రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వాలు
భీమవరం: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్స్ ప్రభుత్వమని, కార్పొరేట్లకు రాయితీలిస్తున్నారు కానీ రైతుల ఆత్మహత్యలు నివారించలేకపోతున్నారని అఖిల భారత కిసాన్ సభ ఆలిండియా అధ్యక్షుడు అశోక్ థావలే విమర్శించారు. గురువారం స్థానిక ఏఎస్‌ఆర్ సాంస్కృతిక కేంద్రంలో ఉద్ధరాజు రామం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంతెన సీతారాం అధ్యక్షతన రైతాంగ సమస్యలు, ప్రభుత్వాల బాధ్యత అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీ 2047 విజన్ పేరుతో కార్పొరేట్లకు భూములు దోచిపెట్టాలని చూస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మొదటి 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందనే సంగతిని పాలకులు గుర్తించాలన్నారు. అమరావతి రాజధాని కోసం వందలాది ఎకరాలు బలవంతంగా రైతుల నుంచి సేకరించారని అశోక్ థావలే విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, బి.బలరామ్, ఎ రవి, జేఎన్‌వీ గోపాలన్, కె.రాజరామోహన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.


