
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
తణుకు అర్బన్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ విమర్శించారు. తణుకు సీపీఎం భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడ బిడ్డ నిధి, ఉచిత బస్సు హామీల అమలుకోసం మహిళలు వేచిచూస్తున్నారని అన్నారు. విద్యుత్ బిల్లులు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి నేడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ఇంధన సర్దుబాటు చార్జీలుగా వేయడం దుర్మార్గమని అన్నారు. మరో రూ.842 కోట్ల విద్యుత్ భారాన్ని బిల్లుల్లో కలిపేందుకు ప్రతిపాదన చేస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టమని అప్పట్లో మంత్రి లోకేష్ అన్నారని నేడు యథేచ్ఛగా బిగిస్తున్నారని అన్నారు. నేటికీ ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారని స్పష్టం చేశారు. తమ సైకిల్ యాత్రలో ప్రజలు ఈ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జిల్లా విస్త్రృతస్థాయి సమావేశాలు తణుకులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ పుస్తకాలను ఆవిష్కరించారు.