నీటి ప్రవాహానికి అడ్డంకులు
● ఎల్‌జీపాడు ఛానల్ మొగ పంట కాల్వపై అక్రమంగా వంతెనలు, అడ్డుకట్టలు
● ముంపు సమస్య ఎదుర్కొంటున్న చెరువుల రైతులు
భీమవరం అర్బన్: పంట కాల్వపై అక్రమంగా వంతెనలు నిర్మించడం, తూములతో పూడ్చి వేయడం, గరికట్టులు కట్టడంతో ఎల్‌జీ పాడు ఛానల్ మొగ నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. దీంతో తుపాను, వర్షాల సమయంలో నీరు ఎగదన్ని పల్లపు ప్రాంతాల్లోని చేపలు, రొయ్యలు చెరువులు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. శివారు గ్రామాలు సైతం ముంపు బారిన పడుతున్నాయి.
ఛానల్ మొగలో అడ్డంకులు
ఎల్‌జీపాడు ఛానల్ ద్వారా సుమారు 8 వేల ఎకరాలకు, చేపలు, రొయ్యల చెరువులకు, వరి పొలాలకు, రక్షిత మంచినీటి చెరువులకు తాగు, సాగు నీరందుతుంది. ఎల్‌జీపాడు ఛానల్ భీమవరం పట్టణం మీదుగా మండలంలోని గొల్లవానితిప్ప, గూట్లపాడు, కొత్తపూసలమర్రు, దొంగపిండి గ్రామాల మీదుగా సుమారు 22 కిలోమీటర్లు ప్రవహించి బందాల చేడు డ్రెయిన్‌లో కలుస్తుంది. యనమదుర్రు డ్రెయిన్ ఉప్పొంగినప్పుడు ఎల్‌జీ ఛానల్ నుంచి బందాలచేడు డ్రెయిన్ ద్వారా వరదనీరు ఉప్పుటేరులోకి నీరు ప్రవహిస్తుంది. అయితే కొందరు చేపల చెరువుల రైతులు తమ చెరువులకు తవుడు లారీలు వెళ్లేందుకు వీలుగా పంటకాల్వ మొగలో భారీ తూములు పెట్టి మట్టితో పూడ్చేశారు. అలాగే వంతెనలు, గరికట్టులు సైతం ఏర్పాటు చేశారు. ఇలా ఛానల్ వెంట పలువురు అడ్డంకులు ఏర్పాటు చేయడంతో నీటి ప్రవాహం సక్రమంగా సాగడం లేదు.
అడుగడుగునా అడ్డంకులే..
దొంగపిండి పరిధిలో ఉన్న బోనకాల దిబ్బ నుంచి ఎల్‌జీ పాడు ఛానల్ బందాల చేడులో కలిసే వరకు సుమారు కిలోమీటరులో 2 వంతెనలు, 2 అక్రమ గరికట్టులు, 4 తూములతో అడ్డంకులు ఉన్నాయి. దీంతో వర్షాకాలంలో వరద నీరు దిగువకు లాగక గూట్లపాడు నుంచి దొంగపిండి వరకు మెయిన్ రోడ్డు మునిగిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా గొల్లవానితిప్ప, గూట్లపాడు, కొత్తపూసలమర్రు, దొంగపిండి గ్రామాల్లో పల్లపు ప్రాంతాలలో చేపలు, రొయ్యల చెరువులు మునిగిపోయి రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు.
పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
పంటకాల్వ మొగలో అక్రమ వంతెనలు, గరికట్లు, తూములు పూడ్చి అడ్డంకులు పెట్టినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో వారి తీరుపై రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటకాల్వలను పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు మొగలో అడ్డంకులు తొలగించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.
సమస్యను పరిష్కరిస్తాం
ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ ప్రసాదరాజును వివరణ కోరగా తమ సిబ్బందిని పంపి అక్రమ వంతెనలు, తూములు పెట్టి అడ్డుకట్ట వేసిన వారికి నోటీసులు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
నీటి ప్రవాహానికి అడ్డంకులు


