ముప్పేట దాడి | - | Sakshi
Sakshi News home page

ముప్పేట దాడి

Feb 7 2025 12:04 AM | Updated on Feb 7 2025 12:23 PM

నిల్వకు ఆగని కొబ్బరి కాయలు

నిల్వకు ఆగని కొబ్బరి కాయలు

పచ్చికాయ ధర పెరగడంతో పక్వానికి రానివీ దించుతున్న రైతులు

ముక్కుడు కాయ వైపు ఉత్తరాది వ్యాపారులు మొగ్గు

వెయ్యికాయల ధర రూ.16 వేలు

సాక్షి, అమలాపురం/అంబాజీపేట: గోదావరి జిల్లాల కొబ్బరి మార్కెట్‌లో నెల ముక్కుడు కాయకు డిమాండ్‌ రాగా.. నిన్నటి వరకు జోరు మీద ఉన్న పచ్చికాయకు డిమాండ్‌ తగ్గుతోంది. జాతీయ మార్కెట్‌లో కొబ్బరికి డిమాండ్‌ రావడం ఉత్తరాది మార్కెట్‌లో కొత్త తలనొప్పులకు కారణమైంది. దిగుబడి పెరిగి, కాయకు ధర రావడంతో రైతులు ముప్పెటకాయ (అన్‌ మెచ్యూర్‌, పక్వానికి రాని, లేతకాయ)ను కూడా కోయిస్తున్నారు. దీని వల్ల కొబ్బరికాయ నిల్వ సామర్ధ్యం తగ్గి పాడైపోవడంతో ఉత్తరాది వ్యాపారులు నిల్వకాయపై మక్కవ చూపుతున్నారు.

మహా కుంభమేళా, మహా శివరాత్రి విక్రయాల జోరుతో దిగుబడి పెరిగినా కొబ్బరి కాయకు మంచి ధర వచ్చింది. వారం రోజుల క్రితం పచ్చికొబ్బరి వెయ్యి కాయల ధర రూ.15,500 నుంచి రూ.16 వేలకు చేరింది. అటువంటిది ఇప్పుడు రూ.13,500 నుంచి రూ.14 వేలకు తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం ముప్పెటకాయ సేకరణ. ధర అధికంగా ఉండడం, దింపు కార్మికుల కొరతతో రైతులు ముప్పెటకాయ కాయను సైతం సేకరిస్తున్నారు. కాయ పక్వానికి రావాలంటే కనీసం 11 నుంచి 12 నెలల సమయం పడుతోంది. ముప్పెటకాయకు 9 నెలల నుంచి 10 నెలలు సరిపోతోంది. పక్వానికి వచ్చిన కాయతో పాటు ముప్పెటకాయను కూడా విక్రయిస్తున్నారు. 

ఈ కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం లేక తొందరగా పాడవుతున్నాయి. అలాగే దీని నుంచి వచ్చే ఎండు కొబ్బరి తక్కువ. స్థానిక ఎండు కొబ్బరి నుంచి 69 శాతం కొబ్బరి నూనె వస్తే ముప్పెట నుంచి కేవలం 62 శాతం మాత్రమే వస్తోంది. పక్వానికి వచ్చిన కాయను నిల్వ ఉంచితే కురిడీ తయారీ సమయంలో వెయ్యికాయలకు సగటున 100 కాయలు దెబ్బతింటే, ముప్పెటకాయ వల్ల 200 వరకు దెబ్బతింటాయి. దీనికి తోడు ఈ కాయ నుంచి పీచు బలహీనంగా ఉండడంతో పాటు చిప్ప పలచగా ఉంటోంది. 

ఇన్ని ఇబ్బందులు ఉన్నందున ఈ కాయ కొనుగోలకు ఉత్తరాది వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. పాత దింపు కాయ కొనుగోలుకు వారు ఆసక్తి చూపడంతో దాని ధర పెరిగింది. వారం రోజుల క్రితం రూ.13 వేలు ఉండగా, ఇప్పుడు రూ.14 వేల నుంచి 15 వేల మధ్య లావాదేవీలు జరుగుతున్నాయి. గోదావరి లంక గ్రామాల్లో నిల్వ ఉన్న కాయకు మరింత డిమాండ్‌ ఉంది. ఇదే సమయంలో పచ్చికాయ కొబ్బరి రాశుల విక్రయాలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement