
శిథిల భవనాలు.. పాముల పుట్టలు
సాక్షి, అమలాపురం: ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి భవనాలు.. నిర్మించి దాదాపుగా 140 ఏళ్లవుతోంది. గతంలో కనీస మరమ్మతులు చేసేవారు. కానీ మూడు నాలుగు దశాబ్దాలుగా చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయడం లేదు. ఫలితంగా డెల్టాలోని పంట కాలువలపై ఉన్న లాకుల వద్ద నిర్మించిన ఇరిగేషన్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. చాలా భవనాలు కుప్పకూలిపోయాయి. కొన్ని కనుమరుగవ్వగా.. మరికొన్ని పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. చెద పుట్టలు, పాము పుట్టలు పుట్టుకొచ్చాయి. చుట్టుపక్కల పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడవుల్లా మారిపోయాయి. దీనికితోడు పాములు, విష క్రిములు వస్తూండటంతో వీటి వంక చూసేవారే లేకుండా పోయారు.
గోదావరి డెల్టాలో పంట కాలువల వ్యవస్థ సక్రమంగా నడవడం, ఏటా రెండు పంటలకూ సమృద్ధిగా నీరందించే బాధ్యత ఇరిగేషన్ శాఖది. సాగునీటి యాజమాన్యంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎస్‌ఈ నుంచి లాకులను నిర్వహించే లస్కర్ (గంటా కళాసీ) వరకూ కీలకమే. లాకుల నిర్వహణ, నీటి యాజమాన్యం విధులకు, నేవిగేషన్ వ్యవస్థ విజయవంతంగా పని చేసేందుకు వీలుగా ఆయా లాకుల వద్ద అధికారులు, సిబ్బంది ఉండేందుకు వీలుగా గతంలో క్వార్టర్లు, కార్యాలయాలు నిర్మించారు. సుదీర్ఘ కాలంగా నిర్వహణకు నోచక ఇవి కాస్తా దెబ్బ తినడంతో సిబ్బంది ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఒకటి రెండు భవనాల్లో కార్యాలయాలున్నా అధికారులు రావడం లేదు. దీంతో నీటి యాజమాన్యం, లాకుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. దీనివల్ల రబీ ఎద్దడి సమయంలో శివారు, మెరక ప్రాంతాలకు నీరందక రైతులు నష్టపోతున్న విషయం తెలిసిందే. మధ్య డెల్టాలో మూడు ప్రధాన పంట కాలువలకు నీరందించే కీలకమైన లొల్ల లాకుల వద్ద సైతం భవనాలు శిథిలావస్థకు చేరాయి.
తూర్పు డెల్టా పరిధిలో ప్రధాన లాకులు
● కోటిపల్లి బ్యాంకు కెనాల్‌పై చొప్పెల్ల, కపిలేశ్వరపురం, కూళ్ల, మసకపల్లి.
● కోరంగి కాలువ పరిధిలో ఆలమూరు, వెల్ల, ఎర్రపోతవరం.
● మండపేట కాలువ పరిధిలో తాపేశ్వరం, పసలపూడి.
మధ్య డెల్టా పరిధిలో ప్రధాన లాకులు
● మధ్య డెల్టా ప్రధాన పంట కాలువపై లొల్ల.
● ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్‌పై వాడపాలెం, చింతనలంక, అన్నంపల్లి, కుండలేశ్వరం.
● అమలాపురం కాలువపై పలివెల, ముక్కామల, నడిపూడి, వన్నెచింతలపూడి.
● పి.గన్నవరం బ్యాంకు కెనాల్‌పై గోపాలపురం, మొండెపులంక, పొదలాడ, శివకోడు
లొల్ల లాకుల వద్ద ఇరిగేషన్ క్వార్టర్ల దుస్థితి
జిల్లాలో ఇరిగేషన్ భవనాల దుస్థితి
గాలికొదిలేసిన అధికారులు
శిథిలమైన లాకు క్వార్టర్లు
లాకులకు దూరంగా సిబ్బంది నివాసం
జిల్లాలోని 10 లాకుల వద్ద ఇదే పరిస్థితి
చింతనలంక
అయినవిల్లి మండలం చింతనలంక లాకుల వద్ద 1888లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. రెండు మూడు దశాబ్దాలుగా కనీస మరమ్మతులు కూడా చేయడం లేదు. క్వార్టర్లు ధ్వంసం కావడంతో కార్యాలయ నిర్వహణ, లాకుల వద్ద పని చేసే సిబ్బంది ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
వానపల్లి
కొత్తపేట మండలం వానపల్లి లాకుల వద్ద ఉన్న ఇరిగేషన్ భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా వీటికి కనీస మరమ్మతులు లేవు. నివాసయోగ్యం కాకపోవడంతో సిబ్బంది ఈ భవనాలను వదిలేశారు. ఇప్పుడు ఈ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి.

శిథిల భవనాలు.. పాముల పుట్టలు

శిథిల భవనాలు.. పాముల పుట్టలు