
వడిబడి అడుగులు
రాయవరం: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిత సొంతమవుతుందని..వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. అందుకే సర్కారు బడుల్లో విప్లవాత్మక చర్యలు చేపట్టింది. మనబడి నాడు–నేడు పథకం కింద రెండు విడతల్లో వేల సంఖ్యలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది. అంతేనా.. డిజిటల్ విద్యనూ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు చర్యలను గత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించింది. ఈ ఏడాది ఆయా పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానంలో విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలో బోధన విధానాలపై ఉపాధ్యాయులకు రెండు రోజుల ఓరియంటేషన్ ట్రైనింగ్‌ను పూర్తి చేసింది.
బట్టీ విధానానికి స్వస్తి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధన అమలుకు 12 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో ఐదు జెడ్పీ ఉన్నత పాఠశాలలు కాగా, మిగిలిన ఏడు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు. ఎంపిక చేసిన 12 పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే సీబీఎస్‌ఈని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. 2023–24 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నారు. సీబీఎస్‌ఈ విధానంలో బడుల్లో బట్టీ విధానానికి, మూస పద్ధతికి స్వస్తి పలికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) సిలబస్‌ను అమలు చేయనున్నారు.
పేద విద్యార్థులకు ప్రోత్సాహం
ఇప్పటివరకు కార్పొరేట్, ఇతర ప్రత్యేక పాఠశాలల్లోనే సీబీఎస్‌ఈ విధానం అమలవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలంటే సీబీఎస్‌ఈ సిలబస్ కచ్చితంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడుల్లోని పేద విద్యార్థులకు ఇటువంటి బోధన అందించాలన్న సత్సంకల్పంతో చర్యలు తీసుకుంది. అన్ని రకాల వనరులు, మౌలిక సదుపాయాలు ఉండడంతో పాటుగా, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం గత విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆయా పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ వరకు ఈ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలవుతోంది. సీబీఎస్‌ఈ అమలయ్యే పాఠశాలల పర్యవేక్షణ కేంద్రం పరిధిలోకి వెళ్తుంది. విద్యార్థుల ఆసక్తి, అభిరుచిని గుర్తించి వివిధ రంగాల్లో వారిని ప్రోత్సహిస్తారు. అవసరం మేరకు సబ్జెక్టు టీచర్లను నియమిస్తారు.
విద్యార్థులపై భారం పడకుండా..
సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలంటే సంబంధిత విద్యా సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో అఫ్లియేషన్ పొందాలి. రాష్ట్రంలో 44వేల పాఠశాలలు దరఖాస్తు చేసుకుంటే కేవలం వెయ్యి పాఠశాలలకు మాత్రమే సీబీఎస్‌ఈ అఫ్లియేషన్ వచ్చింది. అందులో భాగంగా జిల్లాలో 12 పాఠశాలలకు మాత్రమే అనుమతినిచ్చారు. అఫ్లియేషన్, రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజుల నిమిత్తం ఒక్కొక్క పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.లక్ష వరకు సీబీఎస్‌ఈకి చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా 12 పాఠశాలలకు సుమారుగా రూ.12లక్షలను ప్రభుత్వమే గత విద్యా సంవత్సరంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు చెల్లించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే చదువుతున్నారన్న ఉద్దేశంతో విద్యార్థికి ఒక్క రూపాయి కూడా ఆర్ధిక భారం పడకుండా ప్రభుత్వమే ఆర్థిక భారాన్ని భరించింది.
పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశాం
సీబీఎస్‌ఈ అమలవుతున్న 12 పాఠశాలలను ప్లస్–2గా అప్‌గ్రేడ్ చేశారు. వీటిని సీబీఎస్‌ఈ ప్లస్–2 స్కూల్స్‌గా పేర్కొంటున్నారు. సీబీఎస్‌ఈ విధానం ప్రభత్వ పాఠశాలల్లో అమలు చేయడం పేద విద్యార్థులకు వరం లాంటిది.
– మట్టపర్తి పురుషోత్తంరాజు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్,
సీబీఎస్‌ఈ స్కూల్స్, అమలాపురం
విద్యార్థుల సామర్థ్యాల
పెంపుదలకు
సీబీఎస్‌ఈ విధానం విద్యాబోధన విద్యార్థుల సామర్థ్యాలను మరింత పెంచేందుకు ఉపయోగిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పొటీ పరీక్షలను విద్యార్థులు ఎదుర్కోవడానికి ఈ సిలబస్ ఉపయోగపడుతుంది. సీబీఎస్‌ఈ విధానం దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలల్లో అమలు చేయాలనేది రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారుల లక్ష్యంగా ఉంది.
– ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం
‘పది’ విద్యార్థులకు సీబీఎస్‌ఈ
విధానంలో పరీక్షలు
గత విద్యా సంవత్సరంలోనే అంకురార్పణ
అఫిలియేషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు
చెల్లించిన ప్రభుత్వం
జిల్లాలో తొలి విడతగా
12 పాఠశాలల ఎంపిక
ఉపాధ్యాయులకు రెండు
రోజుల ఓరియంటేషన్

వడిబడి అడుగులు

వడిబడి అడుగులు

వడిబడి అడుగులు