బుట్టాయగూడెం: పోలవరాన్ని ఆదివాసీ జిల్లాగా ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు తీవ్రంగా మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం నియోజకవర్గంలో 5 గిరిజన మండలాలు, పోలవరం ముంపు గ్రామాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ముంపు నిర్వాసితుల నివాసాలు, భూములు ఉన్నాయన్నారు. ఇప్పటికే జనాభా పెరిగి నిర్వాసితులకు సరైన నివాసాలు ఏర్పాటు చేయకపోవడం, భూములు కేటాయించకపోవడం వల్ల నిర్వాసితులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే రంపచోడవరం పేరే నామకరణం చేయాలి తప్ప జిల్లాలో పేరు, ఊరులేకుండా పోలవరం జిల్లాగా చెప్పడం బాగోలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ మాజీ నియోజకవర్గ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.


