
విదేశీ పర్యటనలకు బీమా ఉండాల్సిందే..
ఊహించని పరిస్థితుల్లో ఆదుకునే సాధనం
అనారోగ్యం, ప్రమాద ఘటనల్లో పరిహారం
విమాన రద్దు, బ్యాగేజీ నష్టానికీ చెల్లింపులు
ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు
ప్రీమియం భారం కాదు.. తక్కువే
కొత్త జంట హనీమూన్ కోసమని యూరప్ దేశాలకు ప్రయాణమైంది. రెండో రోజు వారి లగేజీ బ్యాగ్ కనిపించకుండా పోయింది. అందులో విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉండడంతో ఆందోళన చెందిన ఆ జంట పర్యటనను కుదించుకుని వెంటనే వెనక్కి వచ్చేసింది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది. కానీ, తక్కువ ప్రీమియంకు వస్తుందని చెప్పి చౌక ప్లాన్ తీసుకోవడంతో అది అక్కరకు రాలేదు. ఫలితంగా పర్యటనను ఆస్వాదించకుండానే, ఆర్థిక నష్టంతో వెనుదిరగాల్సి వచ్చింది. అన్ని విధాలుగా ఆదుకునే ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన కల్పించే కథనమిది...
నేడు విదేశీ విహార యాత్రలకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. దుబాయ్, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ తదితర పర్యాటక ప్రదేశాలను తక్కువ సమయంలోనే చూసి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. విద్య, వ్యాపార అవకాశాల కోసం.. దూరంగా ఉన్న పిల్లలను చూసి వచ్చేందుకు ఎంతో మంది విదేశాలకు వెళ్లివస్తున్నారు. కానీ, ఈ సమయంలో తప్పకుండా ఉండాల్సిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పట్ల అశ్రద్ధ కనిపిస్తోంది.
బీమా అన్నది వీసా కోసం తీసుకునేది ఎంత మాత్రం కాదు. ఊహించనివి జరిగితే ఆదుకునే మొదటి సాధనమే ఇది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురుకావొచ్చు. విమానం ఆలస్యం కావొచ్చు. పాస్‌పోర్ట్ కనిపించకుండా పోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ చేదోడుగా నిలుస్తుంది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో అడుగు పెట్టాలంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటేనే సాధ్యం. కనుక దీని ప్రాధాన్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, సమగ్ర బీమా రక్షణతో పర్యటనకు ప్లాన్ చేసుకోవడం మంచిది.
వైద్య రక్షణ
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉండే అత్యంత ముఖ్యమైన సదుపాయం మెడికల్ కవరేజీ. యూఎస్, కెనడా లేదా యూకే వంటి దేశాల్లో వైద్య చికిత్సల వ్యయాలు భారీగా ఉంటాయి. ఆయా దేశాల్లో పర్యటించే వారు అనారోగ్యంతో లేదా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీయే చెల్లింపులు చేస్తుంది.
అంతేకాదు సర్జరీ చేయాల్సి వచ్చినా లేదా వైద్య పరంగా అత్యవసరంగా ఉన్న చోట నుంచి ఆస్పత్రికి తరలించడానికి అయ్యే వ్యయాలను సైతం బీమా కంపెనీయే భరిస్తుంది.
అనారోగ్యం కారణంగా విదేశాల్లోనే నిర్ణీత కాలానికి మించి ఉండాల్సిన సందర్భాల్లో అయ్యే ఖర్చులను సైతం దీని కింద పొందొచ్చు. తిరుగు ప్రయాణానికి ఆరోగ్యం సహకరిస్తుందని వైద్యులు ధ్రువీకరించేంత వరకు సాయం తీసుకోవచ్చు. కుటుంబంతో కలసి వెళుతుంటే అందరికీ కలిపి (60 ఏళ్లలోపు ఇద్దరు పెద్దలు, 21 ఏళ్లలోపు పిల్లలు) ఒకటే పాలసీ తీసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం విడిగా తీసుకోవాలి. కేవలం 2–3 రోజుల పర్యటనకు ట్రావెల్ ఇన్సూరెన్స్
వృథా అని భావించొద్దు.
లగేజీ కోల్పోతే..
