గోతులమయం.. జర భద్రం
మరమ్మతులు నిర్వహించాలి
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
● ప్రమాదకరంగా 516డి జాతీయ రహదారి
● గోతులతో నిత్యం ప్రమాదాల బారిన వాహనదారులు
జంగారెడ్డిగూడెం: జాతీయ ప్రధాన రహదారి 516డి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రోడ్డుపై ఏర్పడిన గోతులతో వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతన్నారు. కొందరు ఈ గోతుల కారణంగా మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ఈ రహదారి ప్రమాదాలకు నెలవుగా మారుతుండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ నుంచి విశాఖకు దగ్గర దారి
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ దేవరపల్లి నుంచి తల్లాడ వరకు జాతీయ ప్రధాన రహదారి 516డి విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు దగ్గరి దారి కావడంతో ఈ రహదారిపై నిత్యం అత్యధిక వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఈ రహదారి ఉంది. అయితే ఈ రహదారిపై గోతుల కారణంగా ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై ఉన్న పెద్ద గోతిలో ద్విచక్రవాహనం పడటంతో, వాహనం వెనుక కూర్చొన్న జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెంకు చెందిన వ్యక్తి నిమ్మకూరి కొండయ్య(27) ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన కొండయ్యను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. చికిత్స పొందుతూ వారం రోజుల తరువాత మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం మగదిక్కు లేకుండా పోయింది.
రాత్రి సమయాల్లో..
ప్రమాదాలు ఎక్కువగా రాత్రి సమయాల్లో చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు పై ఉన్న గోతులు ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్ కారణంగా కనించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రహదారి వెంబడి జీలుగుమిల్లి, రమణక్కపేట, దర్భగూడెం, తాడువాయి, వేగవరం, జంగారెడ్డిగూడెం మెట్ట, నరసన్నపాలెం, బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రమాదంలో వాహనదారులు గాయపడటమో, మృత్యువాతకు గురవడమో జరుగుతోంది. గోతుల కారణంగా వాహనాలు సైతం తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డుపై పడుతున్న గోతులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జాతీయ ప్రధాన రహదారి 516డిపై పడుతున్న గోతులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. గోతుల కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు సైతం మరమ్మతులకు గురవుతున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతలకు చర్యలు చేపట్టాలి
– ఆర్.హరి, జంగారెడ్డిగూడెం
జాతీయ ప్రధాన రహదారిపై గోతుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతుల మరమ్మతులు నిర్వహించే వరకు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో గోతులు తెలిసేలా రేడియం స్టిక్కర్‌లు ఏర్పాటు చేయాలి.
– పి.శ్రీనివాస్, జంగారెడ్డిగూడెం
గోతులమయం.. జర భద్రం
గోతులమయం.. జర భద్రం
గోతులమయం.. జర భద్రం


