Anand Mahindra Success Story: బిల్‌గేట్స్‌ పేరెత్తితే ఆనంద్‌ మహీంద్రాకి చిరాకు.. కారణం ఇదే?

Padma Bhushan Anand Mahindra Success Story - Sakshi

Padma Bhushan Anand Mahindra Life Story In Telugu: సోషల్‌ మీడియాలో ఏదైనా వీడియో బాగా పాపులర్‌ అయితే అది వెంటనే ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియా అకౌంట్‌లో ప్రత్యక్షం అవుతుంది. సామాజిక అంశాల మొదలు స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ వరకు అన్నింటిపైనా ఆయన స్పందిస్తుంటారు. లక్ష కోట్ల రూపాయల బిజినెస్‌ నడిపించే వ్యక్తిగా ఆయన అసలే కనిపించరు. కారణం .. ఆయనకు సినిమాలంటే పిచ్చి.. సినిమాల్లోకి రావాలని హర్వర్డ్‌ యూనివర్సిటీలో చేరారు. కానీ పరిస్థితులు అనుకూలించక తిరిగి కుటుంబ బిజినెస్‌లోకే వచ్చారు. స్టీలు,  ట్రాక్టర్లు , జీపులు తయారు చేసే కంపెనీ కంప్యూటర్స్‌, ఎయిరోస్పేస్‌ వరకు తీసుకెళ్లారు. అతని సేవలను గుర్తించిన కేంద్రం ఇటీవల ఆనంద్‌ మహీంద్రాని పద్మభూషణ్‌తో సత్కరించింది.

మహీంద్రా అండ్‌ మహీంద్రా వ్యాపార సామ్రాజ్యానికి మూడో తరం వారసుడు ఆనంద్‌ గోపాల్‌ మహీంద్రా. 1953లో హరీష్‌ , ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. తమిళనాడులో స్కూలింగ్‌ పూర్తి చేసిన ఆనంద్‌ మహీంద్రా.. సినిమాలపై ఉన్న మక్కువతో 1977లో హర్వర్డ్‌ యూనివర్సిటీలో ఫిల్మ్‌మేకింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత మనసు మార్చుకుని తిరిగి వ్యాపారం వైపు మొగ్గు చూపారు. దీంతో అదే యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో మాస్టర్స్‌ చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. 

వ్యాపార మెళకువలు
1980వ దశకంలో స్టీలు వ్యాపారంలో జపాన్‌ గుత్తాధిపత్యం చెలాయిస్తుండేది. ప్రపంచంలో మరే దేశంలో మరే కంపెనీ జపాన్‌ సంస్థల ముందు నిలబడలేవు అనే పరిస్థితి ఉండేది. ఆ సమయంలో ముంబైలో ఉన్న మహీంద్రా ఉజిన్‌ స్టీల్‌​ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌) ఆఫీసరుగా 1981లో చేరారు. అక్కడే ఉంటూ . జీపులు, ట్రాక్టర్లు, స్టీలు వ్యాపారాల నుంచి మహీంద్రా గ్రూపుని ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు విస్తరించారు. వ్యాపారంలో ఒక్కో మెళకువను ఒంటబట్టించుకుంటూ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు ఆనంద్‌లో ప్రతిభకు పరీక్ష పెట్టేందుకు మరో సవాల్‌ని ఆయన ముందు ఉంచారు తాత జగదీశ్‌చంద్ర.

తొలి పరీక్ష
సమ్మెలతో అట్టుడికి పోతున్న కండివాలీ ఫ్యాక్టరీ బాధ్యతలు 1991లో మహీంద్రాకు అప్పగించారు. ఆనంద్‌ పదవీ బాధ్యతలు స్వీకరించడమే ఆలస్యం ఫ్యాక్టరీలో మరోసారి పెద్ద సమ్మెకు పిలపునిచ్చారు కార్మికులు. ఫ్యాక్టరీలో తీవ​ ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఆనంద్‌ మహీంద్రా క్యాబిన్‌ని చుట్టుముట్టి గట్టిగా నినాదాలు ఇస్తున్నారు కార్మికులు. ఏ కొంచెం తేడా వచ్చినా యజమానిపై దాడి తప్పదు అనేంత భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చని.. ఫ్యాక్టరీ వదిలి వెళ్లాలంటూ నలువైపుల నుంచి సలహాలు వస్తున్నాయి. అ‍ప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నారు ఆనంద్‌ మహీంద్రా. 

