
పెట్టుబడి ఘనం.. గిట్టుబాటు గగనం
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం కాగా తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. అందులోనూ మోరి జీడిపప్పు కేరళ పప్పు కంటే మంచి రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఉంది. కేవలం ఇక్కడ తయారీ విధానం ద్వారా మాత్రమే ప్రసిద్ధి. రెండు శాతం మినహా గింజలు మాత్రం పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే. గతంలో మోరికి పరిమితమైన ఈ పరిశ్రమ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అయితే సీజన్ ప్రారంభమయ్యే మార్చి నెలాఖరులో ఉగాదికి అందుబాటులో ఉన్న గింజల ధర కాస్తా అమాంతంగా పెరగడం, పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ మార్కెట్‌లో అమ్మకాలు మందకొడిగా సాగడం చిరు వ్యాపారస్తులను డీలా పర్చాయి.
రాజోలు దీవిలో..
రాజోలు దీవిలో ప్రప్రథమంగా మోరిలో తయారైన జీడిపప్పు తదనంతర కాలంలో దీవిలో సుమారు 25 గ్రామాలకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఏడాదికి మోరి తదితర ప్రాంతాల్లో తయారయ్యే జీడి పప్పు సుమారుగా 8 నుంచి 9 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. ఈ పరిశ్రమపై ఆధార పడిన కుటుంబాలు 25 వేలు వరకూ ఉంటాయి. పరిశ్రమ ద్వారా ఏడాది టర్నోవర్ సుమారు రూ.480 కోట్ల నుంచి రూ.500 కోట్లు వరకూ ఉంటుంది.
కొత్త గింజలతో వ్యాపారం
ఏటా మార్చి నెలాఖరు నుంచి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే దేశవాళీ గింజలతో సీజన్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రాలుగా జీడిపప్పు ఎగుమతితో పాటు, సమీపంలోని పాలకొల్లు, భీమవరం, నర్సాపురం పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా జీడిగింజలు హెచ్చు రేటుకు కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసే చిరు వ్యాపారులు మాత్రం అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు.
స్వదేశీ గింజలతో వ్యాపారం
సీజన్ స్వదేశీ గింజలతో వ్యాపారం ప్రారంభమవుతుంది. ఇక్కడి వ్యాపారులు జీడిగింజలను రాజానగరం, మధురపూడి, ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, దూబచర్ల, కొయ్యలగూడెం నుంచి దిగుమతి చేసుకుంటారు. సీజన్ ప్రారంభంలో మార్కెట్‌లో 80 కిలోల దేశవాళీ బస్తా గింజలు రవాణా చార్జీలతో కలిపి రూ.10 వేలు పలికింది. ఆ రేటు కాస్తా ప్రస్తుతం రూ.12 వేలుకు చేరింది. కాగా 80 కిలోల గింజలను పప్పుగా తయారు చేయడానికి వ్యాపారస్తులకు రూ.1,500 వెచ్చించాల్సి వస్తుంది. స్వదేశీ గింజల్లో లభించే ముడిపప్పు 20 కిలోలను మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. 10 కిలోల గుండు మొదటి రకం, 8 కిలోల ముక్కబద్ద రెండో రకం, 2 కిలోల నలిముక్క మూడో రకం. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ గుండు ధర రూ.820, కేజీ బద్దముక్క రూ.770, నలిముక్క రూ.400 పలుకుతోంది. ఈ ప్రకారంగా గుండుకు రూ.8,200, ముక్కబద్దకు రూ.6,160, నలి ముక్కకు రూ.800 లభిస్తోంది. ఇలా చూసుకుంటే ఈ గింజల ద్వారా ఆదాయం రూ.15,160 వస్తోంది.
గిట్టుబాటు స్వల్పమే
మార్కెట్‌లో 80 కిలోల గింజలను తయారీలో పప్పుగా మార్చడానికి అయ్యే ఖర్చులతో కలిపి గింజలపై రూ.13,500 పెట్టుబడిగా ఉంది. మార్కెట్‌లో తెల్లపప్పు అమ్మకాల ద్వారా వస్తున్నది రూ.15,160. ఈ రకంగా చూసుకుంటే వ్యాపారస్తుడికి చేతికి మిగిలేది కేవలం రూ.1,660. ఇందులో ఇతర ఖర్చులు పోను రాబడి లెక్కిస్తే ఆటుపోట్లు మధ్య వ్యాపారం కష్టంగా మారింది.
జీడిపప్పు చిరు వ్యాపారుల డీలా
కలసిరాని పెళ్లిళ్ల సీజన్
అమాంతంగా పెరిగిన గింజల ధర
పెరిగిన గింజల ధర
కుటీర పరిశ్రమగా విరాజిల్లిన జీడిపప్పు వ్యాపారం ఇప్పుడు ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతోంది. సీజన్ ప్రారంభంలో రూ.10 వేలు ఉన్న బస్తా గింజల ధర ఇప్పుడు రూ.12 వేలుకు చేరింది. దీంతో పెట్టుబడి భారం ఎక్కువ అయింది.
– ముప్పర్తి ఆదినారాయణమూర్తి, చిరువ్యాపారి, మోరి
మందకొడిగా వ్యాపారం
పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వ్యాపారం మందకొడిగా ఉంది. గింజల ధర కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. సీజన్ ప్రారంభంలో అందుబాటులో రేటుకు గింజలు లభిస్తే పెట్టుబడి భారం తగ్గేది.
– జె.మాణిక్యాలరావు, చిరువ్యాపారి, మోరి