అప్పులు తాళలేక పురుగు మందు తాగి..
భీమడోలు: అప్పులు బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి మృతి చెందాడు. కోడూరుపాడుకు చెందిన అంబటి యాకోబు (35) వ్యవసాయ కూలీ. తాగుడు, ఇతర వ్యసనాలకు బానిసై శక్తికి మించిన అప్పులు చేశాడు. ఈ విషయంలో భార్య,భర్తలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కష్టపడి అప్పులు తీర్చుకుందామని భార్య రాణి భర్తకు నచ్చచెప్పినా ఆమె మాటలను పట్టించుకోలేదు. గత నెల 6వ తేదీన పురుగు మందు సేవించి ఉంగుటూరులోని బంధువులు ఇంటికి వెళ్లాడు. అపస్మారక స్థితిలో ఉండడంతో ఆతడ్ని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి యాకోబు మృతి చెందాడు. యాకోబు భార్య రాణి ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