మీకు సంబంధించిన లగేజీని ఎవరైనా చోరీ చేసినా లేదా కనిపించకుండా పోయిన సందర్భాల్లోనూ ఈ పాలసీలో రక్షణ ఉంటుంది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ సరిగ్గా లేని కారణంగా బ్రీఫ్ కేసులోని విలువైన వస్తులకు నష్టం వాటిల్లినట్టయితే.. క్రెడిట్/డెబిట్ కార్డు/పాస్‌పోర్ట్‌లను కోల్పోయిన సందర్భాల్లోనూ ఆర్థిక నష్టాలను భర్తీ చేస్తుంది. కోల్పోయిన వాటిని తిరిగి పొందేందుకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీ నుంచి పొందొచ్చు.
మనవల్ల ఇతరులకు నష్టం జరిగితే..
పర్యటన సమయంలో మన తప్పిదం లేదా మన పిల్లల కారణంగా ఎవరికైనా గాయం కావడం లేదంటే ఇతరుల ప్రాపర్టీకి నష్టం వాటిల్లడం వంటి సంఘటనల్లో చెల్లింపుల మేర బీమా కంపెనీ నుంచి పరిహారం పొందొచ్చు. పాలసీ నియమ నిబంధనలపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది.
ఇంటికి రక్షణ
కొన్ని రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఇంటికి సైతం రక్షణ ఉంటోంది. పర్యటన సమయంలో ఇంట్లో చోరీ.. లేదంటే అగ్ని ప్రమాదం కారణంగా ఆస్తి నష్టం వాటిల్లితే ఆ మేరకు పరిహారం పొందొచ్చు.
ఫ్లయిట్ రద్దయితే..
విమానం అనుకున్న సమయానికి కాకుండా, షెడ్యూలింగ్ మారిపోతే లేదా వాతావరణం అనుకూలించక ఏకంగా సర్వీసు రద్దు అయితే, దీనివల్ల పర్యటన ప్రణాళిక దెబ్బతింటుంది. ఇలాంటివి చోటు చేసుకుంటే వేరొక విమాన సర్వీసులో బుక్ చేసుకునేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. హోటల్ బుకింగ్‌లపైనా నష్టపోవాల్సి వస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఇలాంటి ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది. ప్రయాణానికి చివరి ఘడియల్లో కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా ట్రిప్ రద్దు చేసుకోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు నష్టాన్ని ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. విదేశీ పర్యటనలో అనారోగ్యం లేదా ఇతర కారణాల దృష్ట్యా పర్యటనను కుదించుకోవాల్సి వచ్చిన సందర్భంలోనూ బీమా కంపెనీలు కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి.
వీటికి మినహాయింపులు..
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా సరే, కొన్ని మినహాయింపులు ఉంటాయి. ముఖ్యంగా ముందస్తు వ్యాధుల కారణంగా పర్యటన సమయంలో వైద్య చికిత్సలు అవసరం పడితే కవరేజీ ఉండదు. కావాలని గాయం చేసుకున్నా లేదా యుద్ధం, ఉగ్రవాదం, అల్లర్ల కారణంగా ఏర్పడే నష్టానికి పరిహారం రాదు. అధిక రిస్క్ ఉండే సాహస క్రీడలకు సంబంధించి మినహాయింపులు ఉంటాయి.
ప్రీమియం ఎంత ఉండొచ్చు?
అంతర్జాతీయ పర్యటన 3–5 రోజుల కోసం అయితే ఒక్కొక్కరికీ రూ.200–700 మధ్య ఉంటుంది (60 ఏళ్ల లోపు వారికి). ఎంపిక చేసుకున్న ప్రాంతం, వయసు, సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ)పై బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుంది. యూరప్ ట్రిప్ కోసం 50వేల నుంచి లక్ష డాలర్ల సమ్ ఇన్సూర్డ్ తీసుకునేట్టు అయితే.. ప్రీమియం రూ.500 వరకు ఉంటుంది. దేశీ పర్యటనలు అయితే ప్రీమియం రోజువారీ రూ.20–50 మధ్య ఉంటుంది.
తీసుకునే ముందు చూడాల్సినవి..
