
టీచర్లపై పనిభారం తగ్గించేందుకే 9 రకాల పాఠశాలలు
అమలాపురం రూరల్: అభ్యసన సామర్థ్యాలు పెంచి, బడి మానివేస్తున్న వారి సంఖ్యను, ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆ దిశగా జూన్ 12 నాటికి తరగతి గదులను, పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లస్టర్ అకడమిక్ టీచర్ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక గది ఉండాలన్నారు. మన బడి – మన భవిష్యత్తు కింద పాఠశాల విద్యా కమిటీలకు మంజూరైన నిధుల్లో మిగిలిన నిధుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. ప్రధానమంత్రిశ్రీ పథకం కింద మంజూరైన మొదటి దశ పనులను ఈ నెల 25 నాటికి, రెండో దశ పనులను జూన్ 5 నాటికి పూర్తి చేయాలని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరాకు సంబంధించి ఇప్పటి వరకూ బెల్టులు, ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులు, 80 శాతం పాఠ్య పుస్తకాలు వచ్చాయని, మిగిలిన మెటీరియల్ జూన్ 5 నాటికి రాకుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. స్థల సమస్యను అధిగమించేందుకు బహుళ అంతస్తుల్లో పాఠశాల భవనాలు నిర్మించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి షేక్ సలీం బాషా, సర్వశిక్ష సహాయ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ జి.మమ్మీ సీఎంఓ బీవీవీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.