వ్యవసాయ ఉద్యోగులకూ వెన్నుపోటు
రైతు సేవా కేంద్రాల ఉద్యోగులకు మొండిచేయి
ఏలూరు (మెట్రో): రైతులకు చంద్రబాబు సర్కారు వెన్నుపోటు గురించి ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన విషయం. ఆ రైతులకు సేవలు అందించే ఉద్యోగులనూ చంద్రబాబు సర్కారు మోసం చేస్తుంది. మాయమాటలు చెప్పి పనులు చేయించుకుని ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసిన చందంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా వ్యవసాయ ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 520 రైతు భరోసా కేంద్రాలను రైతులకు సేవలు అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రైతు భరోసా కేంద్రాలను పేరు మార్చిన చంద్రబాబు సర్కారు రైతు సేవాకేంద్రాలుగా నామకరణం చేసింది. పేరు మార్పుపై చూపిన శ్రద్ధ రైతులకు సేవలు అందించడంలో మాత్రం ఏమాత్రం చూపడం లేదు. 520 రైతు సేవా కేంద్రాలలో 520 మంది అగ్రికల్చరల్ అసిస్టెంట్లు, హార్టీకల్చర్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు.
ఏలూరు జిల్లాలో రూ.50 లక్షల వరకూ బకాయి
రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఎంత మేర విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనేది గుర్తించేందుకు ఈ క్రాప్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రాప్ పూర్తి చేసిన అసిస్టెంట్లకు సర్వే నెంబరుకు రూ.10 చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు బహిరంగంగా చెప్పింది. సీజన్ల వారీగా సర్వే నెంబరుకు రూ.10 చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు హామీ ఇచ్చింది. 2 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు, 3 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు చేస్తున్నట్లు ఈ క్రాప్ బుకింగ్‌లో అగ్రి అసిస్టెంట్‌లు తేల్చారు. సీజన్ పూర్తయినా నేటికీ ఈ సొమ్ములు చెల్లించేందుకు చంద్రబాబు సర్కారు చర్యలు తీసుకున్న పాపన పోలేదు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లకు సుమారు రూ.40 లక్షల నుండి రూ.50 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.25 లక్షల నుంచి 30 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది.
ఈ–క్రాప్ పూర్తిచేసిన ఉద్యోగులకు పైసా విదల్చని సర్కారు
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిధులు నిల్
ఖర్చులకు ఇస్తామన్న రు.10 వేల హామీ సైతం లేనట్లే
జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ కేంద్రాలలో ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం సేకరణకు కనీస అవసరాల కోసం రూ.10 వేలు అందిస్తామని చంద్రబాబు సర్కారు సేకరణ ప్రారంభం కాక ముందు చెప్పింది. దీన్ని ఏమాత్రం పట్టించుకోని సర్కారు ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 234 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఆయా కేంద్రాల్లో మంచినీరు, ట్రక్‌షీట్‌లు, ఇతర పేపర్ వర్కు పూర్తి చేసుకునేందుకు ఈ రూ.10 వేలు అందిస్తున్నామంటూ ప్రకటించింది. ఈ నిధులు ధాన్యం సేకరణ సమయంలో ఎంతో ఉపయోగపడతాయని రైతు సేవా కేంద్రాలు ఉద్యోగులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో చేతి సొమ్ములే ఖర్చు చేసుకుంటూ ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