నేరుగా రంగంలోకి
ఈ విపత్కర పరిస్థితుల్లో కార్మికులతో స్వయంగా చర్చలకు దిగారు ఆనంద్‌. మీ డిమాండ్లు ఒప్పుకోవాలన్నా.. దీపావళికి బోనస్‌లు ఇవ్వాలన్నా ఈ స్ట్రైక్‌ని ఇక్కడితో ఆపేసి పనిలోకి వెళితే మంచిది లేదంటే అంతే సంగతులు అంటూ ఖరాఖండీగా చెప్పారు. ఒక్క మాట అటు ఇటు అయితే భౌతిక దాడులకు అవకాశం ఉన్న చోట ఎంతో ధైర్యంగా కంపెనీ పరిస్థితులు, తన చేతిలో ఉన్న అవకాశాలను కార్మికులకు వివరించారు. అప్పటి వరకు కార్మికులతో మధ్యవర్తులే మాట్లాడే వారు.. సమస్య పరిష్కారం కాకుండా సుదీర్ఘకాలం సాగదీసేవారు. ఆ సంస్కృతికి భిన్నంగా యజమానే  స్వయంగా రంగంలోకి దిగడం. తనకు ఏం కావాలో.. తనేం చేయగలడో నేరుగా చెప్పడంతో కార్మికులకు కొత్తగా అనిపించింది. ఆనంద్‌ మహీంద్రా మాట గౌరవించి పనిలోకి వెళ్లారు. గత కొన్నేళ్లుగా చచ్చీ చెడీ యాభై శాతం ఉత్పత్తి మాత్రమే సాధించే ఆ ఫ్యాక్టరీ.. ఆనంద్‌ వచ్చాక ఆ ఏడాది 150 శాతం ఉత్పత్తిని సాధించింది. ఈ ఘటనతో మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ వ్యాపార సామ్రాజ్యం, అందులోని ఉద్యోగుల భవిష్యత్తుకి ఆనంద్‌ రూపంలో భరోసా లభించింది. 

తెగింపుకి తొలిమెట్టు
దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు వాహన తయారీ టెక్నాలజీ కోసం ఇప్పటికీ విదేశీ కంపెనీలపైనే ఆధారపడుతున్నాయి. ఈ పరంపరలోనే ఫోర్డ్‌ కంపెనీతో కలిసి ఎస్కార్ట్‌ కారుని మార్కెట్‌లోకి తెచ్చారు ఆనంద్‌ మహీంద్ర. తొలి ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఆనంద్‌ సామర్థ్యంపై నీలినీడలు కమ్మకున్నాయి. కానీ ఈ అపజయాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నారు ఆనంద్‌. ఆ ప్రాజెక్టులో పని చేసిన 300 ఇంజనీర్లు, ఇతర సభ్యులతో సొంతంగా టీమ్‌ని తయారు చేశారు. దేశీయంగా ప్యాసింజర్‌ వెహికల్‌ తయారీ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు ఆనంద్‌ మహీంద్రా. ఆ రోజుల్లో ఆ ప్రయత్నం ఆత్మహత్యాసదృశ్యమే. అనేక నిద్రలేని రాత్రులు ఆ టీం గడిపింది,.


స్కార్పియో సంచలనం
మహీంద్రా టీం చేసిన కృషితో దేశీ టెక్నాలజీతో  స్కార్పియో మార్కెట్‌లోకి వచ్చింది. ఆ కారు సక్సెస్‌ ఇండియా మార్కెట్‌నే కాదు ప్రపంచ మార్కెట్‌నే మార్చేసింది. అప్పటి వరకు విదేశీ టెక్నాలజీపై ఆధారపడిన ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి చుక్కానిలా పని చేసింది. యూరప్‌, ఆఫ్రికా దేశాల్లో సైతం స్కార్పియో వాహనాల అమ్మకాలు దుమ్ము రేపాయి. ఆ రోజుల్లో యుటిలిటీ వెహికల్‌ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ మార్కెట్‌ వాటా 4.9 శాతం ఉంటే స్కార్పియో వాటా ఏకంగా 36 శాతానికి పెరిగింది. అదే ఒరవడిలో తర్వాత మహీంద్రా నుంచి జైలో ఎక్స్‌యూవీ సిరీస్‌, కేయూవీ సిరీస్‌లతో పాటు ఆఫ్‌రోడ్‌లో సంచలనం సృష్టిస్తున్న థార్‌ వంటి వెహికల్స్‌ వచ్చాయి. 

మహీంద్రా దూకుడు
దేశీ టెక్నాలజీ తయారైన స్కార్పియో విజయం ఆనంద్ మహీంద్రాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. దీంతో మహీంద్రా గ్రూపు కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా మహీంద్రా లోగోలో రైస్‌ని చేర్చి మహీంద్రా రైస్‌ అంటూ కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. స్వరాజ్‌ ట్రాక్టర్స్‌, పంజాబ్‌ ట్రాక్టర్స్‌, గుజరాత్‌ ట్రాక్టర్స్‌, రేవా ఎలక్ట్రిక్‌ కార్‌ వెహికల్స్‌, సత్యం కంప్యూటర్స్‌, ప్యూజియోట్‌ మోటార్‌ సైకిల్స్‌,  సాంగ్యాంగ్‌ మోటార్‌ సైకిల్స్‌ తదితర కంపెనీలను వేగంగా కొనుగోలు చేసి మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపుని విస్తరించారు. ఎయిరోస్పేస్‌లోకి కూడా అడుగు పెట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాక్టర్ల తయారీ కంపెనీ మహంద్రానే.

మహీంద్రా విస్తరణ
మహీంద్రా గ్రూపులో 1991లో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.  అప్పుడు కంపెనీ విలువ రూ.1,520 కోట్లు ఉండగా ముప్ప ఏళ్లలో 60 రెట్లు పెరిగి 2020 వచ్చే సరికి రూ. 96,241 కోట్లకు చేరుకుంది. పలు అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు , గౌరవ పదవులు చేపట్టారు. 

