సుజనాకు చెన్నై కోర్టు సమన్లు

Chennai court summons to Sujana Chowdary - Sakshi

12న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశం

సుజనా కంపెనీలు, బీసీఈపీఎల్‌ డైరెక్టర్లకు కూడా నోటీసులు

మూడు బ్యాంకుల నుంచి రూ.363 కోట్ల రుణం తీసుకున్న మాజీ కేంద్ర మంత్రి 

ఆ రుణాన్ని సూట్‌కేసు కంపెనీల ద్వారా దారి మళ్లించి 

మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తేల్చిన ఈడీ

కాగితంపై కన్పించే పరిశ్రమల పేరుతో బ్యాంకుల నుంచి రూ.5,700 కోట్లకు పైగా రుణం తీసుకున్న సుజనా

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరికి మనీ ల్యాండరింగ్‌ చట్టం కింద చెన్నై కోర్టు నోటీసులు జారీ చేసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంక్‌ను రూ.71 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకును రూ.159 కోట్లు.. మొత్తం రూ.363 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఈనెల 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌) డైరెక్టర్లు, ఆయన నేతృత్వంలోని పలు కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేసింది.

సుజనా .. అక్రమాల ఖజానా
సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో బీసీఈపీఎల్, సుజనా యూనివర్శల్‌ ఇండస్ట్రీస్, సుజనా మెటల్‌ ప్రొడక్డ్, సుజనా టవర్స్‌ వంటి లిస్టెడ్‌ కంపెనీలతో పాటు మరో 126 ఇతర కంపెనీలు ఉన్నాయి. బార్‌టోనిక్స్‌ కూడా లిస్టెడ్‌ కంపెనీయే. సుజనా నేతృత్వంలోని ఎనిమిది కంపెనీలు (సుజనా యూనివర్శల్, సుజనా మెటల్‌ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్, విజయ్‌ హోం అప్లయన్సెస్, బార్‌టోనిక్స్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌) తప్ప మిగిలినవన్నీ షెల్‌ (డొల్ల) కంపెనీలే. ఇవి సర్క్యులర్‌ ట్రేడింగ్, బుక్‌ బిల్డింగ్, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి అక్రమ కార్యకలాపాలలో దిట్టలు. ఆ సంస్థల్లో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించి సుజనా గ్రూపు సంస్థలు వివిధ జాతీయ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.5,700 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా చౌదరి సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదనే సమాచారంతో ఈ గ్రూపు కంపెనీల (లిస్టెడ్‌ కంపెనీలు) వాటాలను కొన్న షేర్‌ హోల్డర్లు భారీగా నష్టపోయారు.

సీబీఐ విచారణలో సుజానా దోపిడీ రట్టు
డొల్ల కంపెనీల పేర్లతో రుణం తీసుకుని చెల్లించకుండా మోసం చేశారంటూ సుజనా చౌదరిపై బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌ల నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదు చేసింది. కాగితంపై మాత్రమే కన్పించే పరిశ్రమల్లో చేయని ఉత్పత్తిని చేసినట్లు చూపి, భారీగా పన్నులు చెల్లిస్తున్నట్లు చూపి పలు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న సుజానా చౌదరి వాటిని సూట్‌ కేసు కంపెనీల ద్వారా దారిమళ్లించి దోచేశారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుజనా చౌదరి కంపెనీల కేసు నమోదు చేసి విచారణ చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో సుజానా చౌదరికి చెందిన కంపెనీలు, ఇళ్లు, ఆయా సంస్థల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఒక్క హైదరాబాద్‌ నాగార్జున హిల్స్‌లోని సుజానా చౌదరి ఇంట్లోనే 126 సూట్‌ కేసు కంపెనీలకు సంబంధించిన రబ్బర్‌ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. బ్యాంకులను మోసం చేసి తీసుకున్న రుణాన్ని సూట్‌ కేసు కంపెనీల ద్వారా దారిమళ్లించి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ తేల్చింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్‌ల బ్యాంకుల నుంచే రూ.363 కోట్లు కొల్లగొట్టి మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తేల్చి.. చెన్నై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును విచారణకు చేపట్టిన చెన్నై కోర్టు.. సుజనా చౌదరి, ఆ సంస్థల డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. 

బ్యాంకులను కొల్లగొట్టడంలో ఘనుడు
► సుజనా గ్రూపునకు చెందిన రెండు ప్రధాన కంపెనీలు (సుజనా యూనివర్శల్, సుజనా టవర్స్‌) కలిపి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)కు రూ.920 కోట్లు మేర రుణాలు ఎగవేశాయి.
► సుజనా యూనివర్శల్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ అయిన హెస్టియా హోల్డింగ్స్‌ లిమిటెడ్, నువాన్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ సంస్థలు మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు నుంచి రూ.107 కోట్లు రుణం తీసుకుని చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ రుణానికి, సుజనా యూనివర్శల్‌ ఇండస్ట్రీస్‌ భారతదేశంలోని ఆ సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంకు సమాచారం ఇవ్వకుండానే కార్పొరేట్‌ గ్యారంటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు పిటిషన్‌ దాఖలు చేసింది.
► బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టŠస్‌ లిమిటెడ్‌ పేరుతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం తీసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సుజానా గ్రూపు సమర్పించడంపై సీబీఐకి ఆ బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది.
► సుజానా గ్రూపు సేల్స్‌ ట్యాక్స్, సెంట్రల్‌ ఎక్సైజ్, కస్ట్‌మ్స్, ఇన్‌కమ్‌ ట్యాక్సుల రూపంలో రూ.962 కోట్లు ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది.

దోపిడీ సొమ్ముతో భారీగా భూముల కొనుగోలు
బ్యాంకుల నుంచి దోచేసిన సొమ్ముతో దేశ, విదేశాల్లో సుజానా చౌదరి భారీ ఎత్తున ఆస్తులు పోగేశారు. చంద్రబాబుకు సయామీ కవల అయిన సుజనా చౌదరి 2014లో రాజధానిపై ప్రకటన వెలువడక ముందే.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. బ్యాంకులను దోచేసిన సొమ్ముతోనే సుజానా ఈ ఆస్తులను కొన్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 126 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సీఆర్‌డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో సర్వే నంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రైతుల నుంచి తక్కువ ధరకు ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సోదరుడు యలమంచిలి జతిన్‌ కుమార్‌ పేరుతో ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్‌ బ్లాక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సర్వే నంబర్లు 404–1, 404–5, 404–6లో 11.56 ఎకరాలను ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు, షెల్‌ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఈడీ నిగ్గు తేల్చడం గమనార్హం. ఈ అక్రమాల నుంచి బయటపడేందుకే చంద్రబాబు సూచనల మేరకు బీజేపీలో సుజానా చేరారనే అనుమానాలు ఉన్నాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top