6న జెడ్పీ సర్వసభ్య సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : ఈ నెల 6న జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.
పేలుడు పదార్థాలు
స్వాధీనం
– ముగ్గురి అరెస్ట్
బంగారుపాళెం : అక్రమంగా పేలుడు పదా ర్థాలు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదివారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని గౌరీశంకరపురానికి చెందిన ఆనందనాయుడు కట్టురాళ్ల వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. బండరాళ్లను పగులగొట్టేందుకు వెదుకుకుప్పం మండలం దేవరగుడిపల్లెకు చెందిన నాగరాజ, యాదమరి మండలం ఓటేరుపల్లెకు చెందిన ధనుంజయరెడ్డి నుంచి పేలుడు పదార్థాలను తెప్పించుకున్నాడని తెలిపారు. సమాచారం అందుకున్న తమ సిబ్బంది దొరచెరువు వద్ద కాపుకాచి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. వారి నుంచి 50 కేజీల సల్ఫర్ సాల్ట్ బ్యాగ్, 100 డిటోనేటర్లు, 200 జిలెటిన్ స్టిక్‌లు, 25 సేఫ్టీ ఫ్యూజ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సంపులో పడి చిన్నారి మృతి
పుంగనూరు: మండలంలోని మోదుగులపల్లె గ్రామంలో నివాసం ఉన్న అమరనాథ్ కుమార్తె ప్రణీత (6) ఆదివారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెదుకుతుండగా, సంపులో పడినట్లు గుర్తించారు. వెంటనే బాలికను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనతో కుటుంబం, గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
6న జెడ్పీ సర్వసభ్య సమావేశం


