మన అడవుల్లో పులులున్నాయా?
జంతుగణన
చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు కార్పొరేషన్ : పులులు, ఇతర జంతువుల గణనకు అటవీశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి నాలుగేళ్లకోసారి అటవీ ప్రాంతంలోని జంతువుల గణన ప్రక్రియను నిర్వహిస్తారు. జిల్లాలో జంతుగణన ప్రక్రియను సోమవారం నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. గతంలో జంతువుల గణన పుస్తకాల్లో మాత్రమే నమోదు చేసేవారు. ఇప్పుడు ఆన్‌లైన్ పద్ధతి ద్వారా లెక్కింపు చేయనున్నారు. గణనలో పాల్గొనే సిబ్బందికి ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు.
1.95 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం
జిల్లాలో 1.95 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. చిత్తూరు ఈస్ట్, వెస్ట్, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పంతో మొత్తం 6 రేంజ్‌లు ఉన్నాయి. మొత్తం 24 సెక్షన్లు, 84 బీట్లు నందు లెక్కింపు చేయనున్నారు. జంతువులతోపా టు వారు పర్యటించే పరిసర ప్రాంతాల్లో ఏయే రకాల చెట్లు ఉన్నాయో అనే వివరాలను కూడా అటవీశాఖ సిబ్బంది నమోదు చేయనున్నారు.
ప్రతి నాలుగేళ్లకూ గణన
ప్రతి నాలుగేళ్లకోసారి అభయారణ్యాల్లో పులులు, జంతు గణన సర్వే జరుగుతుంది. జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, అడవి దున్నలు, గద్దలు, నెమళ్లు, చుక్కల దుప్పులు, ముళ్ల పందులు, నక్కలు, ముంగీసలు, అడవి దున్నలు ఉన్నట్లు గతంలో గుర్తించారు.
గణనను పర్యవేక్షిస్తున్న అటవీశాఖ అధికారులు (ఫైల్)
కెమెరాలకు చిక్కిన అటవీ జంతువులు (ఫైల్)
సంసిద్ధంగా ఉన్నాం
రేంజ్ పరిధిలోని ప్రతి బీట్ నందు ముగ్గురు సిబ్బంది సర్వే చేయనున్నారు. దీనికి సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 8 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 8 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు డీఎఫ్‌ఓ ఆదేశాల మేరకు అందరూ గణనకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైన ప్రాంతాల్లో గ్రామస్తుల సహకారం తీసుకొని జంతువులు, వాటి పాదముద్రలు, ఇతర గుర్తులను సిబ్బంది ఆన్‌లైన్ చేయనున్నారు.
– థామస్, చిత్తూరు ఈస్ట్ ఎఫ్‌ఆర్వో
8 రోజుల ప్రక్రియ
అరణ్యంలో సుమారు 8 రోజుల పాటు జంతు గణన ప్రక్రియ జరగనుంది. మొదటి మూడు రోజులు అటవీ శాఖ సిబ్బంది తమకు నిర్ణయించిన 3 కిలోమీటర్ల పరిధిలో కాలినడకన తిరుగుతూ జంతువుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తిస్తారు. ఐదు రోజులు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర మాంసాహార జంతువులను గుర్తిస్తారు. అలాగే జంతువులు నేరుగా కనిపిస్తే ఫొటోలు తీయడంతోపాటు వారు సంచరించే సమయంలో జంతువుల పెంటికల్, పాదముద్రలను గుర్తిస్తారు. అడవుల్లో సంచరించే పశువుల కాపర్లతోపాటు అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండే ప్రజల నుంచి కూడా జంతువుల వివరాలను అడిగి తెలుసుకుంటారు.
మన అడవుల్లో పులులున్నాయా?
మన అడవుల్లో పులులున్నాయా?
మన అడవుల్లో పులులున్నాయా?


