చివరిలో వణుకు
సాక్షి, అమలాపురం: ఖరీఫ్ రైతులపై ప్రకృతి పగబట్టింది. సాగు ఆరంభం నుంచి కోతల వరకూ అతివృష్టి... అనావృష్టి ముప్పు తిప్పలు పెడుతోంది. సాగు ఆరంభంలో సరైన వర్షాలు లేక ఇబ్బంది పడిన రైతులను, కోతల సమయంలో తుపాన్లు వచ్చి పడి నిలువునా ముంచేస్తోంది. మోంథా తుపాను చేసిన గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో తాజాగా దిత్వా తుపాను ప్రభావంతో మారిన వాతావరణం.. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావం కోనసీమ జిల్లాపై పడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, సాయంత్రం నుంచి చిరుజల్లులు మొదలయ్యాయి. సమయం గడిచే కొద్దీ ఇది ఒక మోస్తరు వాన పడుతోంది. తీర ప్రాంతాల్లో అప్పుడప్పుడు స్వల్పంగా గాలులు వీస్తున్నాయి. ఇదే జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాల రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 1.56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, ఇప్పటి వరకూ సుమారు 60 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయని అంచనా. అంటే మొత్తం ఆయకట్టులో కేవలం 38 శాతం మాత్రమే కోతలు జరిగాయి. మధ్య డెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్ల కన్నా కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని, తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం వ్యవసాయ సబ్ డివిజన్లలో 60 శాతానికి పైగా కోతలు జరిగాయి. వాస్తవంగా ఇప్పటికే మూడొంతుల ఆయకట్టులో వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుపాను కారణంగా వారానిపైగా కోతలు నిలిచిపోయాయి. తరువాత కోతలు మొదలైనప్పటికీ పడిపోయిన పొలాల్లో వరి పంటను పైకి లేపి కోతలు కోయాల్సి రావడంతో నూర్పిడులు, ధాన్యం పట్టుబడులు ఆలస్యమతున్నాయి. ఈ నేపథ్యంలో దిత్వా తుపాను వల్ల వర్షాలు కురవడం రైతులను ఇబ్బందులు పాల్జేస్తోంది.
సకాలంలో నీరివ్వకపోవడంతో..
జిల్లాలోని శివారు తీర ప్రాంత మండలంలో ఖరీఫ్ సాగు ఆలస్యం కావడంతో గత వారం రోజుల నుంచే కోతలు జోరందుకున్నాయి. ప్రస్తుత విపత్తులకు చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం, మామిడికుదురు, అయినవిల్లి, రాజోలు తదితర మండలాల్లో ఇప్పుడిప్పుడే కోతలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు కురవడంతో కోతలకు బ్రేకులు పడటంతో పాటు ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో అనుకున్న సమయానికి సాగునీరు అందకపోవడం వల్ల సాగు ఆలస్యమైంది. మోంథా తుపాను వల్ల సుమారు 77 వేల ఎకరాల్లో పంట దెబ్బతినగా, మిగిలిన పంటను రైతులు కోతలు కోసి నూర్పుడులు చేస్తున్నారు. ఈ సమయంలో దిత్వా తుపానుతో ఆదివారం మధ్యాహ్నం నుంచి చిన్నగా మొదలైన వర్షం సాయంత్రం నుంచి నెమ్మదిగా పెరిగింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు చేలల్లో పనలను గట్ల మీదకు తరలించారు. అలాగే కళ్లాల్లోని ధాన్యాన్ని బరకాలు కప్పి కాపాడుకుంటున్నారు. తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు రకాలుగా దెబ్బతిని కనీసం పెట్టుబడులైనా దక్కించుకోవాలనే ఆశతో ఉన్న రైతులకు వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ఫ భయపెడుతున్న ‘దిత్వా’
ఫ చిన్నగా మొదలైన వర్షం
ఫ వరి మాసూళ్లకు ఆటంకం
ఫ ఆందోళనలో రైతులు