→ పాలసీ నియమ, నిబంధనలను పూర్తిగా చదివి వేటికి కవరేజీ ఉంటుంది? వేటికి ఉండదన్న విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని పాలసీల్లో ఖరీదైన ఎల్రక్టానిక్స్ వస్తువులకు కవరేజీ ఉండడం లేదు. ప్రీమియం ఎక్కువైనా సరే అన్నింటికీ రక్షణనిచ్చే పాలసీని తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది.
→ కొన్ని దేశాల వీసా నిబంధనలు ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు యూరప్ టూరిస్ట్ వీసా కోసం కనీసం 30,000 పౌండ్ల మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. కనుక వెళుతున్న దేశానికి సంబంధించిన నిబంధనలు తెలుసుకోవాలి. వీసా కోసం తప్పనిసరి కాకపోయినప్పటికీ.. పర్యటించే దేశాల్లో వైద్య సేవల ఖర్చులను తెలుసుకుని, అందుకు అనుగుణంగా మెరుగైన బీమా రక్షణతో పాలసీ తీసుకోవాలి.
→ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అన్నీ ఒకే రకమైనవి కావు. వ్యాపార పర్యటన, చదువు కోసం వెళ్లేవారు, కుటుంబంతో కలసి సెలవుల్లో విహరించేందుకు వెళ్లే వారు, సాహస క్రీడల కోసం వెళ్లేవారు తమకు అనుకూలమైన ప్లాన్లపై దృష్టి సారించాలి.
→ కేవలం విదేశీ పర్యటనల కోసమే అని కాదు. దేశీయంగానూ విహార యాత్రల కోసం వెళ్లేవారు సైతం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు.
→ దేశీయంగా రోడ్డు లేదా ట్రెయిన్ మార్గంలో టూర్‌కు ప్లాన్ చేసుకున్న వారు.. అప్పటికే తమ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్‌తోపాటు, వ్యక్తిగత ప్రమాద బీమా కలిగి ఉంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం ఉండదు. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అప్పటికే ఉన్న బీమా ప్లాన్ ద్వారా నగదు రహిత సేవలు పొందొచ్చు. బస్సు, రైలు, హోటల్ బుకింగ్‌లు రద్దు చేసుకున్నా, పూర్తి మొత్తం వెనక్కి వచ్చే విధంగా జాగ్రత్త పడితే సరిపోతుంది.
→ కేవలం 24 గంటల ప్రయాణమే అయి, హోటల్ లేదా ఫ్లయిట్ బుకింగ్‌లు లేకుండా వెళ్లే వారికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరపడదు.
→ దేశీ పర్యటనలు, అవి కూడా సమీప ప్రాంతాల్లోని వాటికి ట్రావెల్ ఇన్సూరెన్స్ అంత లాభదాయం కాదు. దేశంలోనే పర్వత ప్రాంతాలు, సున్నితమైన మారుమూల పర్యాటక ప్రదేశాలు, విదేశీ పర్యటనలకు ఇది ఉపయోకరంగా ఉంటుంది.
→ ప్రీమియం తక్కువే ఉంటుంది. కనుక, అనవసర ఖర్చు కింద చూడడం సరికాదు.
→ హెల్త్ లేదా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ లేని వారు మాత్రం దగ్గర, దూర పర్యటనంతో సంబంధం లేకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
ఈ తప్పులు చేయొద్దు..
→ కొన్ని దేశాల వీసా ప్రాసెసింగ్‌కు బీమా తప్పనిసరి అని చెప్పి, చౌక పాలసీ తీసుకోవద్దు. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోనప్పుడు పాలసీ ఉన్నా నిష్ప్రయోజనమే.
→ పర్యటనలో ఏ ఇబ్బందీ రాదులే లేదా కొన్ని రోజులే కదా అని భావించి బీమాను పక్కన పెట్టొద్దు.
→ పాలసీ తీసుకునే నాటికి ఉన్న ఆరోగ్య సమస్యలను తప్పకుండా వెల్లడించాలి.
→ రూ.100–200 ఆదా కోసం తక్కువ కవరేజీకి పరిమితం కావొద్దు.
→ కొన్ని క్రెడిట్ కార్డులు ఆఫర్ చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్‌పై ఆధారపడొద్దు. వాటి కవరేజీ ఎన్నో షరతులు, పరిమితులతో ఉంటుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్