బాండ్లలోకి.. సేఫ్‌ రూట్‌

RBI Retail Direct Scheme For Bond Investments - Sakshi

ప్రభుత్వ సెక్యూరిటీల్లో నేరుగా పెట్టుబడులు

సంస్థాగత ఇన్వెస్టర్ల మాదిరే అనుకూలత

లక్ష్యానికి అనుకూలమైన ఎంపికకు వెసులుబాటు

కాలవ్యవధి వరకు కొనసాగితే స్థిరమైన రాబడులు

పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి. దీర్ఘకాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించుకోవాలి. రాబడులు కూడా స్థిరంగా ఉండాలి. ఇలా కోరుకునే రిటైల్‌ ఇన్వెస్టర్లకు.. ప్రభుత్వ బాండ్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది. స్టాక్‌ బ్రోకర్‌ ద్వారా ‘ఎన్‌ఎస్‌ఈ గోబిడ్‌’ ఖాతా తెరిచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. లేదంటే ఆర్‌బీఐ తీసుకొచ్చిన రిటైల్‌ డైరెక్ట్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ (ఆర్‌డీజీ) అకౌంట్‌ రూపంలో అయినా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయవచ్చన్నది చూద్దాం..

స్టాక్‌ మార్కెట్‌ మాదిరే ప్రభుత్వ బాండ్లకు సంబంధించి కూడా ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌లు ఉన్నాయి. ఈక్విటీ ప్రైమరీ మార్కెట్లో వివిధ కంపెనీల ప్రమోటర్లు ఐపీవో రూపంలో (ప్రైమరీ మార్కెట్‌) షేర్లను ఆఫర్‌ చేస్తారు. ప్రభుత్వ బాండ్ల ప్రైమరీ మార్కెట్లో సర్కారు తరఫున ఆర్‌బీఐ బాండ్లను ఆఫర్‌ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను కాలానుగుణంగా ఆర్‌బీఐ వేలం నిర్వహిస్తుంటుంది. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రావిడెంట్‌ ఫండ్స్‌ తదితర ఇనిస్టిట్యూషన్స్‌ ఇందులో పాల్గొని కొనుగోలు చేస్తుంటాయి.

ఈ రూపంలో ప్రభుత్వానికి నిధులు సమకూరుతుంటాయి. ఇప్పుడు రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం సంస్థాగత ఇన్వెస్టర్ల మాదిరే ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్‌లు) వేలంలో పాల్గొని కొనుగోలు చేసుకోవచ్చు. నాన్‌ కాంపిటీటివ్‌ బిడ్‌ల రూపంలో ప్రత్యేక కోటా (5 శాతం) కింద పాల్గొని కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. భారత ప్రభుత్వ ట్రెజరీ బిల్లులు (టీ బిల్స్‌), డేటెడ్‌ సెక్యూరిటీలు (జీసెక్‌లు), ప్రభుత్వ బంగారం బాండ్లు (ఎస్‌జీబీలు), రాష్ట్రాభివృద్ధి రుణాలు (ఎస్‌డీఎల్‌) తదితర సెక్యూరిటీలు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజుల కోసం రుణాలు తీసుకోవాలని భావించినప్పుడు టీ బిల్లులను జారీ చేస్తుంది. డేటెడ్‌ జీసెక్‌లు, ఎస్‌డీఎల్‌ను ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధుల కోసం ఆర్‌బీఐ ఇష్యూ చేస్తుంటుంది. ఐపీవోలు ఎప్పుడైనా రావచ్చు. కానీ, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం అలా ఉండదు. ఆర్‌బీఐ దీన్ని కేలండర్‌ షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తుంటుంది. కనుక కొనుగోళ్లకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. డేటెడ్‌ సెక్యూరిటీల విషయంలో ఆరు నెలల ముందుగా ఆర్‌బీఐ వేలం కేలండర్‌(షెడ్యూల్‌)ను ప్రకటిస్తుంది. ఆర్‌బీఐ పోర్టల్‌ నుంచి ఈ వివరాలు తెలుసుకోవచ్చు.  
    
► ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత ప్రస్తుతానికి వేలంలో ఉన్న సెక్యూరిటీల వివరాలు కనిపిస్తాయి. టీ బిల్లులను ముఖ విలువ (ఫేస్‌వ్యాల్యూ) కంటే తక్కువకే ఆఫర్‌ చేస్తారు. ఉదాహరణకు 182 రోజుల టీబిల్లు (రూ.100 ముఖ విలువ)ను రూ.98కి వేలం వేస్తారనుకుంటే.. అప్పుడు మీకు లభించే రాబడి రేటు 1.09 శాతం అవుతుంది. జీసెక్‌ల వేలం ఈల్డ్‌ ఆధారితంగానూ ఉండొచ్చు. లేదా ధరల ఆధారితంగానూ ఉండొచ్చు. నూతన జీసెక్‌లు సాధారణంగా ఈల్డ్‌ ఆధారితంగానే ఉంటాయి. కూపన్‌ రేటు ఆధారంగా బిడ్‌ వేసుకోవచ్చు.

వేలం పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ అయిన తక్కువ కూపన్‌రేటును కటాఫ్‌ ఈల్డ్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో ఆ రేటే బాండ్‌పై లభించే వడ్డీ రేటు అవుతుంది. ధరల ఆధారిత వేలాన్ని కూడా ఆర్‌బీఐ నిర్వహిస్తుంటుంది. పాత తేదీలతో కూడిన జీసెక్‌లను తిరిగి జారీ చేసే సందర్భాల్లో ఇలా చేస్తుంది. పోటీతో కూడిన బిడ్డింగ్‌లో కటాఫ్‌ ఈల్డ్‌ కంటే తక్కువకు కోట్‌ చేసిన లేదా కటాఫ్‌ ప్రైస్‌ కంటే ఎక్కువకు కోట్‌ చేసిన ఇనిస్టిట్యూషన్లకు కేటాయింపులు చేస్తుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు.. ఇనిస్టిట్యూషన్లు నిర్ణయించిన కటాఫ్‌ ఈల్డ్‌/ధరల వద్ద కోట్‌ బిడ్‌ చేయాల్సి ఉంటుంది. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌లో సగటు రేటు ఆధారంగా బాండ్ల కేటాయింపు ఉంటుంది. సగటు రేటు కటాఫ్‌ రేటు కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు రిటైల్‌ ఇన్వెస్టర్లు ముఖ విలువ కంటే కొంచెం ఎక్కువకు జీసెక్‌లను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది.

సెకండరీ మార్కెట్‌
క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐఎల్‌) నెగోషియేటెడ్‌ డీలింగ్‌ సిస్టమ్‌ ఆర్డర్‌ మ్యాచింగ్‌ (ఎన్‌డీఎస్‌–వోఎం) ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ బాండ్లలో సెకండరీ ట్రేడింగ్‌ కొనసాగుతుంటుంది. టెలిఫోన్‌ ఆర్డర్లు కూడా ఇక్కడే నమోదవుతాయి. కనుక తాజా మార్కెట్‌ ఆక్షన్‌ కోసం, ధరలు, లిక్విడిటీ సమాచారం కోసం ఇందులో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ఆర్‌డీజీ ఖాతా సాయంతో సెకండరీ మార్కెట్లోనూ పాల్గొనవచ్చు. ఎన్‌డీఎస్‌–వోఎం రెండు విభాగాలను.. ‘రెగ్యులర్‌ మార్కెట్‌’, ‘ఆడ్‌ లాట్స్‌ విభాగం’ను ఆఫర్‌ చేస్తుంది. రెగ్యులర్‌ మార్కెట్‌లో ఒక లాట్‌ సైజ్‌ రూ.5కోట్లు. రూ.5కోట్లకంటే తక్కువ విలువ ట్రేడ్స్‌ కోసం ఆడ్‌లాట్స్‌ విభాగం పనిచేస్తుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఇక్కడే కొనుగోలు చేసుకోవాలి.

కొనుగోలు చేసుకోవాల్సిన ప్రభుత్వ సెక్యూరిటీల ప్రత్యక్ష ధరలను మార్కెట్‌ వేళల్లో  https:// www. ccilindia. com/ OMHome. aspx పోర్టల్‌ నుంచి తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వాటి కూపన్‌ రేటు, సంవత్సరం వారీగా ట్రేడవుతుంటాయి. ఉదాహరణకు పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ 0610 ఎ 2031 ఈ పేరుతో ట్రేడవుతుంది. ఇందులో 6.10 అన్నది కూపన్‌ రేటు. జీసెక్‌ 2031 అన్నది మెచ్యూరిటీ సంవత్సరాన్ని తెలియజేస్తుంది. ఫిక్స్‌డ్‌ రేటు బాండ్లు కూడా వాటి కూపన్‌రేటుతోనే ట్రేడవుతాయి. ఫ్లోటింగ్‌ రేటు బాండ్లు ఎఫ్‌ఆర్‌బీ పేరుతో ఉంటాయి. టీబిల్లులు మెచ్యూరిటీ సంవత్సరంతో ఉంటాయి. ఉదాహరణకు 091 ఈఖీఆ17022022 అన్నది.. 91 రోజుల ట్రెజరీ బిల్లు.. 2022 ఫిబ్రవరి 17న మెచ్యూరిటీ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎన్‌డీఎస్‌–వోఎం హోమ్‌పేజీలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న అన్ని సెక్యూరిటీలు కనిపిస్తాయి. ఏ ధర వద్ద ప్రారంభమైంది, కనిష్ట, గరిష్ట ధరలు కూడా ఉంటాయి.

ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌..
ఆర్‌బీఐ వద్ద ప్రారంభించే ఆన్‌లైన్‌ రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ అకౌంట్‌ (ఆర్‌డీజీ ఖాతా) ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా ద్వారా ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్‌ ఫ్రీ టెలిఫోన్‌ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా) కాల్‌ చేయడం లేదా, ఈమెయిల్‌ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవు. దేశీయంగా సేవింగ్స్‌ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్‌ ఐడీ, రిజిస్టర్‌ మొబైల్‌ నంబరుతో రిటైల్‌ ఇన్వెస్టర్లు నమోదు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు .. సెటిల్మెంట్‌ రోజున ఆర్‌డీజీ ఖాతాలోకి జమవుతాయి.

కాలవ్యవధి
బాండ్‌ నుంచి పొందే రాబడులపై కాలవ్యవధి ఎంతో ప్రభావం చూపిస్తుంది. 91 రోజుల టీబిల్లు లేదా 20ఏళ్ల జీసెక్‌లలో దేనిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి ఎలా వస్తారు? ఈ విషయంలో మీ ఆర్థిక లక్ష్యానికి ఎంత కాలం ఉందన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. మూడు నెలల్లో ఖర్చుల కోసం అయితే 91 రోజుల టీబిల్లు తీసుకోవాలి. రిటైర్మెంట్‌ కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు అయితే అప్పుడు 20ఏళ్ల జీసెక్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు మరో ప్రాధాన్య అంశం అవుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతుంటే, అప్పటికే మార్కెట్లో ఉన్న పాత బాండ్ల రేట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే కొనుగోలుదారులు అధిక కూపన్‌ రేటును ఆఫర్‌ చేస్తున్న తాజా బాండ్ల వైపు మొగ్గు చూపిస్తారు.

ఎంపిక చేసుకునే బాండ్‌ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటే కనుక రేట్ల పెరుగుదల సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. స్టాక్‌ సూచీల మాదిరే బాండ్ల రేట్లు కూడా మారుతుండడం సహజం. గడిచిన 20ఏళ్లలో ఆర్‌బీఐ రెపోరేటు 4–8 శాతం మధ్య కదలాడింది. పదేళ్ల జీసెక్‌ 5.8–9.1 శాతం మధ్య ట్రేడ్‌ అయింది. మనం ఇప్పుడు కనిష్ట రేట్ల వద్ద ఉన్నాం. కనుక దీర్ఘకాలంతో కూడిన వాటితో పోలిస్తే స్వల్పకాల బాండ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇక కాలవ్యవధిని పెంచుకుంటున్నామంటే రేట్ల పరంగా కొంచెం రిస్క్‌ తీసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి. కనుక కొంచెం అదనపు రేటు కోసం దీర్ఘకాలం సెక్యూరిటీని ఎంపిక చేసుకోవడం కాకుండా.. మీ లక్ష్యానికి సరిపడే కాలవ్యవధిపై ఉన్న బాండ్‌కే పరిమితం కావడం మంచిది.

సెక్యూరిటీ
టీబిల్లు, జీసెక్‌లను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. వీటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్స్‌ (ఎస్‌డీఎల్‌)పై రేటు సాధారణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కనుక వీటి ఎంపిక విషయమై తగిన అవగాహన లేకపోతే మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గం అనుకూలం.  

లిక్విడిటీ
ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ అన్నది.. షేర్లలో మాదిరి భారీగా ఉండదు. ముఖ్యంగా ఆడ్‌లాట్‌ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకునే వారు కాలవ్యవధి వరకు వేచి ఉండేందుకు ముందుగానే సన్నద్ధం కావాలి. ఒకవేళ గడువుకు ముందే వాటిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఎన్‌డీఎస్‌–వోఎంలో ఆయా బాండ్‌కు సంబంధించి మొత్తం ఎన్ని ట్రేడయ్యాయి అన్నది చూసుకోవాలి. ఇటీవలే ఇష్యూ అయిన 10ఏళ్లు, 5ఏళ్లు, 3ఏళ్ల జీసెక్‌లలో ట్రేడ్‌ వ్యాల్యూమ్‌ 70–80 శాతంగా ఉంది. దీర్ఘకాల జీసెక్‌లతో పోలిస్తే టీబిల్లులు, ఎస్‌డీఎల్‌లలో వ్యాల్యూమ్‌ తక్కువగా ఉంటుంది. ఈ లిక్విడిటీ అన్నది పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటుంది.

ఈ అంశాలకు ప్రాధాన్యం.. ప్రభుత్వ సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top