ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు రూ.54 లక్షల కోట్లు

Nbfc Asset Base Scales Past Rs 54 Lakh Crore Says Mos Finance - Sakshi

ముంబై: ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు 2022 మార్చి నాటికి రూ.54 లక్ష కోట్లకు చేరాయని, వాణిజ్య బ్యాంకుల బ్యాలన్స్‌ షీట్‌ పరంగా చూస్తే పావు శాతం మేర ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కృష్ణారావు కరాడ్‌ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీలు కుప్పకూలిపోవడంతో, ఎన్‌బీఎఫ్‌సీ రంగం దీర్ఘకాలంగా సంక్షోభాన్ని చూడడం తెలిసిందే. దీన్నుంచి ఈ రంగం బయటకువచ్చి మెరుగైన పనితీరు చూపిస్తుండడాన్ని మంత్రి ప్రస్తావించారు. సీఐఐ నిర్వహించిన ఎన్‌బీఎఫ్‌సీ సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు.

సూక్ష్మ, మధ్య స్థాయి కంపెనీలకు రుణాలు అందించడం ద్వారా ఎన్‌బీఎఫ్‌సీలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్‌ఎంఈల కార్యకలాపాల విస్తరణకు, మరింత మందికి ఉపాధి కల్పనకు ఎన్‌బీఎఫ్‌సీలు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకులతో పోలిస్తే రుణాల మంజూరులో ఎన్‌బీఎఫ్‌సీలే అధిక వృద్ధిని చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌బీఎఫ్‌సీలు రుణాల పరంగా 10 శాతం వృద్ధిని చూపిస్తే, బ్యాంకుల రుణ వితరణ వృద్ధి ఇందులో సగమే ఉందన్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top