ఆవిష్కార మేఘం

Family Special Article About Doctor Meghana From Khammam District - Sakshi

డాక్టర్‌ మేఘన చేపట్టిన శోధనల్లో కత్తిగాటు లేని సర్జరీ ఉంది. కంటి చూపు లేని వారికి సులువైన టైప్‌ రైటర్‌ ఉంది. పేపర్‌ పరిశ్రమ కోసం చేపట్టిన ప్రయోగమూ ఉంది.  ఒక మహా వృక్షాన్ని పరిరక్షించగలిగితే...  అది వంద మొక్కలను పెంచడంతో సమానం అని నమ్ముతారు మేఘన.ఆమె ప్రయత్నానికి మెచ్చిన ఎకనమిక్‌ టైమ్స్‌... ‘ఎకనమిక్‌ టైమ్స్‌ ఇన్నోవేషన్‌ అవార్డు 2020’తో ప్రోత్సహించింది.

డాక్టర్‌ మేఘన పుట్టింది, పెరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురంలో. ఆమె తండ్రి కేంద్రప్రభుత్వ ఉద్యోగి.  సీబీఎస్‌సీ టెన్త్‌ క్లాస్‌లో 94.8 శాతం మార్కులు, ఎంసెట్‌లో 231వ ర్యాంకు, హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌లో గోల్డ్‌ మెడల్‌. ఈ తర్వాత ఏం చేయాలి? సాధారణంగా ఎవరైనా మెడిసిన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తారు లేదా ఆ పట్టాతోనే ప్రాక్టీస్‌ మొదలు పెడతారు. మేఘన మాత్రం వైద్యరంగానికి వైద్యం చేయాలనుకున్నారు. మెడిసిన్‌లో ఉండగా మొదలు పెట్టిన పరిశోధనలను కొనసాగించారు.

90 శాతం ఆసియా... ఆఫ్రికాల్లోనే
‘‘సాంకేతిక పరంగా సొసైటీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ విజువల్లీ చాలెంజ్‌డ్‌ పీపుల్‌ కోసం మాత్రం ఏ ప్రయోగమూ జరగడం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అంధుల్లో తొంభై శాతం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే ఉన్నారు. దాంతో అగ్ర రాజ్యాల పరిశోధకుల దృష్టి అంధుల మీదకు మళ్లనే లేదు. విజువల్లీ చాలెంజ్‌డ్‌ పీపుల్‌ ఉపయోగించే బ్రెయిలీ టైప్‌ రైటర్‌ అరవై నాటిది. అందులో ఆరు వందల విడిభాగాలుంటాయి, ఐదు కిలోల బరువుంటుంది. ధర కూడా అరవై వేల వరకు ఉంటుంది. దాన్ని ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం కూడా వాళ్లకు అంత సులభమేమీ కాదు.

కేవలం 28 విడిభాగాలతో ఒకటిన్నర కిలోల బరువుతో పదివేలలో వచ్చే న్యూ జనరేషన్‌ బ్రెయిలీ టైప్‌ రైటర్‌ రూపొందించాను. బాలమేధావిగా అప్పటికే పాతికకు పైగా ఆవిష్కరణలు చేసిన ప్రవీణ్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ చేశాను. ఆ టైప్‌ రైటర్‌ డిజైన్‌ని కొనుగోలు చేయడానికి పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ నేను ఆ ప్రాజెక్టును డబ్బు కోసం అమ్మదలుచుకోలేదు. అదే జరిగితే ఆ కంపెనీలు బ్రెయిలీ టైప్‌ రైటర్‌ ధరను అమాంతం పెంచేస్తాయి. అంత డబ్బు పెట్టి కొనలేని వాళ్లకు అది ఎప్పటికీ అందుబాటులోకి రాదు. విలాసవంతమైన మోడల్‌గా సంపన్నులకే పరిమితమవుతుంది. పేదవాళ్లు కూడా కొనుక్కోగలగాలంటే ధర పెరగకూడదు. అందుకే ఆఫ్రికాలో ఉన్న కిలిమంజరో బ్లైండ్‌ ట్రస్ట్‌కి ఇవ్వాలని పట్టుపట్టాను’’ అని చెప్పారు డాక్టర్‌ మేఘన. ఆమె ఆశించినట్లుగానే కిలిమంజరో ట్రస్ట్‌ కొత్తతరం టైప్‌ రైటర్‌ను తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చింది.

ఇంజక్షన్‌ చాలు
‘‘అరిగిన వెన్నుపూసకు చేసే సర్జరీ అత్యంత నైపుణ్యంతో కూడినది. ఏ మాత్రం తేడా వచ్చినా అనుబంధ సమస్యలు జీవితాంతం వేధిస్తాయి. ఆ సర్జరీకి ప్రత్యామ్నాయంగా ఓ ఇంజక్షన్‌ ద్వారా సరిచేయవచ్చని ప్రయోగాత్మకంగా చూపించాం. అది క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉంది. ఆ తర్వాత క్రాఫ్ట్‌ పేపర్‌లో ప్రయోగాలు చేశాం’’ అని చెబుతూ కాలుష్యభరితమైన కాగితం పరిశ్రమను కాలుష్యరహితంగా మార్చడానికి ప్రయోగాలను కొనసాగిస్తానని చెప్పారు డాక్టర్‌ మేఘన. రెండేళ్లలో కంపెనీ నెట్‌వర్క్‌ని 18 రాష్ట్రాలకు విస్తరించారామె. ఎకనమిక్‌ టైమ్స్‌ ఇన్నోవేషన్‌ అవార్డు కోసం 950 కంపెనీల నుంచి వచ్చిన 1,250 నామినేషన్‌ల పరిశీలన బాధ్యతను మహింద్ర అండ్‌ మహింద్ర, టీసీఎస్, సన్‌ ఫార్మా వంటి ప్రముఖ వ్యాపార దిగ్గజాల ప్రతినిధులు, ఐఐటీ ముంబయి ప్రొఫెసర్‌ చేపట్టారు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

మగవాళ్ల సామ్రాజ్యం
రెండేళ్ల కిందటి వరకు మా ప్రయోగాలను అవుట్‌సోర్సింగ్‌ ద్వారా ఇతర కంపెనీలకు ఇచ్చేశాం. కానీ ప్యాకేజింగ్‌ పేపర్‌లో జీఎఫ్‌పీ ప్రయోగాన్ని ఎవరికీ ఇవ్వలేదు. ‘ఫై ఫ్యాక్టరీ’ పేరుతో సొంతంగా పరిశ్రమ స్థాపించాం. ఇప్పటి వరకు ఈ రంగంలో మహిళలు లేరు. తొలి సీఈవోను నేనే. పేపర్‌ ఇండస్ట్రీ జాతీయ సదస్సుల్లో గుజరాత్‌కు చెందిన ఇద్దరు మహిళలను చూశాను.

అయితే వాళ్లు వారసత్వంగా వచ్చిన పరిశ్రమను నిర్వహిస్తున్నారు, పరిశ్రమ స్థాపకులు కాదు. మా ప్రయోగం ద్వారా క్రాఫ్ట్‌ పేపర్‌ను బరువు తక్కువగా, ధర తక్కువగా, మరింత దృఢంగా రూపొందించాం. మా స్లోగన్‌ కూడా ‘లైటర్, స్ట్రాంగర్‌ అండ్‌ చీపర్‌’ అనేదే. ఈ ప్రయోగంతో చెట్ల నరికివేతను తగ్గించగలుతున్నాం. ఒక టన్ను పేపర్‌ తయారీకి పదిహేడు వృక్షాలను నరకాల్సి ఉంటుంది. మేము కనిపెట్టిన టెక్నాలజీతో పద్నాలుగు వృక్షాలు సరిపోతాయి.

మా కంపెనీ ద్వారా 2,500 మెట్రిక్‌ టన్నుల క్రాఫ్ట్‌ పేపర్‌ను వాడుకలోకి తేగలిగాం. అంటే ఏడు వేల ఐదు వందల వృక్షాలను సంరక్షించిన వాళ్లమయ్యాం. మాకు వచ్చిన పురస్కారం కూడా పర్యావరణ పరిరక్షణ, నిరంతర ప్రకృతి సంరక్షణకు సంబంధించిన విభాగంలోనే. కాగితం పరిశ్రమలన్నీ ఈ కొత్త టెక్నాలజీని అనుసరిస్తే పర్యావరణహితంగా ఉంటుంది.
– మేఘనా జాలె, 
మెడికల్, ఎకలాజికల్‌ సైంటిస్ట్, సీఈవో ‘ఫై ఫ్యాక్టరీ’

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top