
రూ.కోట్లు పెట్టి కొన్న వస్తువులు కూడా కొన్ని సందర్భాల్లో పనికిరాకుండా పోతుంటాయి. సాధారణ సగటు వస్తువులే మేలనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఇది. సుమారు రూ.10 కోట్ల ధర ఉండే రోల్స్‌రాయిస్ (Rolls Royce ) కారు.. వరద నీటిలో చిక్కుకుని ఇక నావల్ల కాదంటూ ముందుకెళ్లకుండా మొరాయిస్తే.. రూ.10 లక్షల లోపుండే మామూలు కార్లు రయ్‌మంటూ దూసుకెళ్లాయి.
కోల్‌కతాలో (Kolkata) అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచి ఉంది. ఈ క్రమంలో ఓ రోల్స్ రాయిస్ కారు ఆ వరద నీటిలో నిలిచిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో టాటా వాహనంలో ప్రయాణిస్తున్న ఒక వాహనదారుడు రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు వరద నీటిలో ఎలా చిక్కుకుపోయిందో పేర్కొన్నారు. రూ .10 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కారు కంటే తన రూ .10 లక్షల టాటా కారే నయం అంటూ ఈ క్లిప్‌లో ఆ వాహనదారుడు వ్యాఖ్యానించారు. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని బాలీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మార్కెట్లోకి కొత్త ఈవీ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 172 కి.మీ.!
వైరల్‌గా మారిన ఈ వీడియోపై పలువురు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ప్రతిస్పందించారు. రోల్స్ రాయిస్ లగ్జరీ కారని, నీటితో నిండిన వీధుల్లో నడపడానికి ఉద్దేశించినది కాదని కొందరు వ్యాఖ్యానించగా, కోల్‌కతా నగర రోడ్ల దుస్థితిని మరికొంతమంది ప్రశ్నిస్తూ కామెంట్‌లు పెట్టారు.