
నాకు రూ.4 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.40 లక్షల సూపర్ టాపప్ ప్లాన్‌ను మరో బీమా సంస్థ ఆఫర్ చేస్తోంది. తీసుకోవచ్చా? – షావలి
టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిడక్టబుల్‌కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్ అంటే, మొత్తం బిల్లులో అంతకు మించిన క్లెయిమ్‌కే చెల్లింపులు లభిస్తాయి. డిడక్టబుల్ మేర పాలసీదారు భరించాల్సి ఉంటుంది. సూపర్ టాపప్ ప్లాన్ తీసుకునేందుకు బేసిక్ కవరేజీ ఉండాల్సిన అసవరం లేదు. టాపప్ ప్లాన్‌లో డిడక్టబుల్ అనేది హాస్పిటల్‌లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. అదే సూపర్ టాపప్ ప్లాన్‌లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్ ఖర్చులకు డిడక్టబుల్ అమలవుతుంది. కనుక టాపప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాపప్ ప్లాన్ మరింత ప్రయోజనకరం. ఒకే సమయంలో రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు.
ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్ టాపప్ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్ పాలసీలో లేని రక్షణను సూపర్ టాపప్ ప్లాన్ ఇస్తుంటే తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్ పాలసీ నుంచి రూ.4 లక్షలు, మొదటి సూపర్ టాపప్ నుంచి రూ.6 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.8 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి రూ.8 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఎక్కువ సూపర్ టాపప్ ప్లాన్లు ఉంటే బీమా క్లెయిమ్ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. ఒకటికి మించిన సంస్థల వద్ద క్లెయిమ్ దాఖలుకు శ్రమించాల్సి వస్తుంది. బేసిక్ పాలసీకి అదనంగా ఒక్క సూపర్ టాపప్ ప్లాన్‌ను కలిగి ఉండడమే సౌకర్యం.
బంగారం, వెండి, ఈక్విటీలు, డెట్, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే మల్టీ అస్సెట్ ఫండ్స్‌తో ప్రయోజనాలు ఏమిటి? – నగేష్ బంగారు
మల్టీ అస్సెట్ ఫండ్స్ కనీసం మూడు రకాల సాధనాల్లో (సాధారణంగా ఈక్విటీ, డెట్, గోల్డ్) పెట్టుబడులు పెడుతుంటాయి. ఈక్విటీ మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. 2008 నుంచి సెన్సెక్స్ పది దారుణ పతనాలను గమనించండి. ఆ సమయంలో ఈక్విటీలు ఒక నెలలో 22.5 శాతం మేర నష్టపోయాయి. అదే సమయంలో బంగారం ధరలు కూడా తగ్గాయి. కాకపోతే ఈక్విటీలతో పోల్చి చూస్తే బంగారంలో క్షీణత తక్కువ. పెట్టుబడుల విలువను రక్షించే స్థాయిలో ఈ వ్యత్యాసం లేదు. 2008, 2024 సంవత్సరాలు ఇందుకు మినహాయింపు. అప్పుడు ఈక్విటీలతో పోల్చితే బంగారం మెరుగ్గా పనిచేసింది. దీర్ఘకాలంలో ఈక్విటీలంత కాకపోయినా, కొంత వ్యత్యాసంతో బంగారం సైతం మెరుగైన రాబడులను ఇచ్చింది. కనుక మెరుగైన రాబడుల కోణంలో కాకుండా వైవిధ్యం కోసం మల్టీ అస్సెట్ ఫండ్స్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: టారిఫ్‌లతో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు
