
న్యూఢిల్లీ: ఐఎంపీఎస్ (ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్) లావాదేవీలను సవరిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ఐఎంపీఎస్ ద్వారా నిర్వహించే నగదు బదిలీ రూ.25,000 దాటితే రూ.2 నుంచి రూ.10 వరకు చార్జీ, దీనిపై జీఎస్‌టీ అమలవుతుంది.
రూ.25,000కు పైన రూ.లక్షలోపు లావాదేవీపై రూ.2, రూ.1–2 లక్షల లావాదేవీపై రూ.6, రూ.2–5 లక్షల లావాదేవీలపై రూ.10 చొప్పున చార్జీతో పాటు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.. బ్యాంక్ శాఖల ద్వారా నిర్వహించే ఐఎంపీఎస్ లావాదేవీలపై ఇక ముందూ ఎలాంటి చార్జీలు ఉండవని పేర్కొంది. వేతన ఖాతాదారులు సైతం ఎలాంటి చార్జీల్లేకుండా ఐఎంపీఎస్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కరెంట్ ఖాతా (గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోడియం, ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి)లకూ ఈ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది.