జూద‘కొండ’
నేతల కనుసన్నల్లోనే దందా
మండల వ్యాప్తంగా పేకాట జోరుగా సాగుతోంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకొన్నప్పటికీ టీడీపీ నేతల కనుసన్నల్లో విధులు నిర్వహించాల్సి వస్తున్నట్లు సమాచారం. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధిక మొత్తంలో సొమ్ము పట్టుబడినా కొంత మేరకు సొమ్ము , పేకాట నిర్వాహకులను అరెస్ట్ చూపించి పలుకుబడి ఉన్న వారిని వదిలేస్తున్నారని సమాచారం. ఓ వ్యక్తి పేకాట స్థావరం, నిర్వహణ ఏర్పాట్లు చూసుకొంటూ పోలీసుల దాడుల నుంచి రక్షించేలా ఏర్పాటు చేశారని చర్చ సాగుతోంది. ఇందుకోసమే మేజా అంటూ పేకాట లో కొంతసొమ్ము ఇస్తారని అతనే ఆ బాధ్యత తీసుకుంటూ పేకాటను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అతడికి మండలస్థాయి ఓ కూటమి నేత అండదండలు ఉండడం విశేషం.
చౌడేపల్లె : అసాంఘిక కార్యకలాపాలకు బోయకొండ పరిసర అటవీ ప్రాంతం అడ్డాగా మారుతోంది. విచ్చలవిడిగా పేకాట దందా సాగుతున్నా పోలీసుల నిఘా కొరవడింది. పేకాట నిర్వహణ దారులతో మామూళ్లు తీసుకొని పేకాట నిర్వహణకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోయకొండకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు వేల మంది వస్తుంటారు. ఈ క్రమంలో అదే రీతిలో పేకాటతో పాటు వ్యభిచారం జోరుగా సాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బోయకొండ ప్రధాన రహదారినుంచి లక్ష్మీపురానికి వెళ్లే మార్గంలో సుమారు 5 కి.మీ. దూరం గల అటవీ ప్రాంతంలో గత ఏడాది సెప్టెంబరు 12న అంతర్ జిల్లాల నుంచి వచ్చిన వారితో కలిసి పేకాట నిర్వహిస్తుండగా పలమనేరు సబ్ డివిజనల్ ఐడీ పార్టీ, స్పెషల్ బ్రాంచి సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించి రూ.13.81 లక్షల నగదు, 20 బైక్‌లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 13 మందిపై అప్పట్లో కేసు నమోదు సంచలనంగా మారింది. కొద్ది రోజులపాటు ప్రశాంతంగా ఉన్న పరిసర ప్రాంతాలు కొంత మంది టీడీపీ నేతల అండదండలతో మళ్లీ పేకా ట స్థావరాలు పుంజుకున్నాయని ప్రజలు చెబుతున్నారు.
జూదంతో పాటు వ్యభిచారం
బోయకొండ పరిసర ప్రాంతం పేకాటతో పాటు వ్యభిచారానికి నిలయంగా మారుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ రహస్య ప్రాంతాల్లో ప్రేమ జంటలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అటవీ ప్రాంతంతో పాటు రోడ్డు పక్కనున్న గుట్లలోకి వెళ్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అంటూ ఆ దృశ్యాలను గమనించిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరికొందరైతే రూముల్లోనే వ్యభిచార దందా సాగిస్తున్నారని ప్రజలు నుంచి ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఎవరినీ వదిలిపెట్టం
అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకొంటాం. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. పేకాట, వ్యభిచారం చేయడం చట్టరీత్యా నేరం, అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, నిర్వహణకు సహకరించిన వారిని వదిలిపెట్టం.
– నాగేశ్వరరావు, ఎస్‌ఐ, చౌడేపల్లె
జూద‘కొండ’


