అంతర్వేది ఉత్సవాలకు ముహూర్తం ఖరారు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ నిర్వహించనున్న స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాల ముహూర్తం పత్రికను ఆదివారం కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌కు అర్చకులు, వేదపండితులు అందజేశారు. ఆ ముహూర్త నిర్ణయం ప్రకారం ఉత్సవాల్లో జనవరి 28న రాత్రి 1.56 గంటలకు స్వామివారి కల్యాణం, 29వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం, ఫిబ్రవరి 1న సముద్రస్నానం, 2న తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అంతర్వేది ఉత్సవాలపై వచ్చేనెల 4న అమలాపురం ఆర్డీఓ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ చెప్పారు. ఆ రోజు అంతర్వేది ఆలయ ప్రాంగణంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు
అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో నిత్య అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జేపీనగర్‌కు చెందిన పీసపాటి సూర్యనరసింహ శ్రీనివాస్, సత్యసూర్య పూర్ణిమ దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
విద్యా సంస్థల బస్సుల తనిఖీ
అమలాపురం రూరల్: ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకూ పలు విద్యాసంస్థలకు చెందిన 143 బస్సులను తనిఖీ చేసినట్లు జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో 64 బస్సుల్లో సాంకేతికపరమైన లోపాలను గుర్తించి, వారం రోజుల్లోగా సరిచేయించాలని యజమాన్యాలకు నోటీసులు జారీ చేశామని అన్నారు. ముఖ్యంగా బస్ ఫిట్‌నెస్, అగ్ని నిరోధక పరికరం, అత్యవసర ద్వారం తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. దీనికి ఆయా యాజమాన్యాలు సహకరించాలని ఆయన విజ్ఞపి చేశారు..
అంతర్వేది ఉత్సవాలకు ముహూర్తం ఖరారు


