ఫిట్‌నెస్ రెన్యువల్‌లో పాత విధానాన్నే కొనసాగించాలి
నూజివీడు: వాహనాల ఫిట్‌నెస్ రెన్యువల్ విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీ రాజు డిమాండ్ చేశారు. ఈమేరకు ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ (సీఐటీయూ) యూనియన్ నాయకులు బుధవారం నూజివీడులోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీ రాజు మాట్లాడుతూ వాహనాల రెన్యువల్‌ను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టడం అవివేకమన్నారు. వాహనాల ఫిట్‌నెస్ సహేతుకంగా జరగకపోతే కాలం చెల్లిన, కండీషన్‌లో లేని వాహనాలు రోడ్లపై సంచరించి ప్రమాదాలు పెరిగేందుకు అవకాశం ఉందన్నారు. రెన్యువల్ సదుపాయాన్ని ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల్లో నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పదేళ్లు దాటిన రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బెనర్జీ, కుమార్, సంసోన్, ధర్మారావు, జోజి, పండు, వివేక్ తదితరరులు పాల్గొన్నారు.


