ఆన్‌లైన్‌లో బోయకొండ గంగమ్మ దర్శనం టికెట్లు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దేవస్థానానికి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఆన్‌లైన్ ద్వారా టికెట్లు, ప్రసాదాలు, వివిద సేవలు పొందవచ్చని ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా కూడా ఆలయ సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మన మిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 తోపాటు https:// www. aptemples. org వెబ్‌సైట్ ద్వారా ఆలయ సేవలు పొందవచ్చని చెప్పారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక కౌంటర్‌లో ఆధార్ కార్డులను పరిశీలించి దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. దర్శనం, ప్రసాదాలు, వసతి సముదాయం కోసం ఆసక్తిగల భక్తులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఆలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భక్తులతో కిటకిట
ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. చిరుజల్లులను సైతం లెక్కచేయకుండా మహిళలు, ఉపవాస దీక్షలతో ఆలయం వద్దకు చేరుకుని గంగమ్మకు పూజలు చేసి జంతుబలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయంలో రద్దీతో క్యూలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకొన్నారు.
ఆన్‌లైన్‌లో బోయకొండ గంగమ్మ దర్శనం టికెట్లు