బిల్‌గేట్స్‌​ పేరు ఎత్తితే చిరాకు
ఆనంద్‌ మహీంద్రా భార్య పేరు అనురాధ. ఆమె జర్నలిస్టుగా పని చేస్తున్నారు. వెర్వే, మెన్స్‌ వరల్డ్‌ అనే పత్రికల నిర్వహిస్తున్నారు. ఆయనకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హర్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో బిల్‌గేట్స్‌, ఆనంద్‌ మహీంద్రా ఇద్దరు క్లాస్‌మేట్స్‌. బయట తాను ఎంత పెద్ద బిజినెస్‌ మ్యాన్‌ అయినా తన కూతుళ్లకు మాత్రం ఫెయిల్యూర్‌ పర్సన్‌లానే కనిపిస్తుంటానని ఆనంద్‌ మహీంద్రా అంటున్నారు.  అందుకు కారణం ఆయన కూతుళ్లెవాళ్లెప్పుడు బిల్‌గేట్స్‌తో నన్ను పోలుస్తూ ‘నువ్వో ఫెల్యూయర్‌ పర్సన్‌’ అని ఆటపట్టిస్తుంటారు. అందుకే నాకు బిల్‌గేట్స్‌ పేరు వింటేనే కోపం వస్తుందంటూ సరదగా తన కుటుంబ విశేషాలను మీడియాతో ఆయన పంచుకున్నారు.

సామాజిక సేవలో
వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన తర్వాత సామాజిక సేవల్లోకి వచ్చారు ఆనంద్‌ మహీంద్ర. సామాజిక సేవ కోసం నాంది ఫౌండేషన్‌ స్థాపించారు. అందులో ఆయనకు ఎక్కువ సంతృప్తి ఇచ్చింది చదువుకు దూరమైన పేద బాలికల కోసం చేపట్టిన నహీ కాలీ ప్రాజెక్టు. 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 3.30 లక్షల మంది ఆడ పిల్లలకు ఈ ప్రాజెక్టు ద్వారా విద్య అందుతోంది.

ఆనంద్‌ గోపాల్‌ మహీంద్రా ఘనతలు
- భారత ప్రభుత్వం నుంచి 2021 నవంబర్‌ 7న పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.
- ఫార్చూన్‌ మ్యాగజైన్‌ 2014లో ప్రకటించిన వరల్డ్‌ గ్రేటెస్ట్‌ లీడర్స్‌ -50లో చోటు దక్కించుకున్నారు.
- ఫార​‍్చూన్‌ ఆసియా మోస్ట్‌ పవర్‌ఫుల్‌ బిజినెస్‌ పీపుల్‌ 25లో స్థానం పొందారు
- ఫోర్బ్స్‌ పత్రిక 2013లో ఎంట్రప్యూనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించింది.

మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు విశేషాలు
- 1945లో ముహమ్మద్‌, జగదీశ్‌ చంద్ర మహీంద్రాలు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ఎం అండ్‌ ఎం పేరుతో కంపెనీ నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓవర్‌ లాండ్‌ అనే యూరప్‌ కంపెనీతో కలిసి ఆర్మీకి జీపులు తయారు చేసే పని దక్కించుంది. 
- దేశ విభజన సమయంలో ఈ సంస్థలో భాగస్వామిగా ఉన్న ముహమ్మద్‌ పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఆయన మంత్రి కూడా అయ్యారు. అయితే ఎం అండ్‌ ఎం గ్రూపులో తన తమ్ముళ్లని పార్ట్‌నర్లుగా జగదీశ్‌ చంద్ర చేర్చారు. అనంతరం కంపెనీ పేరును మహీంద్రా అండ్‌ మహీంద్రాగా మార్చారు.
- టాటా, మహీంద్రా గ్రూపులు చూపిన బాటలో ఇండియాలో స్టీలు పరిశ్రమ అంచెలంచెలుగా ఎదుగుతూ జపాన్‌ను వెనక్కి నెట్టింది. చైనా తర్వాత రెండో స్థానంలో నేడు ఇండియా నిలిచింది.

- 80,90వ దశకాల్లో రూరల్‌ ఇండియాలో కనెక్టివిటీకి మరోపేరుగా మహీంద్రా కమాండ్‌ జీపులు నిలిచాయి.
- మహీంద్రా గ్రూపుకి 72 దేశాల్లో కార్యాలయాలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. 100కు పైగా దేశాల్లో మహీంద్రా ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంది. 

వారి వల్లే ఈ ఘనత
పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించిన సందర్భంలో వచ్చిన ప్రశంసలకు ఆయన వినమ్రంగా స్పందించారు.. ఈ ఘనత వెనుక మహీంద్ర సంస్థ ఉద్యోగుల శ్రమ ఉందన్నారు. వారి భుజాలపై తాను నిలబడి ఈ అవార్డు అందుకున్నట్టుగా తెలిపారు.

- సాక్షి, వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top