
పూర్వం విరాధ నగరాన్ని వీరవాహనుడు పాలించేవాడు. అతడు గొప్ప ధర్మాత్ముడు, దానశీలి, సత్యవాది. ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్లాడు. అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకుని, ఆయనను దర్శించుకుని, ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి, అక్కడకు వెళ్లాడు. ఆశ్రమంలో వశిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు పాదాభివందనం చేశాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనానుడు ‘మహర్షీ! యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను. అయినా నాకు నరక భయం తొలగిపోవడం లేదు. యమధర్మరాజును గాని, నరకాన్ని గాని చూడకుండా, నరకబాధలు లేకుండా మరణానంతర జీవనం గడిపే వీలుందా?’ అని అడిగాడు.
‘మహారాజా! మన మునివరేణ్యులు ఎన్నో ధర్మాలను ప్రవచించినా, కర్మ మోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, పితృకార్యం, సన్యాసం– ఇవన్నీ గొప్ప ధర్మాలు. చివరిగా వృషోత్సర్గం– అంటే, ఆబోతును యథావిధిగా విడిచిపెట్టడం గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం. మరణానంతరం అపరకర్మలు జరిపేటప్పుడు పుత్రులు గాని, ఇతరులు గాని వృషోత్సర్గం చేయకపోతే, ఆ మృతజీవుడు ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. అందువల్ల మహారాజా! నువ్వు కూడా ఒక ఆబోతును విడిచిపెట్టు. వృషోత్సర్గ మహిమ నీకు తెలియాలంటే, ఒక కథ చెబుతాను విను’ అని వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు:
ఒకప్పుడు విదేహ నగరంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఒకనాడు ఆయన పితృకార్యం కోసం దర్భలను, మోదుగు ఆకులను సేకరించడానికి అడవికి వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఆయన వాటిని సేకరిస్తుండగా, అకస్మాత్తుగా ఆయన ఎదుట నలుగురు దివ్యపురుషులు ప్రత్యక్షమయ్యారు. వారు ఆయనను ఆకాశమార్గాన తీసుకుపోయి, విశాలమైన వనం మధ్యనున్న ఒక నగరంలో వదిలారు.
అద్భుతమైన ఆ నగరంలో ధర్మవత్సుడికి రెండు రకాల మనుషులు కనిపించారు. కొందరు మలిన వస్త్రాలు ధరించి, దీనులై, నీరసులై ఉన్నారు. మరికొందరు ధగధగలాడే నగలు, రంగురంగుల వస్త్రాలు ధరించి, ఉల్లాసంగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి, అతడు ‘కలయా, వైష్ణవ మాయా’ అనుకున్నాడు. ఇంతలో అతణ్ణి అక్కడకు తీసుకువచ్చిన నలుగురు దివ్యపురుషులు అతడిని మహారాజు వద్దకు తీసుకుపోయారు.
అక్కడ ఒక మహారాజు రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ వందిమాగధులు, పరిజనం, ఎదురుగా సభాసదులు కొలువుతీరి ఉన్నారు. అంతటి మహారాజు కూడా ధర్మవత్సుడిని చూడగానే, సింహాసనం మీద నుంచి లేచి వచ్చి, అతడిని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. ‘విప్రవర్యా! మీవంటి విష్ణుభక్తుని దర్శనంతో నేడు నా జన్మ సఫలమైంది, నా వంశం పవిత్రమైంది’ అంటూ నమస్కరించాడు. ఘనంగా కానుకలు సమర్పించి, సత్కరించాడు.
ధర్మవత్సుడు కాస్త తేరుకుని, ‘మహారాజా! ఇది ఏ దేశం. ఇక్కడి జనాల్లో కొందరు దీనులై ఉంటే, ఇంకొందరు సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. దేవేంద్ర వైభవంతో నువ్వు విరాజిల్లుతుండటానికి కారణమేంటి? నన్నెందుకు ఇక్కడకు తీసుకువచ్చారు?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! నా చరిత్రను వర్ణించి చెప్పే సామర్థ్యం నాకు లేదు. అందుకు మా మంత్రివర్యులే తగినవారు’ అని పలికాడు మహారాజు.
మహారాజు మనసెరిగిన మంత్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు: ‘భూసురోత్తమా! గతజన్మలో మా మహారాజు విధిరా నగరంలో వైశ్యునిగా జన్మించారు. గోబ్రాహ్మణ సేవ చేస్తూ, నిత్యాగ్నిహోత్రుడై, అతిథి పూజ చేస్తూ, ధర్మబద్ధమైన జీవనం సాగించేవారు. ఒకనాడు ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసుకుని, స్వస్థలానికి తిరిగి వస్తుండగా, తోవలో లోమశ మహర్షి దర్శనం లభించింది. వెంటనే ఆయన లోమశ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! నా యాత్రా ఫలం వెంటనే కనిపించింది. మీ దర్శన భాగ్యం లభించింది. నాదో చిన్న కోరిక!
అంతర్బాహ్య స్థితులలో ఒకేలా ఉండే శుద్ధతను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞను పొందే సాధనమేదో తెలపండి’ అని కోరారు. అప్పుడు లోమశ మహర్షి, ‘వైశ్యవర్యా! సత్సాంగత్యం, సాధన, భక్తి, సద్విచారం ద్వారా మాత్రమే మనసు అదుపులో ఉంటుంది. మానవ జన్మలోని పాపకర్మల నుంచి విముక్తి పొందాలంటే వృషోత్సర్గం చేయాలి. వృషోత్సర్గం చేయనిదే పురుషార్థాలు నెరవేరవు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి, వృషోత్సర్గం చేయి’ అని ఆదేశించాడు.
లోమశుని ఆదేశంతో గతజన్మలో వైశ్యునిగా ఉన్న మా మహారాజు వరాహస్వామి వెలసిన పుష్కరతీర్థానికి వెళ్లి, అక్కడ వృషోత్సర్గం చేశారు. ఆ తర్వాత లోమశుని సమక్షంలో అనేక యజ్ఞాలను ఆచరించారు. ఆ పుణ్యఫలం వల్ల చాలాకాలం దివ్యలోకాలలో సకల భోగాలను అనుభవించారు. తిరిగి భూమ్మీద పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యారు’ అని చెప్పాడు మంత్రి. ‘ఈ విప్రోత్తములను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అక్కడ సురక్షితంగా దిగవిడిచి రండి’ అని మహారాజు తన భటులను ఆదేశించాడు.
ధర్మవత్సుడు ఆశ్చర్యపోయి, ‘అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు? మళ్లీ ఎందుకు పంపేస్తున్నారు?’ అని అడిగాడు. ‘విప్రోత్తమా! మీ వంటి విష్ణుభక్తులను నా సన్నిధికి పిలిపించి, సత్కరించడం నాకు అలవాటు. ఇందులో మీకు అసౌకర్యం కలిగించి ఉంటే మన్నించండి’ అని వినయంగా ప్రార్థించాడు మహారాజు. ధర్మవత్సుడు మహారాజును, ఆయన పరివారాన్ని ఆశీర్వదించి, ఆయన భటులతో కలిసి ఇంటికి వెళ్లాడు.
∙సాంఖ్యాయన
(చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!)