అమలు కాని జీవోలతో రజకులకు ఇక్కట్లు
ఏలూరు (టూటౌన్): అమలు కాని జీవోలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని రజకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రజక జన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని రజక జనసంఘ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రజక నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో రజకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం 1984లో జారీ చేసిన జీవోల ప్రకారం ప్రతి జిల్లాలోనూ రజక సంక్షేమ కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయాల్సి ఉందని, కాని చాలాచోట్ల ఆచరణ కాలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 62, జీవో 25 ప్రతి మూడు నెలలకు ఓసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు జరగాల్సి ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో రజకులు వృత్తిపరమైన ఇబ్బందులు పడుతున్నప్పటికి అధికారులు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల వృత్తి చెరువుల విస్తీర్ణాన్ని జిల్లా సర్వేయర్లతో సర్వే చేయించి, ఆక్రమణలు తొలగించి, హద్దులు నిర్ధారించాలని, విస్తీర్ణాన్ని బట్టి జీవోల ప్రకారంగా శిస్తు నిర్ధారించాలని కోరారు. దోభీ ఘాట్లు, విశ్రాంతి భవనాలు నిర్మించాలని, పాత వాటికి మరమ్మతులు చేపట్టాలని, ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా రజక నేతలు కొమ్మంటి మురళి, కదిలి సుబ్బయ్య, శ్రీనివాసు, నాగశేషు, లక్ష్మీప్రసన్న, ఈధర మురళి, అంజుత్తు నాగేశ్వరరావు, కడకట్ల సత్యనారాయణ సురేష్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


