ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహాలు
అమలాపురం రూరల్: చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహా సభలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో నిర్వహించనున్నట్లు చైతన్య, కిమ్స్ విద్యా సంస్థల స్థాపకులు శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ సత్యనారాయణ రాజు (చైతన్యరాజు), కిమ్స్ ఎండీ, మాజీ ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ తెలిపారు. ఆదివారం అమలాపురం కిమ్స్ కళాశాలలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభల వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబుతో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో చైతన్యరాజు మాట్లాడుతూ ఈ మహా సభలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,600 మంది కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. విద్యా, సాహితీ సమావేశాలతో పాటు తెలుగు భాషా వికాసానికి పాటుపడిన అనేక మంది పండితులు, కళాకారులను సన్మానిస్తామన్నారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ మహాసభల్లో 100 డప్పుకారులతో ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను కోనసీమలో నిర్వహించడం గర్వకారణమని అన్నారు. సమావేశంలో మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఇసుకపట్ల రఘుబాబు, పి.విజయలకి్‌ష్మ్, బోనం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.


