయకురాలుగా చేరింది. ‘ఫాలు’ అనే స్టేజ్‌ పేరుతో పాటలు పాడుతూ 2007లో ఫాల్గుణి తొలి ఆల్బమ్‌ను విడుదల చేసింది. తరువాత 2013లో ‘ఫోరస్‌ రోడ్‌’ పేరిట మరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఈ ఆల్బమ్‌ తొలిసారి గ్రామీకి షార్ట్‌ లిస్ట్‌ అయినప్పటికీ నామినేషన్ కు ఎంపిక కాలేదు.

తరువాత 2019లో ‘ఫాలూస్‌ బజార్‌’ పేరిట విడుదలైన ఆల్బమ్‌ మరోసారి గ్రామీకి నామినేట్‌ అయ్యింది. రెండుసార్లు బెస్ట్‌ చిల్డ్రన్ ్స మ్యూజిక్‌ ఆల్బమ్‌ కేటగిరిలో గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఫాల్గుణి నిలిచింది. గ్రామీ అవార్డు రానప్పటికీ ఫాల్గుణి సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపుతోనే గత కొన్నేళ్లుగా అమెరికన్  కంపోజర్‌ ఫిలిఫ్‌ గ్లాస్, అమెరికన్  మ్యుజీషియన్  సెల్లిస్ట్‌ యోయో మా, ఏఆర్‌ రెహ్మాన్ లతో కలిసి పని చేస్తోంది. ఏఆర్‌ రెహ్మాన్ కు ఆస్కార్‌ను తెచ్చిన ‘స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌’ సినిమాకు రెహ్మాన్ తో కలసి ఫాల్గుణి పని చేసింది.

ఏ కలర్‌ఫుల్‌ వరల్డ్‌
పాటల రచయిత, గాయనిగా రాణిస్తోన్న ఫాల్గుణి ఆల్బమ్స్‌లో ఎక్కువగా భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్  బీట్‌ జోడించి సమకాలిన అంశాల పాటలు ఉంటాయి. ఫాల్గుణి తొమ్మిదేళ్ల కొడుకు నిషాద్‌ న్యూయార్క్‌ సిటీలోని ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఆ స్కూల్లో వివిధ దేశాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. రోజూ వాళ్లను దగ్గర నుంచి చూస్తోన్న నిషాద్‌ ఒకరోజు....‘‘అమ్మా మా స్కూల్లో కొంతమంది నల్లగా, మరికొంతమంది తెల్లగా, ఇంకొంత మంది చామనఛాయగా ఉన్నారు. వారి ఆహారపు అలవాట్లు, ఇష్టాలు అన్నీ విభిన్నంగా ఉన్నాయి. అంతా ఒక దగ్గరే ఎలా చదువుతున్నారు?’’ అని ఫాల్గుణిని అడిగాడు.

ఈ ప్రశ్నకు సమాధానంగా...‘‘ బొమ్మలకు రంగులు నింపే రంగురంగుల కలర్‌ పెన్సిళ్లు, క్రేయాన్ ్స .. ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నప్పటికీ అన్నీ ఒకే బాక్సులోనే ఉంటాయి. అదేవిధంగా  ప్రపంచంలో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, రూపురేఖలు, నలుపు, తెలుపు, ఎరుపు, చామనఛాయ రంగులు, ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నప్పటికీ ఈ ప్రపంచం లో అంతా శాంతియుతంగా జీవించడం అనేది కూడా క్రేయాన్ ్స బాక్స్‌లాంటిదే ’’ అని వివరించింది. ఈ వివరణ ఫాల్గునికి నచ్చడంతో ఈ థీమ్‌తో భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్  బీట్స్‌ జోడించి  ‘కలర్‌ఫుల్‌ వరల్డ్‌ పేరిట (క్రెయాన్ ్స ఆర్‌ వండర్‌ ఫుల్‌)’ ఆల్బమ్‌? రూపొందించింది. ప్రస్తుతం ఈ ఆల్బమే ఫాల్గుణికి గ్రామీ అవార్డు తెచ్పిపెట్టింది.

ఏ విషయాన్ని అయినా తేలిగ్గా తీసిపారేయకుండా కాస్త విభిన్నంగా, లోతుగా ఆలోచిస్తే ప్రపంచం మెచ్చేలా కనెక్ట్‌ కావచ్చుననడానికి ఫాల్గుణి జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top