
బోయకొండ కిటకిట
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆలయంలో క్యూలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి దీపాలు, దీవెలతో మేళ తాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.