
క్విప్ ద్వారా రూ.25,000 కోట్లు
బాండ్ల జారీతో రూ.20,000 కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నిధుల సమీకరణకు తెరతీసింది. షేరుకి రూ.811.05 ఫ్లోర్ ధరలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టింది. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. అయితే ఫ్లోర్ ధరకంటే 5 శాతం డిస్కౌంట్‌లో క్విప్‌ను పూర్తి చేసే వీలున్నట్లు తెలియజేసింది. షేరు తాజా ధర రూ. 831.55తో పోలిస్తే ఫ్లోర్ ధర సైతం 2.5 శాతం తక్కువకావడం గమనార్హం! వీటికితోడు రుణ సెక్యూరిటీల(బాండ్లు) జారీ ద్వారా మరో రూ. 20,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీ ఇన్వెస్టర్లకు బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ.45,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. ఈ ఏడాది మే నెలలో ప్రయివేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.25,000 కోట్ల సమీకరణకు ఎస్‌బీఐ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్‌లో బ్యాంక్ వాటాదారులు సైతం ఇందుకు ఆమోదముద్ర వేశారు. కాగా.. ఎస్‌బీఐ ఇంతక్రితం 2017–18లో క్విప్ ద్వారా రూ. 15,000 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే! భవిష్యత్తులో రుణ వృద్ధికి, మూలధన వ్యయానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు.
రిలయన్స్ సంస్థలు సైతం
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బోర్డు వివిధ మార్గాలలో రూ.9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్ లేదా క్విబ్ తదితరాల ద్వారా రూ.6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్ ప్లేస్‌మెంట్ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది.
రిలయన్స్ పవర్ బోర్డు వివిధ మార్గాలలో రూ. 9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్ లేదా క్విబ్ తదితరాల ద్వారా రూ. 6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్ ప్లేస్‌మెంట్ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది.