అర్బన్‌ రొయ్యల చెరువు!

Atarraya Announce Container Shrimp Farming Research Project - Sakshi

వాడేసిన కార్గో కంటెయినర్లలో లెట్యూస్‌ వంటి ఆకు కూరలు, కూరగాయలను హైడ్రోపోనిక్స్‌ లేదా ఆక్వాపోనిక్స్‌ పద్ధతుల్లో, మట్టి వాడకుండా కేవలం పోషక జలంతో సాగు చేసే అర్బన్‌ ఫార్మర్స్‌ చాలా దేశాల్లో ఉన్నారు. అయితే, నగరాల్లో ఆకాశ హర్మ్యాల మధ్య ఐరన్‌ కంటెయినర్లలో మంచినీటి రొయ్యల సాగు చేయటం.. అందులోనూ పర్యావరణానికి హాని కలిగించని కాలుష్య రహిత సుస్థిర అర్బన్‌ ఆక్వా సాగు పద్ధతులను అనుసరించడం సుసాధ్యమేనని రుజువు చేస్తోంది ‘అతర్రాయ’ అనే సంస్థ. కొద్దిపాటి శిక్షణతోనే కాలుష్య రహిత పద్ధతిలో కంటెయినర్‌ రొయ్యల సాగును సులువుగా నేర్పిస్తోంది ఈ సంస్థ. కంటెయినర్‌లో బయోఫ్లాక్‌ పద్ధతిలో రొయ్యల సాగు చేసే ‘ష్రింప్‌ బాక్స్‌’ సాంకేతికతపై పేటెంట్‌ పొందిన ఈ సంస్థ మెక్సికో కేంద్రంగా పనిచేస్తోంది. 

సాధారణ పద్ధతుల్లో సాగే రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్, రసాయనాలు, గ్రోత్‌ హోర్మోన్స్‌ వాడుతున్నారు. వ్యర్థ జలాలతో సముద్రం కలుషితమవుతోంది. ‘మేం ఈ సమస్యలేవీ లేకుండా ఎథికల్‌ ఆక్వాకల్చర్‌ పద్ధతిలో ఎక్కడ కావాలంటే అక్కడే కంటెయినర్‌లో సులభంగా రొయ్యలు సాగు చేసే అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో తొలిగా అందుబాటులోకి తెచ్చామ’ని అతర్రాయ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి డేనియల్‌ రసెక్‌ అంటున్నారు. 

రసెక్‌ మెక్సికోలో కాలేజీ విద్యను పూర్తి చేసుకొని 2005లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మత్స్యకారుల జీవితాలను మెరుగుపరచేందుకు కృషి చేశారు. ఆక్వాకల్చర్‌ను సుస్థిర సేద్య పద్ధతులపై పనిచేయడానికి ఓ స్టార్టప్‌ సంస్థను స్థాపించారు. ‘మెక్సికో ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో విస్తారమైన చెరువుల్లో సాగు పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు అతి తక్కువ చోటులో తక్కువ కాలుష్యం కలిగించే సుస్థిర సాగు పద్ధతులపై అధ్యయనం చేపట్టాం. 2019లో ఇతర వనరుల నుంచి ఆర్థిక సహాయం అందిన తర్వాత సాఫ్ట్‌వేర్, ఆటోమేషన్‌ ఉపకరణాలను కూడా సమకూర్చుకొని పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలిగించని ఆరోగ్యదాయకమైన రీతిలో రొయ్యల సాగు చేపట్టే సమగ్ర అత్యాధునిక సాంకేతికతకు తుదిమెరుగులు దిద్దాం’ అని రసెల్‌ చెబుతున్నారు. 

కంటెయినర్‌ రొయ్యల సాగులో మూడు సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. బయోఫ్లాక్‌.. రొయ్యలకు వ్యాధులు సోకకుండా ఉండే వాతావరణాన్ని కల్పిస్తుంది. అందువల్ల యాంటీబయోటిక్స్‌ లేదా హానికరమైన రసాయనాల అవసరమే రాదు. ఈ ష్రింప్‌ బాక్స్‌లో అన్ని పనులనూ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎక్కడి నుంచైనా నియంత్రించుకునే అవకాశం ఉంది. నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయి, రొయ్యల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూ గణాంకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి మేతను ఎక్కడి నుంచైనా అందించే సాంకేతికతను జోడించటం విశేషం. డేటాను బట్టి వర్క్‌ఫ్లో మాపింగ్‌ చేశారు. కాబట్టి, కంటెయినర్‌లో రొయ్యల సాగులో ఎవరికైనా అతి సులభంగా శిక్షణ ఇవ్వటం సాధ్యమవుతోంది. ఎలా పండించారో తెలియని, ఎప్పుడో పట్టుకుని నిల్వ చేసిన రొయ్యలను నగరవాసులు తినాల్సిన అవసరం లేదు. తమ ‘ష్రింప్‌ బాక్స్‌’ను నగరం నడిబొడ్డునైనా ఏర్పాటు చేసుకొని రొయ్యలను పెంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా ఆరోగ్యదాయకమైన రొయ్యలను ఆరగించవచ్చు అంటున్నారు రసెక్‌. 

కంటెయినర్‌లో  1.5 టన్నుల రొయ్యలు
అత్యాధునిక రొయ్యల చెరువుగా మేము రూపుదిద్దిన కార్గో కంటెయినర్‌ విస్తీర్ణం 50 చదరపు మీటర్లు. దీనిలో ఏటా 1.5 టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నాం. సాధారణ చెరువుల్లో ఇన్ని రొయ్యలు పెంచాలంటే కనీసం రెండు హెక్టార్ల భూమి కావాలి. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే రొయ్యలను పెంచడానికి ‘ష్రింప్‌ బాక్స్‌’ ఉపయోగపడుతోంది. 70% పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ‘ష్రింప్‌ బాక్స్‌’లో రొయ్యలు పెంచడానికి డాక్టరేట్‌ ఏమీ అక్కర్లేదు. 2–4 వారాల శిక్షణతో ఎవరైనా రొయ్యల రైతుగా మారొచ్చు. అమెరికా, ఐరోపా దేశాల్లో వ్యాపార విస్తరణే మా లక్ష్యం.
– డేనియెల్‌ రసెక్, ‘ష్రింప్‌ బాక్స్‌’ ఆవిష్కర్త, మెక్సికో
– పంతంగి రాంబాబు
prambabu.35@gmail.com

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top