వైభవంగా శిఖర కలశ ప్రతిష్ఠ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడైన భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ఠలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా పండితులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ గణపతిపూజ, పుణ్యాహవాచన, గర్తన్యాసం, భీజిన్యాసం, ధాతున్యాసం, రత్నన్యాసం, యంత్రస్థాపనలను నిర్వహించారు. అనంతరం ఉదయం 9.27 గంటల సముహూర్త సమయంలో రాజగోపురంపై దేవస్థానం ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు తదితరులు శిఖర ప్రతిష్ఠాపన కనుల పండువగా జరిపించారు. ఆ తరువాత యాగశాలలో మహాపూర్ణాహుతి హోమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.


