ఖోఖో విజేతలు విశాఖ, చిత్తూరు
అగనంపూడి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి అండర్14 ఖోఖో టోర్నమెంట్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. గత నెల 28 నుంచి మూడు రోజుల పాటు బాలబాలికలకు జరిగిన ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. లంకెలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జట్లు తమ సత్తా చాటాయి. బాలుర విభాగం ఫైనల్స్‌లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. చిత్తూరు జట్టు రెండో స్థానంలో నిలవగా, గుంటూరు జట్టు మూడో స్థా నాన్ని దక్కించుకుంది. బాలికల విభాగంలో చిత్తూరు జట్టు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి చాంపియన్‌గా నిలిచి కప్ గెలుచుకుంది. విశాఖ జట్టు రన్నరప్‌గా నిలవగా, శ్రీకాకుళం జట్టు మూడో స్థానాన్ని కై వసం చేసుకుంది. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనకాపల్లి డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, జిల్లా ఉప విద్యాశాఖాధి కారి పొన్నాడ అప్పారావు, హెచ్‌ఎం రౌతు నాగేశ్వరరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


