
అధికార లాంఛనాల బ్లెస్సన్ అంత్యక్రియలు
ఆలమూరు: విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన కానిస్టేబుల్ ఎస్.బ్లెస్సన్ జీవన్ (32)కు పోలీసు శాఖ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. ఆలమూరులోని ఆయన నివాసం నుంచి ప్రజల అశృనయనాల మధ్య పోలీసు బందోబస్తుతో మృతదేహాన్ని ఆలమూరులోని ఏటిగట్టు పక్కన ఉన్న శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. బ్లెస్సన్ అమర్ రహే అంటూ క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో భౌతిక కాయాన్ని ఖననం చేశారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, రావులపాలెం సీఐ కె.శేఖర్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించి 12 రౌండ్లు గాలిలో పేల్చి గౌరవ వందనం చేశారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు గురువారం రాత్రి బ్లెస్సన్ నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. పోలీసుశాఖలో అంకితభావంతో పనిచేసే అత్యుత్తమ కానిస్టేబుల్‌ను కోల్పోయిందనని ఆయన ఆవేదన చెందారు. బ్లెస్సన్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్రైమ్ సీఐ గజేంద్ర, ఆత్రేయపురం ఎస్సై టి.రాము, ట్రైనీ ఎస్సై బాలకృష్ణ, సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.