ఇసుక అక్రమ దందాపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ దందాపై ఫిర్యాదు

Nov 29 2025 7:23 AM | Updated on Nov 29 2025 7:23 AM

ఇసుక

ఇసుక అక్రమ దందాపై ఫిర్యాదు

ఇసుక అక్రమ దందాపై ఫిర్యాదు గర్భిణులకు అవగాహన టెట్‌ నిబంధన సవరించాలి రవాణా శాఖ అధికారుల తనిఖీలు

పెనుగొండ: ఆచంట నియోజక వర్గంలో అక్రమ ఇసుక దందాకు అంతేలేకుండా పోయిందని వైఎస్సార్‌ సీపీనాయకులు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు పిర్యాదు చేశారు. శుక్రవారం పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో అక్రమ దందాపై స్వయంగా కలిసి వివరించి వినతి పత్రం సమర్పించారు. అక్రమ దందాపై స్థానిక నాయకులు చేస్తున్న పోరాటాన్ని బొత్స సత్యనారరాయణ అభినందించారు. అక్రమ ఇసుక రవాణాను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. అలాగే చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ బొత్స దృఫ్టికి తీసుకు వెళ్లడంతో ఎక్కడైనా ఇబ్బందులకు గురిచేస్తే మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు, జిల్లా నాయకత్వంతో కలిసి అండగా నిలుస్తామన్నారు. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతూ, చెక్‌పవర్‌లు రద్దు చేస్తున్నారని వివరించారు.

ఏలూరు టౌన్‌: ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో గర్భిణుల వివరాలు సకాలంలో పొందుపర్చాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పీజే అమృతం చెప్పారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో కిల్కారీ సేవలపై వైద్య సిబ్బందితో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కిల్కారీ కాల్స్‌ వచ్చినప్పుడు సమాచారాన్ని వింటూ వాటిని అనుసరించే గర్భిణులు, బాలింతల సంఖ్య పెరగాలని తెలిపారు. ముఖ్యంగా కిల్కారీ కాల్‌ నెంబర్‌ 911600403660 ను ప్రతీ గర్భిణి సెల్‌ఫోన్‌లో ఉండేలా ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. మరోమారు సమాచారాన్ని వినాలంటే 14423 లేదా 18005321255 టోల్‌ఫ్రీ నెంబర్‌కి కాల్‌ చేసి వినే అవకాశం ఉందని డీఎంహెచ్‌వో తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ వృత్తిలో 20–30 సంవత్సరాలుగా పని చేస్తున్న వారు విద్యాహక్కు చట్టం నిబంధనల మేరకు టెట్‌ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చట్టంలోని క్లాజులు మార్చాలని యూటీఎఫ్‌ నాయకులు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కోర్టు తీర్పుతో దేశం మొత్తం మీద లక్షలాది మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయిందన్నారు. టెట్‌ రాయాలనే నిబంధన కారణంగా రాష్ట్రంలో 1.70 లక్షల మంది సీనియర్‌ టీచర్లు టెట్‌ క్వాలిఫై అవ్వాల్సిన పరిస్థితని, లేదంటే ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. 2011 ముందు 20, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు అనుభవంతో ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్లు చేసి ఎప్పటికప్పుడు ఓరియంటేషన్‌ ట్రైనింగ్‌లు తీసుకుంటూ అప్‌డేట్‌ అవుతూ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పరీక్ష క్వాలిఫై కావాలనే నిబంధనతో మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు పార్లమెంటులో మాట్లాడతానన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు శుక్రవారం పాఠశాల బస్సులపై ఫ్రెండ్లీ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏలూరు, నూజివీడు, పెదపాడు, జంగారెడ్డిగూడెం, నిడమర్రు, కలిదిండి ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగించారు. ఉదయం, సాయంత్రం కూడా తనిఖీలు చేశారు. బస్సుల ఫిట్‌నెస్‌, సౌకర్యాలు, ప్రమాణాలు ఉన్నాయా లేవా, అత్యవసర ద్వారాల పనితీరు వంటి వాటిని తనిఖీ చేశారు. దీంతో పాటు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు, బాక్సుల్లో అందుబాటులో ఉంచిన మందులు, వాటి తయారీ, వినియోగ తేదీలు తనిఖీ చేశారు. స్వయంగా వారే వాహనాలను నడిపి బస్సుల పనితీరును తెలుసుకున్నారు. ఏఎంవీఐలు స్వామి, జగదీష్‌, ప్రజ్ఞ, జమీర్‌, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ దందాపై ఫిర్యాదు 
1
1/1

ఇసుక అక్రమ దందాపై ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement